Tuesday, June 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయాచారం సీహెచ్‌సీలో దయనీయ పరిస్థితులు..వైద్య మంత్రికి సీపీఐ(ఎం) లేఖ

యాచారం సీహెచ్‌సీలో దయనీయ పరిస్థితులు..వైద్య మంత్రికి సీపీఐ(ఎం) లేఖ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత, వైద్య సిబ్బంది లోటు, నిధుల దుర్వినియోగం వంటి సమస్యలపై తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహను సీపీఐ(ఎం) నాయకులు కోరారు. జిల్లా సీపీఐ(ఎం) బృందంతో కలిసి జూన్ 25న యాచారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ఆసుపత్రి వేలాది మంది ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్నప్పటికీ, తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు.

2023లో రూ.1.50 కోట్లతో మంజూరైన కొత్త భవన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదని, ప్రస్తుతం వినియోగంలో ఉన్న భవనం వర్షం వస్తే నీరు కారే పరిస్థితిలో ఉందని తెలిపారు. కిటికీలకు తలుపులు లేకపోవడం, డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వెల్లడించారు. సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ 39 మంజూరైన పోస్టులకు గాను కేవలం ఆరుగురు వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారని, రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్ లేక అత్యవసర సేవలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఓటీ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టుల పోస్టులు ఖాళీగా ఉండటంతో పాటు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు కూడా నిలిచిపోయాయని తెలిపారు.

పాత భవనం ఫ్లోరింగ్, పెయింటింగ్ పనుల కోసం రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నప్పటికీ పనులు నాసిరకంగా జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్లు పనిచేయడం లేదని, మందుల నిల్వకు అవసరమైన ఫ్రిడ్జ్‌లు లేవని, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదని తెలిపారు. దాతలు అందించిన అంబులెన్స్‌కు డీజిల్, నిర్వహణ నిధులు లేక వినియోగంలో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

శానిటేషన్ సిబ్బందికి ప్రభుత్వం నిర్ణయించిన రూ.26 వేల కనీస వేతనానికి బదులుగా కేవలం రూ.10 వేలే చెల్లిస్తున్నారని, ఇది కార్మికులపై జరుగుతున్న దోపిడీ అని సీపీఐ(ఎం) ఆరోపించింది. యాచారం సీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు, భవన నిర్మాణ పనుల్లో జరిగిన జాప్యం, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని, మంత్రి స్వయంగా ఆసుపత్రిని సందర్శించి సమస్యలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -