Friday, March 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరకాటంలో భారత్‌!

ఇరకాటంలో భారత్‌!

- Advertisement -

మనదేశం నిర్వహించిన మిలన్‌ 2026 నౌకాదళ విన్యాసాలకు హాజరైన 74దేశాలలో ఇరాన్‌ ఒకటి. విశాఖలో ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్వదేశానికి పయనమైన ఐరిస్‌దేనా అనే దాని యుద్ధనౌకను శ్రీలంక సమీపంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా జలాంతర్గామి టార్పెడోతో దాడిచేసి ముంచివేసింది. ఆ నౌకలో ఉన్న 130 మంది నావికుల్లో బతికిన వారు 32మందే. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అనేక యుద్ధాలు జరిగాయి, కానీ, ఏ ఒక్కదానిలోనూ ఇలా టార్పెడోతో మరోదేశ నౌకను ముంచిన ఉదంతం లేదు. ఈ దాడితో ఇరాన్‌ మీద జరుపుతున్న యుద్ధాన్ని మన ప్రధాని నరేంద్రమోడీ జిగినీదోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ మనపెరటి తోట హిందూ మహా సముద్రంలోకి తెచ్చినట్లయింది.

ఇది మనకు ఆందోళన కలిగించటమే కాదు, గర్హనీయం కూడా. అయినా సరే మన ప్రధాని నోరు మెదపరు. ఖండించే ధైర్యం 56 అంగుళాల ఛాతీకి లేకపోయినా కనీసం ఈ ఉదంతం పట్ల ఎలాంటి ఆందోళన కూడా వెల్లడించకపోవటాన్ని ఏమనాలి? విశాఖలో జరిగిన విన్యాసాలకు ఇరాన్‌ నౌక వచ్చింది మన ఆహ్వానం మీద తప్ప యుద్ధానికి కాదు. అమెరికాను కూడా ఆహ్వానించాం, విశాఖ వచ్చిన ఇరాన్‌ నౌకను తిరుగు ప్రయాణంలో పేల్చివేయాలన్న దుష్ట నిర్ణయానికి ముందే వచ్చిన కారణంగానే తన నౌకలకూ అదే పరిస్థితి ఎదురు కావచ్చనే దూరాలోచనతో విశాఖకు కేవలం కొందరు అధికారులను తప్ప నౌకలను పంపలేదని తేలిపోయింది. దీన్ని మన ముసలి జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌ పసిగట్టి అతిధిని హెచ్చరించటంలో విఫలమైనట్లు కనిపిస్తోంది.

యుద్ధాలు, ఉద్రిక్తతలు తలెత్తినపుడు శత్రుదేశాలకు చెందిన నౌకలు తమ జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశిస్తే హెచ్చరికలు చేయటం, ఉల్లంఘిస్తే పేల్చివేతకు పాల్పడవచ్చు. కానీ, అంతర్జాతీయ జలాల్లో ఉన్నపుడు అది కూడా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో మరొక ఖండంలోని ఒక నౌకను అమెరికా పేల్చివేయటం అంతర్జాతీయ సూత్రాలకు విరుద్దం. భారతీయ విలువలు, సాంప్రదాయాలను తాము మాత్రమే పాటిస్తున్నట్లు కాషాయ నేతలు చెప్పుకుంటారు.తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మమే అన్న సూక్తి ప్రకారం ఎవరు తప్పు చేసినా చెప్పాలా వద్దా? అందులోనూ ప్రపంచ రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర పోషించాలని భావిస్తున్న నేతలు పరీక్షా సమయం వచ్చినపుడు మౌనంగా ఉంటే మిగతా దేశాలు మనవైపు చూస్తాయా?

