Tuesday, June 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉద్యోగులకు తీపికబురు

ఉద్యోగులకు తీపికబురు

- Advertisement -

మరో రూ.2 వేల కోట్ల బకాయిలు విడుదల
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో నిధులు విడుదల
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చింది. బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం రూ.రెండు వేల కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను 100 రోజుల్లో రూ. ఆరు వేల కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నెల 29న మొదటి విడతగా రూ.రెండు వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రెండో విడతలో మరో రూ.రెండు వేల కోట్ల నిధులను విడుదల చేసి తన నిబద్ధతను నిరూపించుకుంది. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్‌) బకాయిలను వంద శాతం చెల్లించి, వారి ఖాతాలను పూర్తిగా క్లియర్ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో ఎలాంటి పెండింగ్‌లు లేవని ‌స్పష్టం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి గతేడాది సెప్టెంబర్ వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని పేర్కొంది.
పెండింగ్‌లో ఉన్న రూ.పది వేలలోపు విలువ కలిగిన చిన్న మొత్తాల బిల్లులన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపింది. ఈ విభాగంలో దాదాపు ఐదు లక్షలకుపైగా ఉన్న టోకెన్లను గుర్తించి, ఏమాత్రం జాప్యం లేకుండా చెల్లింపులు జరిపినట్టు పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్న సానుకూల ధోరణి అభినందనీయమని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా క్రమపద్ధతిలో మంజూరు చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించడంతో, ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -