నవతెలంగాణ – హైదరాబాద్ : ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ కల చెదిరిపోయింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16లో స్పెయిన్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో పోర్చుగల్ 1-0 తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి నిమిషంలో స్పెయిన్ సాధించిన గోల్‌తో రొనాల్డో ప్రపంచకప్ ప్రస్థానం కన్నీళ్లతో ముగిసింది.
అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. ఆట ముగియడానికి కొన్ని నిమిషాలు ఉందనగా, 91వ నిమిషంలో స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు మైకెల్ మెరినో అద్భుతమైన లెఫ్ట్ ఫుట్ షాట్‌తో గోల్ చేసి స్పెయిన్‌కు నాటకీయ విజయాన్ని అందించాడు. దీంతో పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇదే తన చివరి ప్రపంచకప్ అని టోర్నీకి ముందే ప్రకటించిన రొనాల్డో, ఫైనల్ విజిల్ మోగగానే మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యాడు. అతని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.



