విద్యుత్‌బస్‌ల వల్ల ఆర్టీసి రక్షణ, కార్మికులకు, ఉద్యోగులకు ఎసరు వస్తుందని, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్‌ల విధానంలో మార్పులు కోసం ఐక్య పోరాటం జరగాల్సిన అవసరం వుందని స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) చెపుతూనే వస్తున్నది. అనుకున్నట్టే ఫిబ్రవరి 6న హైదరాబాద్ రీజనల్ మేనేజరు విడుదల చేసిన లేఖ నెం. (జు3/332(1)/2025- HR, తేదీ:6.1.2026) ఆ విషయాన్ని మరింత ధృవీకరిస్తుంది. వారి రీజియన్ లో 45 విద్యుత్ బస్‌లు నడుపుతున్నామని, కాబట్టి 2024 షెడ్యూల్స్ ప్రకారం వున్న మెకానిక్‌లలో అరవై మంది అదనంగా వున్నారని, వారిని కండక్టర్స్, డ్రైవర్స్‌గా రీ-క్యాటగిరైజేషన్ చేస్తామని, వారి వద్ద నుండి అనుమతి పత్రాలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొంది.
విద్యుత్ బస్‌ల సంస్థ ఓలెక్ట్రా కంపెనీకి టిజిఎస్ ఆర్టీసి యాజమాన్యానికి 1085 విద్యుత్‌బస్‌ల కోసం ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ (దీని విలువ రూ.1800 కోట్లు) ఇచ్చారని, ఇరవై నెలల పరిధిలో ఆ సంస్థ విద్యుత్ బస్‌లను అందిస్తుందని ఓలెక్ట్రా కంపెనీ ప్రకటించింది. 45 బస్‌లు వస్తేనే అరవై మంది మెకానిక్‌లు అదనపు సిబ్బందిగా తేలితే, 1085 బస్‌లు వస్తే మెకానిక్‌లు, డ్రైవర్లు ఎంతమంది ఉద్యోగాలకు ఎసరు వస్తుందో ఊహిస్తేనే ఆందోళన కలుగుతుంది. విద్యుత్ బస్‌ల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్, ఆర్టీసిలే నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్‌ల విధానంలో మార్పులు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్), టిఎస్‌ఆర్టీసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్)లు డిమాండు చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్ 10న రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించినప్పటి నుంచి రోజూ ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న మార్పులు, ఆర్టీసిలపై వాటి ప్రభావం, కార్మికుల ఉద్యోగ భద్రత ప్రమాదంపై, ఆర్టీసి పరిరక్షణకు వస్తున్న ప్రమాదాన్ని ఎప్పటికప్పుడూ కార్మికులు, ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాయి.
సమస్యపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత విద్యుత్ బస్‌ల విధానానికి ప్రత్యామ్నాయాలను ముందుకు తెస్తూ 2025 సెప్టెంబర్ 12న దేశవ్యాప్తంగా “Save STU Day” గా పాటించాయి.. దీనిపై కార్యాచరణను నిర్ణయించడానికి గాను 2025 నవంబర్ 23న చెన్నై నగరంలో జాతీయ సదస్సు నిర్వహించాయి. ఇదే సమస్యపైన 2026 జనవరి 22న డిమాండ్స్ డేని పాటించాయి. హైదరాబాద్ రీజియన్‌లో మెకానిక్‌ల రీ- క్యాటగిరైజేషన్‌ను ఆపాలని, విద్యుత్ బస్‌ల విధానంలో మార్పులు చేసి ఆర్టీసిలకు ఇవ్వాలని 2026 ఫిబ్రవరి 17న డిమాండ్స్ డేని చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 2026 ఫిబ్రవరి 12న జరిగిన సమ్మెలో ఎస్‌డబ్ల్యూఎఫ్ సభ్యులు సంపూర్ణంగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పుకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయకపోగా, ప్రయివేటు విద్యుత్ బస్‌ల విధానాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ బస్‌లను సమకూర్చుకొంటున్నది. ఈ విధానంలో మార్పు జరగకుండా, ఆర్టీసిలు తమ మనుగడ సాగించడం కష్టం. అలాగే ఉద్యోగులకు కూడా ముప్పు వస్తుంది. కాబట్టి ఈ విద్యుత్ బస్‌ల విధానంలో మార్పు కోసం ఆర్టీసిలోని అన్ని కార్మిక సంఘాలు సమైక్య ఆందోళనకు ముందుకు రావాల్సి వుంటుంది.
