సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ డిమాండ్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
భూ పోరాటం కొనసాగించాలి – అర్హులైన పేదలకు భూమి పంచాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గ్రామ శాఖ సమావేశం పొన్నబోయిన రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ హాజరై మాట్లాడుతూ.. కొలనుపాక గ్రామంలో కొనసాగుతున్న భూ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.సర్వే నంబరు 8లో ఉన్న మూడెకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు వెంటనే పంచాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పేదలకు సాగుభూమి, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని వారికి కేటాయించడం అత్యవసరమని అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై స్థానిక అధికారులను, కలెక్టర్‌ను, ఎమ్మార్వోను, ఎమ్మెల్యేను అనేకసార్లు కలిసి వినతిపత్రాలు అందజేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలను దృష్టిలో పెట్టుకొని భూమి పంపిణీ చేయాలని కోరారు. లేనియెడల భూమి పేదల చేతికి చేరేంతవరకు ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని, పేదల హక్కుల సాధనలో సిపిఐ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని చెక్క వెంకటేష్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు,తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు పోతు ప్రవీణ్, బైర నాగన్న, బర్ల ప్రశాంత్,మోతే భవాని, బొజ్జ శంకర్, సంధ్య, సుశీల,సంపత్,మౌనిక,కావడి సంధ్య, లక్ష్మి,సరిత తదితరులు పాల్గొన్నారు.



