కృష్ణాబోర్డుకు సర్కారు లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా యాజమాన్య నిర్వహణా బోర్డు(కేఆర్‌ఎంబీ)కు లేఖ రాసింది. ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ కేఆర్‌ఎంబీకి చైర్మెన్ రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు శాఖ నివేదిక పంపింది. సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నదని తెలియజేసింది. తద్వారా ఏపీ పున:వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని గుర్తు చేసింది. కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం రూ. 47,776.50 కోట్ల పనులు చేపట్టిందని లేఖలో పేర్కొన్నది. ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదనీ, పథకాలను పొడిగించరాదని కేఆర్‌ఎంబీ స్పష్టంగా ఏపీకి ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలతో స్పష్టంగా అక్రమ నిర్మాణాలు, కొత్త పథకాలు, పాతవి పొడిగింపునకు సంబంధించి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సరికాదని ఆందోళన వ్యక్తం చేసింది. తద్వారా కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన మార్గదర్శకాలను సైతం ఉల్లంఘి స్తున్నదని విమర్శించింది. కొత్త రాష్ట్రమైన తెలంగాణ పలు సమస్యలు, ఇబ్బందులను అనేక సందర్భాల్లో కేంద్రం దృష్టికి
తెచ్చినా పట్టించుకోకపోవడం దారుణమని తెలిపింది. పెన్నా బేసిన్‌లో అక్రమంగా నీటినిల్వ సామర్థ్యాలను పెంచుకుంటూ పోవడం సరికాదని పేర్కొంది. తెలంగాణలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టడం లేదని స్పష్టం చేసింది. ఏపీ పునర్వవ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేఆర్‌ఎంబీ ఏర్పడిందని తెలిపింది. ఏపీ అభ్యంతరాలు, సమస్యలను మాత్రమే కేఆర్‌ఎంబీ పట్టించుకుంటున్నదనీ, తెలంగాణ సమస్యలు, ఇబ్బందులు నిర్లక్ష్యం చేస్తున్నదని గుర్తు చేసింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం జీవో 203 ద్వారా రూ. 6829 కోట్ల పనులను మంజూరు చేసిందని వివరించింది. రోజుకు మూడు టీఎంసీలు పంప్ చేసేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏపీ చేపట్టిన విషయాన్ని లేఖలో పేర్కొంది. మొత్తంగా ఇటీవల ఏపీ ప్రభుత్వం రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించేలా పనులు మంజూరు చేసిందని తెలిపింది.
ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