అసలు ఈ విద్యుత్‌బస్‌ల పథకంలో ఏం వున్నాయో చూద్దాం. భారతదేశంలో కాలుష్య నియంత్రణ కేవలం ఆర్టీసి బస్‌ల స్థానంలో విద్యుత్‌బస్‌లను తీసుకొని రావడం వల్లనే సాధ్యమవుతుందని ప్రజలను నమ్మించేలాగా ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. దేశంలో మొత్తం వాహనాలు 42 కోట్లు వుంటే, అందులో ద్విచక్ర వాహనాలు 30 కోట్లు, కార్లు, జీపులు ఐదు కోట్లు, లారీలు, బస్‌లు వంటివి ఏడు కోట్లు వున్నాయి. నిటి ఆయోగ్ లెక్కల ప్రకారం అందులో ఆర్టీసి బస్‌లు వున్నది కేవలం 1,40,000 మాత్రమే ప్రభుత్వం నిజంగా పర్యావరణాన్ని రక్షించాలనుకున్న, కర్బన్ ఉద్గారాలను తగ్గించాలను కున్న కూడా వ్యక్తిగత వాహనాలు తగ్గించి ప్రజారవాణాను అభివృద్ధి చేయాలి. నిటి ఆయోగ్ లెక్కల ప్రకారమే భారతదేశంలో తక్షణ అవసరంగా 8 లక్షల బస్‌లు కావాలి. కానీ భారతదేశంలోని వాహనాలలో 0.033శాతం మాత్రమే ఆర్టీసి బస్‌లు వున్నాయి. ఎనిమిది లక్షల బస్‌లు తీసుకొచ్చినా 0.190శాతం మాత్రమే వుంటాయి. కానీ, పాలకులు ఆర్టీసిల విస్తరణను అడ్డుకున్నారు. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ పేరున ఆర్టీసిలను ప్రయివేటు కార్పొరేట్లకు కట్టబెడ్తూ, ఆర్టీసిలను నిర్వీర్యం చేస్తున్నాయి.
విద్యుత్ బస్‌ల ప్రస్థానం
2015 పారిస్ సదస్సు అనంతరం భారతదేశంలో విద్యుత్ బస్‌ల విధానం 2015లోనే ప్రకటించారు. పాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్) ఎలక్ట్రికల్ ఎహికల్స్-1 (FAME-
1)ను ముందుకు తెచ్చారు. ఈ పథకం ఏప్రిల్ 2015 నుండి మార్చి 2019 వరకు వుంది. 1 ఏప్రిల్ 2019 నుండి 31మార్చి 2024 వరకు FAME-2 ను ముందుకు తెచ్చారు. ఇది కూడా capex మోడల్ సబ్సిడీని ఇచ్చారు. అత్యధికంగా 55 లక్షల సబ్సిడీని ఇచ్చారు. ఆ తర్వాత ‘నేషనల్ ఎలక్ట్రికల్ బస్ ప్రోగ్రాం’ విధాన ప్రకటన చేశారు. అప్పటి వరకు వున్న క్యాపిటల్ సబ్సిడీని కాస్తా ”ఉజూవఞ మోడల్” ఆపరేషనల్ సబ్సిడీలను ముందుకు తెచ్చారు.దీన్ని సవరించి ”పిఎమ్ – ఈ బస్ సేవా” (“PM-Ebus Seve”) పథకాన్ని ముందుకు తెచ్చారు. ఆగస్టు – 2025 నాటికి 7,293 బస్‌లు ఈ పథకం క్రింద శాంక్షన్ అయ్యాయి. మొత్తం పథకాన్ని జి.సి.సి. (గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్) అయినందున పేమెంట్ గ్యారెంటీ కోసం ‘పేమెంట్ స్కీం’ను కూడా ముందుకు తెచ్చి 3795 కోట్లు కేటాయించారు.
పిఎమ్ ఎలక్ట్రిక్ డ్రైన్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికిల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E- Drive) స్కీంను ముందుకు తెచ్చారు.10,900 కోట్లతో ముందుకు తెచ్చిన ఈ పథకం అక్టోబర్ 2024 నుండి 31మార్చి2026 వరకు అమలులో వుంటుంది. ప్రధానంగా చార్జింగ్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ కల్పనపై దృష్టి పెట్టారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఇన్సెంటివ్‌లు చెల్లింపుకు 3679 కోట్లు కేటాయించారు. 7391 కోట్లతో 14,028 విద్యుత్ బస్‌లకు నలభై లక్షల పైన జనాభా కలిగిన నగరాలలో అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బస్‌ల పథకాలన్నీ కూడా గ్రాస్‌కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) పద్ధతిలో వుంటాయి. బస్‌ల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ అన్ని ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలే చూస్తాయి. ఆర్టీసిలకు ఎటువంటి పాత్ర వుండదు. కేవలం బస్‌లు నడిచే రూట్ నిర్ణయించడం, ఆ బస్‌లో టిక్కెట్ల ఆధారంగా ఆదాయం తెప్పించుకోవడం, చేసిన ఒప్పందం ప్రకారం (ఆదాయంతో సంబంధం లేకుండా) ప్రతి నెలా ఆ విద్యుత్ బస్‌ల కంపెనీకి డబ్బులు చెల్లించడం మాత్రమే చేయాలి.
చేసుకొన్న ఒప్పందం ప్రకారం ఆ బస్‌ను తిప్పినా, తిప్పకపోయినా, ఆర్టీసి యాజమాన్య కారణాలతో కాన్సిల్ చేస్తే కూడా ఆ బస్ తిరిగినట్లు భావించి, ఆ డబ్బులు చెల్లించాల్సి వుంటుంది. అలాగే మౌలిక వసతుల కల్పన బాధ్యత ఆర్టీసి యాజమాన్యానిదే. హైదరాబాద్ నగర అనుభవం చూస్తే (పెంచిన మౌలిక వసతుల సెస్) రోజుకి సుమారు యాభై లక్షలు ప్రజలపై భారం పెడ్తున్నది. ఇది భవిష్యత్‌లో మరింత పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆటోకాంపోనెంట్‌పై ఇచ్చే ఇన్నెంటివ్ – 25,958 కోట్లు, ఎ.సి.సి. బ్యాటరీల ఇన్సెంటివ్ – 18 వేల కోట్లు ప్రకటించారు. మొత్తం ఇప్పటి వరకు విద్యుత్ బస్‌ల పథకాల అమలు కోసం కేంద్ర ప్రభ్వుం 1,11,651 కోట్లు ఖర్చు చేసింది. ప్రయివేట్ ఆపరేటర్స్‌కు రెవెన్యూ రిస్క్ లేకుండా చేయడానికి మొత్తం పథకాలన్నీ కూడా ‘గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్’ (జిసిసి) పద్ధతిలో తెచ్చారు.
ప్రజారవాణాపై ప్రయి’వేటు’
ప్రతి రంగంలోను వస్తున్న నూతన టెక్నాలజీని సీఐటీయూ ఆహ్వానిస్తున్నది తప్ప వ్యతిరేకించదు. ఏ కొత్త ఆవిష్కరణ అయినా ఉపాధిని పెంచేదిగా వుండాలి. అలాగే అప్పటికే వున్నవి నైపుణ్యం పెరిగేందుకు ఉపయోగపడాలి. ఉన్న కార్మికులు వుండటంతో పాటు కొత్త ఉద్యోగాల కల్పన జరగాలి. కానీ, విద్యుత్‌బస్‌ల స్కీం అమలులో ఆర్టీసిలకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసి కేవలం దేశీయ/అంతర్జాతీయంగా ప్రయివేటు పెట్టుబడిదారులకు లాభాల గ్యారెంటీ చేయడంతో పాటు మొత్తం ప్రజా రవాణా సంస్థలను వారికి అప్పచెప్పడాన్ని ఎస్‌డబ్ల్యూఎఫ్ వ్యతిరేకిస్తున్నది. ఆ పద్ధతిని మార్చాలని డిమాండ్ చేస్తున్నది. అలాగే విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన పేరుతో ఆర్టీసిలకు ఉన్న భూములను ప్రయివేటు సంస్థలకు అప్పచెప్పడాన్ని తప్పని చెబుతున్నది.
