హిండెన్‌బర్గ్ నివేదిక ఆధారంగా దర్యాప్తు
డొల్ల కంపెనీలతో లింక్
అనుమానాస్పద లావాదేవీలు గుర్తింపు
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో అదానీ గ్రూప్ ఆర్థిక మోసాలపై విడుదల చేసిన నివేదిక మరోమారు అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి వచ్చింది. దీనిని ఆధారంగా చేసుకుని
గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి సన్నిహితులైన ఇద్దరు వ్యక్తుల ఖాతాలపై ఇటలీకి చెందిన అతిపెద్ద బ్యాంక్ ఇంటెసా సాన్‌పాలో అంతర్గత విచారణ చేపట్టింది. అదానీ గ్రూప్‌నతో సంబంధమున్న క్లయింట్ల ఆర్థిక లావాదేవీలను బ్యాంక్ నిశితంగా పరిశీలించిందని ఫైనాన్సీయల్ టైమ్స్ బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. వినోద్ అదానీ సహచరులైన తైవాన్‌కు చెందిన చాంగ్ చుంగ్ లింగ్, యూఏఈకి చెందిన నాసర్ అలీ షాబాన్ అహ్లీల ఖాతాల్లో కొన్ని అనుమానస్పద కార్యకలాపాలను ఆ బ్యాంక్ అధికారులు గుర్తించారు.
రూ.27వేల కోట్లు నిలిపివేత..!
సదరు వ్యక్తులు తాము ఎటువంటి తప్పు చేయలేదని వాదించినప్పటికీ.. వారి వివరణతో సంతృప్తి చెందని బ్యాంక్ యాజమాన్యం వారి ఖాతాలను నిలిపివేసిందని సమాచారం. ఆ బ్యాంక్ అంతర్గత మెమో ప్రకారం.. ఈ ఇద్దరు వ్యక్తులు హెడ్జ్ ఫండ్ల ద్వారా భారీ మొత్తంలో నిధులను కలిగి ఉన్నట్లు తేలింది. చాంగ్ చుంగ్ లింగ్ పేరు మీద 1 బిలియన్ డాలర్లు, నాసర్ అలీ షాబాన్ అహ్లీ పేరు మీద 2 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రూ.27వేల కోట్ల విలువ చేసే ఈ నిధులు అదానీ గ్రూప్ కంపెనీలలోనే అత్యధికంగా పెట్టుబడిగా ఉన్నట్టు ఆ బ్యాంక్ అనుమానిస్తోంది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాల్లోని డొల్లా కంపెనీలను ఉపయోగించి అదానీ షేర్ల అసలు యజమాని ఎవరనేది బయటకు తెలియకుండా ఈ లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
ఏమిటి ఈ వివాదం..?
అదానీ గ్రూపులోని వ్యక్తులు తమ సన్నిహితుల ద్వారా రహస్యంగా సొంత కంపెనీ షేర్లను కొనుగోలు చేసి.. తద్వారా కృత్రిమంగా షేర్ ధరలను పెంచుతున్నారనే హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఈ బ్యాంక్ నివేదిక బలాన్ని చేకూరుస్తోంది. భారతీయ నియమ నిబంధనల ప్రకారం.. కంపెనీ ప్రమోటర్లు లేదా వారి సన్నిహితులు తమ వద్ద ఉన్న వాటాలను స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. కాగా.. దీనిపై అదానీ గ్రూపు స్పందిస్తూ.. తాము అన్ని చట్టాలను, నిబంధనలను పాటిస్తున్నామని పేర్కొంది. మరోవైపు అదానీ అవకతవకలపై సెబీ, ఆర్బీఐ తదితర రెగ్యూలేటరీ సంస్థలు మిన్నకుండిపోతున్నాయని ప్రతిపక్షాలు, నిపుణులు విమర్శిస్తోన్న విషయం తెలిసిందే.



