మూసీ నది మురుగు కాలువగా మారి, పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో నది పునరుజ్జీవనానికి ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు స్వాగతించదగ్గవే. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే, ఇది నదిశుద్ధి కంటే సుందరీకరణ, రియల్ ఎస్టేట్, పర్యాటక వ్యాపారీకరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా బఫర్‌జోన్ పేరుతో వేలాది పేద కుటుంబాలను నిరాశ్రయులను చేసే ప్రయత్నం ఆందోళన కలిగిస్తోంది.
గత ఏడాదిన్నరగా మూసీ పునరుద్ధరణపై ప్రకటనల వెల్లువే కనిపించింది. ఇటీవల నదికి ఇరువైపులా యాభై మీటర్ల వెడల్పును బఫర్‌జోన్ గా ప్రకటిస్తూ, సుమారు 3,279 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు, ఈ ప్రక్రియలో 10,017 ఇళ్లను తొలగించనున్నట్లు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. మూసీనదీ సంగమ ప్రాంతమైన లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ వద్ద ‘గాంధీ సరోవర్’ పేరిట 150 అడుగుల ఎత్తయిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. ఇది నది పరిరక్షణ కార్యక్రమమా, లేక భారీ టూరిజం ప్రాజెక్టునా? అనే సందేహం కలుగుతున్నది.
ప్రక్షాళనకంటే సుందరీకరణకే ప్రాధాన్యతా?
మూసీనదిని శుద్ధి చేసి, స్వచ్ఛమైన నీటిని ప్రవహింపజేస్తామని, వ్యవసాయానికి అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ దిశగా గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించి, గండిపేట రిజర్వాయర్‌ను నింపి, నదిలో నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా చూడటానికి రూ.7వేల కోట్లు కేటాయించి పనులు మొదలుపెట్టింది. అలాగే, మురుగునీటిని నదిలో కలవకుండా నిరోధించేందుకు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ చర్యలు నది ప్రక్షాళనకు అవసరమే.కానీ, ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి సారించిన తీరు చూస్తే, నది శుద్ధి కంటే, నదీ తీరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, పర్యాటక ప్రదేశాలను నిర్మించడం, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు బాటలు వేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తోంది.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో గండిపేట నుండి గౌరెళ్లి వరకు 55 కిలోమీటర్ల పొడవునా నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుండి రూ.4,100 కోట్ల రుణం కూడా ఆమోదం పొందడంతో, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల నుండి లంగర్ హౌస్ బాపు ఘాట్ వరకు ‘వి’ ఆకారంలో 20 కిలోమీటర్లు మొదటి దశ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే బఫర్ జోన్ ఏర్పాటు, భూసేకరణ, ఇళ్ల తొలగింపు జరుగుతున్నాయి.
బఫర్‌జోన్ పేరుతో పేదల తొలగింపు
గతంలో 12 మీటర్లు, 30 మీటర్లుగా ఉన్న బఫర్‌జోన్ పరిధిని ఇప్పుడు యాభైమీటర్లకు పెంచడం వెనుక ఉద్దేశ్యమేమిటి? దశాబ్దాలుగా, కొందరు ప్రభుత్వ అనుమతులతోనే నిర్మించుకున్న ఇళ్లను ఇప్పుడు అక్రమ నిర్మాణాలుగా ప్రకటించి తొలగించడం ఏ మేరకు సమర్థనీయం? నది ప్రవాహానికి, వరదలకు ఆటంకం కలిగించే నిర్మాణాల తొలగింపును సమర్థించవచ్చు. కానీ, ఎన్నడూ వరద ముంపుకు గురికాని ప్రాంతాల్లోని ఇళ్లను, కేవలం సుందరీకరణ, వాణిజ్య ప్రయోజనాల కోసం తొలగించడం పూర్తిగా అన్యాయం.
ఇప్పటికే తమ సర్వేలో 2,166 ఇళ్లు నదీ గర్భంలోను, మరో 7,851 ఇళ్లు బఫర్ జోన్‌లోనూ ఉన్నాయని ప్రభుత్వమే గుర్తించింది. ఈ ఇళ్లను తొలగించడం అంటే పదివేల కుటుంబాలను వీధిన పడేయడమే.గత ఏడాది కొన్ని ప్రాంతాల్లో పేదలను బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసి, తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిన సంగతి విదితమే. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, మూసీనదిపై ఎక్స్‌ప్రెస్ హైవే ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందనే ప్రచారం ఉంది. ఒకవేళ అదే జరిగితో మరింత మంది నిరాశ్రయులు కావాల్సి వస్తుంది.
ప్రజాస్వామ్య విరుద్ధ నిర్ణయాలు
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) వచ్చిన తర్వాతే, దానిపై అసెంబ్లీలో చర్చించి, ప్రజాభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కానీ, డీపీఆర్ ఇంకా ప్రజల ముందుకు రాకముందే, దానిపై ఎలాంటి చర్చ జరగకముందే భూసేకరణ, ఇళ్ల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య. గరిష్ట వరద ప్రవాహ మట్టం (మాగ్జిమమ్ ఫ్లడ్ లెవల్ -ఎంఎఫ్‌ఎల్)ఎంత? నది ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న నిర్మాణాలు ఏవి? వంటి ప్రాథమిక వివరాలను కూడా ప్రభుత్వం ఇంతవరకు బహిర్గతం చేయలేదు.
గుజరాత్ మోడల్‌ను తెలంగాణలోనా?
సబర్మతి నది అభివృద్ధి నమూనాను హైదరాబాద్‌లో అమలు చేసే ప్రయత్నం జరుగుతోంది. అక్కడ వేలాది పేదలను నదీ తీరం నుండి తరలించి, నదీ తీరాన్ని వాణిజ్య కేంద్రంగా మార్చిన విషయం తెలిసిందే. అదే బాటలో ఇక్కడా ‘గాంధీ సరోవర్’, ‘రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్’ పేర్లతో పేదలను నిరాశ్రయులను చేసి, ఆ భూమిని టూరిజం, ప్రయివేటు లాభాలకు అమ్మేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది.మూసీ నది నిజమైన పునరుజ్జీవం అంటే దాని నీటిని శుద్ధి చేయడం, పారిశ్రామిక, గఅహ మురుగునీటిని నదిలో కలవకుండా నిరోధించడం, వరదల నుండి ప్రజలను రక్షించేందుకు పటిష్టమైన ప్రహరీలు నిర్మించడం.
ఇది పేదలను నిరాశ్రయులను చేసే ప్రక్రియ కాకూడదు. నది ప్రవాహానికి అడ్డంకి కాని నివాసాలను, ఆక్రమణలను తాకకుండా అభివృద్ధి పనులు చేపట్టాలి. పూర్తి స్థాయి ప్రణాళిక, డీపీఆర్, ఎంఎఫ్‌ఎల్ వివరాలను వెంటనే బహిర్గతం చేసి, ప్రజలతో, ప్రత్యేకించి మూసీ పరిసర ప్రాంతాల్లో నివసించే వారితో విస్తృతంగా చర్చించాలి. బఫర్ జోన్ పేరుతో ఇళ్ల తొలగింపును తక్షణమే నిలిపివేయాలి. పేదలను నిరాశ్రయులను చేసే అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు. హైదరాబాద్ నగర ప్రజలు, మొత్తం తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది పర్యావరణ పరిరక్షణతో కూడిన, ప్రజల జీవనోపాధిని కాపాడే నిజమైన మూసీ పునరుజ్జీవం.
ఎం.శ్రీనివాస్
9490098661