ఇటీవల తమిళనాడులో 5 డిపోలు, ఆంధ్రప్రదేశ్‌లో 19 డిపోలు పూర్తిగా ప్రయివేటు విద్యుత్‌బస్‌ల సంస్థలకు అప్పచెప్పాలని నిర్ణయం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో కూడా ఏపీఎస్‌ఆర్టీసిలో 1800 ఎకరాల భూమి, టిజీఎస్‌ఆర్టీసిలో 1429 ఎకరాల భూమి ఆర్టీసిల వద్ద వుంది. ఈ భూమి ఏ పేరుతో ప్రయి వేటు వారి చేతుల్లోకిపోయినా భవిష్యత్‌లో ప్రజల అవసరాల మేరకు ఆర్టీసిని విస్తరించడం కానీ, కొత్త బస్‌డిపోల ఏర్పాటు సాధ్యం కాదు. ఎందుకంటే, భూమి ప్రకృతి ఇచ్చింది తప్ప, మనం సృష్టించగలిగినది కాదు. అలాగే మరో సమస్య కార్మికుల ఉపాధి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు మొత్తం బస్‌లు విద్యుత్‌బస్‌లు అమలులోకి వస్తే, ఇప్పుడు ఆర్టీసిలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగాలుండవు. ఏదో ఒక పేరుతో కొంత మంది సర్దుబాటు అయినా తొంభైశాతం మంది ఆర్టీసి కార్మికులు ఉద్యోగాలు కోల్పోవలసివస్తుంది. అందుకని ఈ పథకంలో మార్పు లు చేసి ఆర్టీసిలకు అన్నిరకాల అవకాశాలివ్వాలని కోరుతోంది.
విధాన మార్పులు అవసరం
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌బస్‌ల పథకంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రయివేటు కార్పొరేట్లకు ఇచ్చే సబ్సిడీలు ఆర్టీసిలకు ఇచ్చి, ఆర్టీసిలే నేరుగా విద్యుత్ బస్‌ల కొనుగోలు చేసేందుకు విధాన మార్పు చేయాలి. అలాగే ఆ బస్‌ల కొనుగోలుకు అవసరమైన నిధులను ప్రభుత్వమే సమకూర్చాలి. ఆర్టీసి బస్‌ల ఆపరేషన్ ఖర్చుకు, వస్తున్న ఆదాయంకు మధ్య వ్యత్యాసాన్ని (వయబిలిటీ గ్యాప్ ఫండ్) ను ప్రభుత్వం చెల్లించాలి. ఆర్టీసి విస్తరించేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. అలాగే రాష్ట్రంలో తిరుగుతున్న ప్రయివేటు/ వ్యక్తిగత వాహనాలను నియంత్రించి, ప్రజా రవాణాలో వెళ్లేలా ప్రోత్సహించేందుకు పథకాలు ముందుకు తేవాలి.
అందుకు వీలుగా బస్‌ల సంఖ్యను పెంచాలి. రాజ్యాంగం ప్రకారం ‘రవాణా’ అనేది ఉమ్మడి జాబితాలో వుంది. ఇప్పటివరకు అవసరాల ప్రాతిపదికన రూట్లు విస్తరణ, బస్‌ల విస్తరణ అనేవి ఆయా ఆర్టీసిల (రాష్ట్ర ప్రభుత్వ) చేతుల్లో వుంటాయి. కానీ, ఎం.వి.యాక్ట్ సవరణ – 2019, విద్యుత్ బస్‌ల విధానంతో మొత్తం రాష్ట్రాల హక్కులను కేంద్రం తనకు దాఖలు పర్చుకుంటుంది. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన చర్య. కాబట్టి, ఈ విద్యుత్ బస్‌ల విధానంలో ఖచ్చితంగా మార్పులు చేసి, ఆర్టీసిలకు అవకాశం కల్పించాలి. అందుకోసం అందరూ సమైక్యంగా పోరాటాల్లోకి రావాల్సి వుంది.
వి.ఎస్.రావు
9490098890



