Thursday, June 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగేదెన్నడు?

ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగేదెన్నడు?

- Advertisement -

జూన్ 5వ తేదీన ఖమ్మం పట్టణంలో పన్నెండేండ్ల బాలికపై జరిగిన లైంగికదాడి ఘటన, హత్యాయత్నం హృదయాన్ని కలిచివేసింది. దేశంలో, రాష్ట్రంలో తెల్లవారి లేస్తే చాలు, ఏ బాలికపైన ఏం జరుగుతుందో అని తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితి. వయస్సుతో నిమిత్తం లేకుండా అతి చిన్న క్లాసుల నుంచి స్కూలు, కాలేజి, పని ప్రదేశాలు, ఇండ్లు, గుడులు, గోపురాలతో సహా అన్నీ లైంగికదాడులకు నిలయంగా మారాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో కొంత తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, ఆడపిల్లను సెక్స్ సింబల్‌గా చూస్తున్న ధోరణి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ విషయంపై చట్టసభల్లో చర్చించాలి. దీన్ని లోతుగా పరిశీలించి అరికట్టే దిశగా తగు చర్యలు తీసుకోవాలి. మహిళలు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలు, రక్షణ కోసం కల్పించిన ప్రత్యేక రక్షణ చర్యలను కరపత్రాలు, హోర్డింగ్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. యువతలో చైతన్యం కల్పించాలి. ఇందుకోసం ఐద్వా అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నది, ప్రభు త్వానికి విన్నవిస్తున్నది. కానీ, ప్రభుత్వాలు ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు వెళ్లి పరామర్శిస్తారు, మంచి వైద్యం అందించాలని చెబుతారు. ‘మా అంత మహానుభావులు లేరని’ చెప్పి చేతులు దులుపుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఎందుకు దీనిగురించి లోతుగా చర్చించడం లేదు? ఈ భావజాలం ఎందుకు వ్యాప్తి చెందుతుంది?

ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికను మోసం చేసిన కేసులో అతన్ని రక్షించడం కోసం శతవిధాలా ప్రయత్నించారు. ప్రధాన ప్రవంతి మీడియాను కంట్రోల్‌లో పెట్టు కున్నారు. సోషల్ మీడియాలో పెద్దఎత్తున స్పందన, ప్రతిఘటన రావడంతో తప్పనిసరి పరిస్థితులలో మంత్రి కొడుకును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర మంత్రి కొడుకును కాపాడటానికి చేసిన వ్యాఖ్యానాలు అత్యంత హేయమైనవి. అంతిమంగా కేంద్ర మంత్రి తన కొడుకును తానే స్వయంగా పోలీస్‌స్టేషన్‌లో అప్పగిస్తున్నానని ప్రకటించాడు. ముఖ్యమంత్రి మాత్రం ‘మా పోలీసులే అతన్ని అరెస్టు చేశారని’ చెప్పుకోవడం విచిత్రమైన పరిస్థితి.

మహిళ అనగానే ఎక్కడైనా ఏమైనా చేయవచ్చు. ఏ కామెంటయినా చేయవచ్చు. ఏ విధంగానైనా వాడుకోవచ్చు. ఆమె వెంటపడి, వేధించే హక్కు, ప్రేమించపోతే, పెండ్లి చేసుకోను అంటే యాసిడ్ పోసే హక్కు, హత్య చేసే హక్కు ఇవన్నీ ఏ చట్టం ఇచ్చింది? యువతలో ఇటువంటి ఆలోచనలు పురుషాధిక్య భావజాలం నుంచి వస్తున్నాయి. ఈ భావజాలాన్ని మనుధర్మ శాస్త్రం పెంచి పోషిస్తున్నది. వందల సంవత్సరాల నాడు చట్టాసభలు, ఓటుహక్కు లేని కాలంలో రాసిన ధర్మాలను ఇప్పటికీ అనుసరించాలని చూస్తున్నారు. ఆనాడు స్త్రీల గురించి చాలా చులకనగా రాశారు. స్త్రీ అంటే ఒక ద్వితీయశ్రేణి పౌరురాలిగా, చేతకాని మనిషిగా, పురుషుడిగా దాసీగా, ఒక విలాస వస్తువుగా మనుధర్మం వక్రీకరించింది. మహిళలు దాన్ని బద్దలు కొట్టి అనేక హక్కులు, చట్టాలు సాధించు కున్నారు. భారతదేశానికి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. రాజ్యాంగం ఏర్పడింది. ఆ రాజ్యాంగ హక్కులలో భాగంగా అనేక చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలని మనం అనుసరించాల్సిన అవసరం లేదా? చదువుకున్నవారు కూడా ఈ భావజాలాన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? ఎందుకు గౌరవి స్తున్నారు? దీనికి కారణం ఆరెస్సెస్‌ రాజకీయ విభాగంగా ఉన్న ‌బీజేపీ. దేశవ్యాప్తంగా ఇంకా ఇలాంటి భావజాలమే కావాలని, ఇదే కరెక్టు అని, మాకు రాజ్యాంగంతో సంబంధం లేదు అని, బీజేపీ నేతలు పేట్రేగి మాట్లాడుతుంటే, ఈ సమాజంలో ఉన్న కొందరు మేధావులు, చదువుకున్న వారు కూడా ఈ ఆలోచనా విధానాన్ని, చర్యలను బలపర్తున్నారు.

దీని పర్యవసానమే ఇవాళ ఆడపిల్లలపై ఇటువంటి దుర్మార్గాలు. ‘బేటీ బచావో బేటీ పఢావో’ అని నీతులు చెప్పే బీజేపీ పార్టీ ఈ భావజాలాన్ని పెంచి పోషిస్తుంటే, మీ కుటుంబాలకు ఇది వర్తించదా అని, ఆ భావజాలాన్ని ప్రేమించేవారు కూడా ఆలోచించాలి. ఖమ్మం పట్టణంలో జరిగిన ఘటన పరిశీలిస్తే, ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు. నివాస ప్రాంతంలో, ఎంతో భద్రత ఉంటుందనుకున్న అపార్టుమెంటులో ఈ దాడి జరిగింది. ఆ అపార్టుమెంటుకు సంబంధంలేని యాభై ఏండ్ల వ్యక్తి పన్నెండ్లేండ్ల మైనర్‌ ‌బాలికపై లైంగికదాడి చేశాడు. అక్కడ నివాసం ఉండే అమ్మాయి కూడా కాదు. కొద్దిరోజులు అమ్మమ్మ గారింటికి వచ్చిన పాపపైన దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఆ పాప బతికినప్పటికీ ఆమె జీవితాంతం ఎందుకు పనికిరాని పరిస్థితిలో జీవించాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆమెకు అన్ని వసతులు కల్పించాలని ఐద్వా పోరాడుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో, పట్టణంలో అనేకమంది అభ్యుదయ కాముకులైన ప్రజలు ఉన్నారు. అందులో న్యాయవాదులు కూడా ఉన్నారు. న్యాయవాదులందరూ మీ కుటుంబాలు, మీ బిడ్డల్ని గుర్తు తెచ్చుకుని ముద్దాయికి ఎటువంటి బెయిల్ కోసం ప్రయత్నం చేయకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్లను పెట్టి అతనికి కఠినమైన శిక్ష పడేలా చేయాలి. అటువంటి మానవ మృగం మనుషుల మధ్య తిరగడానికి వీల్లేదు అని నిరూపించాలి. అలాగే అతని కుటుంబానికి కావలసిన సహాయసహకారాలు ప్రజలు, ప్రభుత్వం అందించాలి.
బి. హైమావతి, 9391360886

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -