నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర లోని ముంబాయి, గుజరాత్, ఒడిసా, హిమచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలో వర్షపు నీటికి వరదలు పొటెత్తుతున్నాయి. పలు చోట్ల రోడ్లలపై భారీగా నీరు నిలిచింది. ముంబాయిలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసిన రోడ్లలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అదే విధంగా శుక్రవారం ప్రారంభమైన అమర్ నాథ్ యాత్రకు వర్షం ఆటంకం కలిగిస్తోంది. యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని అధికారులు తెలియజేశారు. అమర్‌నాథ్ యాత్రికులు, పర్యాటకుల కోసం జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్ (JMC) జమ్మూ తవి రివర్‌ఫ్రంట్ వద్ద బోటింగ్ సేవలను ప్రారంభించింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రెండవ బృందం, దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని పవిత్ర గుహాలయం వైపు తమ కాలి నడక యాత్రను పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంప్ నుండి అధికారికంగా ప్రారంభించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం కౌఘా సమీపంలోని రామ్‌నగర్-ఉధంపూర్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఘటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు అక్కడికి చేరుకున్నారు.రహదారిపై పడిన పెద్ద బండరాళ్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు యంత్రాన్ని రంగంలోకి దించారు.
అలాగే ఒడిసాలోని పలు ప్రాంతాలకు కేంద్ర వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూరీ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా సంధియాల గ్రామం సమీపంలో వరద నీటిలో చిక్కుకుపోయిన పలువురిని అగ్నిమాపక శాఖ సిబ్బంది శనివారం రక్షించారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలియజేశారు.