మనకు అత్యంత సమీపంలోకి అమెరికా జలాంతర్గామి వచ్చి మన అతిధి నౌకను పేల్చివేయటాన్ని నిరోధించటంలో మనం ఎందుకు విఫలమయ్యాం? పరిస్థితులు తారు మారైతే ఇలా వచ్చి అలా మన మీద దాడి చేస్తే పరిస్థితి ఏమిటి? పాకిస్థాన్‌ జలాంతర్గాములు వచ్చినా ఇంతేనా? రెండవది తెలిసి ఉంటే మనకు ఇబ్బంది కలిగించే దాడి నివారణకు మోడీ ఎందుకు పూనుకోలేదు! ఇలా ఎన్నో అనుమానాలు, సందేహాలు. ఈ నేపథ్యంలోనే మన నౌకాకేంద్రాలను అమెరికా వినియోగించుకుంటున్నదనే ప్రచారం వైరల్‌ అయింది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ సాధ్యమైనంత మందిని తనతో తీసుకుపోయేందుకు ఒక ఎత్తుగడగా శ్రీలంక వద్ద నౌకను పేల్చివేయించి ఉండవచ్చు.

ఇలాంటి వాడా మనకు మిత్రుడు! మనలను ఇంకా మిత్రదేశంగానే పరిగణిస్తున్న కారణంగా ఇరాన్‌ సున్నితంగా ”భారత నౌకాదళ అతిధి”గా వచ్చిన తమ నౌకను పేల్చివేసినట్లు వర్ణించింది. మీ వైఖరి ఏమిటో తేల్చుకోవాలి, చెప్పాలన్న అంతరార్ధం కూడా దీనిలో ఇమిడి ఉంది. అమెరికా-ఇజ్రాయిల్‌ పన్నిన వలలో చిక్కుకోవద్దని గల్ఫ్‌దేశాలను హెచ్చరిస్తూ సౌదీ అరేబియా మీడియా సంపాదకులలో ఒకడైన అద్వాన్‌ ఆల్‌ ఆహమరీ చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా వర్తిస్తాయి. భారత్‌ ఆతిధ్యమిచ్చిన విన్యాసాలకు హాజరై తిరిగి వెళ్తున్న నౌకను పేల్చివేయటం ద్వారా మన ఇరుగుపొరుగును యుద్ధ ప్రాంతంలోకి సమర్ధవంతంగా అమెరికా నెట్టిందని రక్షణ వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలానే చేసిన వ్యాఖ్యలను కొట్టిపారవేయలేము. దాడి జరిగింది మన జలాల్లో కాదు కదా మనకేం బాధ్యత ఉంటుంది అని తెలివిగా తర్కాన్ని ప్రదర్శించ వచ్చు. హిందూమహా సముద్రం మన పెరటితోట వంటిది, అక్కడ జరిగే ప్రతిపరిణామం మనల్ని ఏదో విధంగా ప్రభావితం కావిస్తుంది.

అదే అమెరికా, చైనా తీరంలో అలాంటి పనులు చేస్తే అవి ఊరుకుంటాయా ? మౌనంగా ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా తీవ్రమైన విమర్శలు రావటంతో నరేంద్ర మోడీ తొలిసారిగా నోరు విప్పారు. ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో కలసి గురువారం నాడు సంయుక్త పత్రికా గోష్టిలో మాట్లాడుతూ మిలిటరీ ఘర్షణలు ప్రపంచ సమస్యలను పరిష్కరించలేవంటూ సుభాషితం చెప్పారు. మంచిదే ఈ మాత్రానికి ఆ చెప్పేదేదో ఇరాన్‌పై దాడులను ప్రారంభించిన వెంటనే తానే స్వయంగా చెప్పి ఉండవచ్చు, ఒక చిన్నదేశాధినేత తోడు లేకుండా ఎందుకు మాట్లాడలేకపోయారు! అదే విధంగా హత్యకు గురైన ఖమేనికి సంతాపం తెలుపుతూ గురువారం నాడు మన విదేశాంగశాఖ ప్రతినిధి ఇరాన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి సంతాప పుస్తకంలో సంతకం చేసి వచ్చారు. ఇదీ అంతే, హత్యను ఖండించటానికి నోరు రాలేదు సరే, సంతాపం తెలపటానికి కూడా ఇంత తటపటాయింపా? కొంపదీసి దీనికీ అమెరికా అనుమతి కోసం ఆగారా అని ఎవరైనా అంటే తప్పుపట్టగలమా?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -