Wednesday, March 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపారిశ్రామికోత్పత్తి క్షీణత

పారిశ్రామికోత్పత్తి క్షీణత

- Advertisement -

కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) వివరాలు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 4.8 శాతానికి పడిపోవడం మాత్రమే కాదు, తయారీ రంగం మైనస్‌లోకి జారడం మరింత ఆందోళనకరం. ఇది గత మూడు నెలల్లో కనిష్ట స్థాయి కావడం పరిస్థితి తాత్కాలికం కాదనే సంకేతాన్ని ఇస్తోంది. ”భారత్‌ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ” అని మోడీ సర్కార్‌ ప్రకటనలు ఉత్తి మాటలేనని క్షేత్రస్థాయి గణాంకాలు కళ్లెదుట చూపుతున్నాయి. దీర్ఘకాల ధోరణులను అర్థం చేసుకునేందుకు పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు దోహదం చేస్తాయి. ఈ గణాంకాల్లో అన్నీ ప్రతికూలం కాకపోయినా దృష్టి సారించాల్సిన అంశాలు ముఖ్యమైనవి ఉన్నాయి. తయారీ రంగం గతేడాది జనవరిలో ఉన్న 5.8 శాతం వృద్ధి రేటు నుంచి ఈ ఏడాది జనవరిలో 4.8 శాతానికి పడిపోయింది. మైనింగ్‌ రంగం కూడా గతేడాది 4.4 శాతం ఉండగా స్వల్పంగా తగ్గి 4.3 శాతానికి పరిమితమైంది. తయారీ రంగమే ఉపాధి సృష్టికి ప్రధాన ఆధారం. అదే రంగం క్షీణించడం అంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఒత్తిడిలో ఉన్నాయనే అర్థం.

సూచీలో కొలవబడిన 23 ప్రధాన తయారీ ఉపరంగాలలో ముఖ్యమైన రంగాలు గత సంవత్సరం నుంచే క్షీణతను నమోదు చేశాయి. కార్మిక ఆధారిత రంగాలైన దుస్తులు, వస్త్ర, చర్మ, రబ్బరు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులన్నీ సెప్టెంబర్‌ 2025 త్రైమాసికంలో కుదించుకుపోయాయి. విద్యుత్‌ ఉత్పత్తి మెరుగుపడటం కొంత సానుకూలాంశం. అయితే సాధారణ ప్రజలు వినియోగించే వస్తువుల విభాగం మైనస్‌ క్షీణతను నమోదు చేసిందంటేనే కొనుగోలు శక్తి ఏ రకంగా తగ్గిందో అర్థమవుతోంది. అదేవిధంగా పెట్టుబడి వస్తువుల వృద్ధి కూడా పడిపోయింది. మొత్తంమీద పారిశ్రామిక వాతావరణం మందగించింది. అమెరికా చేస్తున్న సుంకాల యుద్ధం ప్రభావంతో మన దేశం నుండి ఎగుమతుల తగ్గుదల పారిశ్రామిక ఉత్పత్తిపైనా ప్రతికూల ప్రభావం చూపిందని స్పష్టమవుతోంది. అమెరికాతో భారత్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో రాబోవు కాలంలో ఈ రంగాలు మరింత క్షీణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ దెబ్బతింటుంది. డిసెంబర్‌తో పోలిస్తే ఒక్క నెలలోనే వృద్ధిరేటు పడిపోవడం అంటే రాబోవు మూడు నెలల జీడీపీ అంచనాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణుల విశ్లేషణ.

బీజేపీ ప్రభుత్వం పదేపదే అమృతకాలం, విశ్వగురు, భారత్‌ ఐదు ట్రిలియన్‌ ఎకానమీ లక్ష్యాలను ప్రచారం చేస్తోంది. విదేశీ పెట్టుబడులు వస్తున్నాయనీ, స్టాక్‌ మార్కెట్‌ రికార్డులు బద్దలవుతున్నాయని గ్లోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. కానీ, స్టాక్‌ మార్కెట్‌ లాభాలు కొద్దిమంది కార్పొరేట్లకే పరిమితమవుతుంటే, ఉత్పత్తి రంగం క్షీణత సాధారణ ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపుతున్నది. తయారీ రంగం మైనస్‌లోకి జారడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనపపడింది. వ్యవసాయరంగంలో కార్పోరేటీకరణ పెరిగి కనీస మద్దతు ధరలపై అనిశ్చితి ఏర్పడింది. ఉపాధి కరువైంది, కొనుగోలు శక్తి పడిపోయింది. నిరుద్యోగం పెరుగుతోంది. చిన్న పరిశ్రమలకు రుణాల కొరత, పెరుగుతున్న దిగుమతుల ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పత్తి రోజురోజుకు క్షీణిస్తోంది. పదేండ్ల కాలంలో కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రయివేటీకరణను వేగవంతం చేసింది. ముఖ్యమైన రంగాల్లో ప్రభుత్వ వాటాలను తగ్గిస్తూ పోతున్నది. దీనివల్ల పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం వాదించినా, ఉపాధి భద్రత లేకుండా పోతున్నది.

కొన్ని రంగాల్లో సానుకూల వృద్ధి ఉన్నా విస్తృతంగా అన్ని రంగాల్లో జరగడం లేదు. కొన్ని పరిమిత రంగాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంది. కలప, ఖనిజ, ప్రాథమికలోహలు, లోహ ఉత్పత్తి తయారీ రంగాలు వృద్ధి సాధించాయి. అయితే అవన్నీ అధిక పెట్టుబడి ఆధారిత రంగాలు. వీటివల్ల జనాలకు ఉపయోగపడేది ఏమీ ఉండదు. ఉప్పు, వంట నూనెలు వంటి నిత్యావసర సరుకుల వినిమయమూ తగ్గిపోతోంది. ఇదే క్రమం కొనసాగితే…? ప్రజల కొనుగోలు శక్తిలేక సరుకులకు డిమాండ్‌ మందగించడంతో వస్తూత్పత్తి క్రమంగా క్షీణించే ప్రమాదముంది. అది మరింతగా ఉపాధిని దెబ్బతీస్తుంది కనుక ఆర్థిక సంక్షోభం నానాటికీ తీవ్రమౌతోంది. పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల దుష్ఫలితమిది. సాక్షాత్తూ కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విడుదల చేసిన గణాంకాల అద్దంలో చూసుకొనైనా ఏలినవారు తమ తప్పు తెలుసుకొని దిద్దుకోవాలి. ఈ స్థితిని మార్చడానికి నిజమైన పరిష్కారం ప్రజల ఆదాయాలను పెంచడం, చిన్న పరిశ్రమల ఏర్పా టుకు ఊతమివ్వడం, కొత్త ఉద్యోగాలను సృష్టించడం. అంతేకాదు, ప్రజారంగ పెట్టుబడులు పెంచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ముఖ్యం. ఆ దిశగా ప్రభుత్వ విధానాలు మార్చేందుకు ప్రజాఉద్యమాలు ఉధృతం కావాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -