Friday, March 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిగల్ఫ్‌ బాధితులకు భరోసా ఏదీ?

గల్ఫ్‌ బాధితులకు భరోసా ఏదీ?

- Advertisement -

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులతో పశ్చిమాసియా దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భీకర యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల్లో సుమారు కోటి మంది భారతీయులు భిక్కుభిక్కుమంటూ దినమెక గండంగా గడుపుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లో అత్యధికంగా యూఏఈ (దుబాయి)లో 43 లక్షలు, సౌదీ అరెబియాలో 27 లక్షలా 47 వేలు, ఖతార్‌, కువైట్‌..ఇలా ఆయా దేశాల్లో లక్షల సంఖ్యలో మన భారతీయులు ఉద్యోగ, ఉపాధి కోసం వలస వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. నిత్యం మిసైళ్ల వర్షం కురుస్తున్న ఇజ్రాయిల్‌, ఇరాన్‌ దేశాల్లోనూ యాభై వేల మంది వరకు భారతీయులున్నట్లు అంచనా. ఈ రెండు దేశాల్లో మరింత భయానక వాతావరణం నెలకొన్నట్లు స్ఫష్టమౌతుంది. రానున్న రోజుల్లో మరింత భీకర యుద్ధం జరిగే అవకాశాలున్నట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు.

పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన భారతీయుల్లో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి వారే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో రోజు వారి కూలీగా చేరిన వారే ఎక్కువగా ఉన్నారు. షిప్పింగ్‌, పోర్టు కంపెనీల్లో భారతీయులు పనిచేస్తున్నారు. వారి పరిస్థితి ముందు నుయ్యి-వెనుక గొయ్యిలా మారింది. ఇప్పటికే దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్లు వార్తలొచ్చాయి. యుద్ధ వాతావరణంలో బయట పనులు చేయలేని పరిస్థితులున్నాయి. ఈ పరిస్థితుల్లో వారి జీవన మనుగడ అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. స్వస్థలాల్లో అప్పులు చేసి గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన భారతీయులకు ప్రస్తుత యుద్ధవాతావరణంలో మన ప్రభుత్వాల నుండి భరోసా లభించడం లేదు. ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యూఏఈ పాలకులు ప్రవాసీయులకు కొంత భరోసా కల్పిస్తున్నారు. విమానాలు రద్దయినందున ఆయా హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చేయించవద్దని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలకు కొంత సహకారం అందిస్తున్నారు. కాగా..మన భారత ప్రధాని పలు దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీలో హెల్ఫ్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. వీటితో చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భరతీయులకు రక్షణతో పాటు ఇక్కడి కుటుంబాలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలేవీ కనిపించక పోవడం బాధాకరం.

గల్ఫ్‌ దేశాల్లో భారతీయులు తీవ్ర భయాందోళనలో భిక్కు భిక్కుమంటూ గడుపుతున్న నేపథ్యంలో భారత ప్రధాని పుదుచ్చెరి, తమిళనాడు, కెనడా పర్యటనలు చేశారు. కేంద్ర మంత్రులు సైతం సొంత నియోజక వర్గాల పర్యటనలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయా దేశాల్లోని భారతీయుల బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలున్నాయి. దేశ వ్యాప్తంగా ఆయా పార్లమెంటు నియోజక వర్గాల వారీగా హెల్ప్‌ డెస్క్‌ లను ఏర్పాటు చేసి..ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. దీంతో పాటు గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయులకు రక్షణతో పాటు అహారం, ఇతర అవసరాలు తీర్చేలా కార్యచరణ చేపట్టాల్సి ఉంది.

ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధ్ద ప్రభావం భారత్‌పై ఏ మేరకు పడుతుందనే అందోళన నెలకొంది. ప్రధానంగా హోర్మూజ్‌ జలసంధి మూసివేతతో చమురు ట్యాంకర్ల నిలిపివేత ప్రభావం ధరల పెరుగుదలకు కారణమయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బ్యారెల్‌ ధర 80 డాలర్లకు పెరిగిందని, క్రమ క్రమంగా మరింత పెరిగే అవకాశాలు లేక పోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచబోమనే కేంద్ర ప్రభుత్వ ప్రకటన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాభై శాతం వ్యాట్‌ను వసూలు చేస్తున్నందున ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్‌ అయిల్‌ ధర పెరిగినా నష్టాలు మాత్రం వచ్చే అకాశాలు లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బహిరంగ మార్కెట్‌లో పెట్రో ధరలను ప్రభుత్వం పెంచితే..అనివార్యంగా సరుకులు, వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీసే అవకాశాలున్నాయి.

చిలగాని జనార్థన్‌
8121938106

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -