రూపాయి చిల్లరా దొరకదు.. గొంతు తడవదు..
అపరిశుభ్రంగా పరిసరాలు
నవతెలంగాణ-వరంగల్
ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్ ఎంజీఎం ఆస్పతిలో రోగుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ప్రాణాలు కాపాడాల్సిన చోట, కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి నెలకొంది. ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతుండటంతో ఆస్పత్రికి వచ్చే వేలాది మంది రోగులు, వారి సహాయకులు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. ఎంజీఎంలో రోజువారీగా ఓపీ 2,500 నుంచి 3,500 మంది వరకు ఉంటోంది. ఐపీ 1,000 నుంచి 1,200మంది వరకు ఉంటోంది. అత్యవసర విభాగంలో అయితే 200 నుంచి 300మంది వరకు ఉంటున్నారు. ప్రసవాలు – గైనకాలజీ 50 నుంచి 80 వరకు ఉంటోంది.
వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే సోమవారం ఓపీ సంఖ్య ఒక్కోసారి 4,000 కూడా దాటుతోంది. సుదూర ప్రాంతాల నుంచి రోగులు రావడం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఎండలు పెరుగుతుండటం, వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసులు పెరుగుతుండటంతో జనరల్ మెడిసిన్ విభాగంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఒక రోగికి కనీసం ఇద్దరు సహాయకులు ఉన్నా, ప్రతిరోజూ ఆస్పత్రి ప్రాంగణంలో సుమారు 8,000 నుంచి 10,000 మంది వరకు ఉంటారు. ఇంతమంది జనం ఉండే చోట, కేవలం ఒక్క రూపాయి కాయిన్ ప్లాంట్పైనే ఆధారపడటం, అది కూడా చిల్లర దొరక్కపోవడం వల్ల వేలాది మంది దాహంతో అలమటిస్తున్నారు.
ముఖ్యంగా ఓపీ కోసం గంటల తరబడి వేచి ఉండే రోగులకు ఇది నరకప్రాయంగా మారింది. మరోవైపు, ఆస్పత్రి ఆవరణలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద నీరు రావాలంటే ఒక్క రూపాయి కాయిన్ వేయాల్సిందే. అయితే, ఆ రూపాయి చిల్లర దొరకడమే ఇప్పుడు పెద్ద యుద్ధంగా మారింది. చిల్లర ఇచ్చేందుకు కేటాయించిన గదికి తాళం వేసి ఉండటంతో రోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రూపాయి కాయిన్ కోసం ఆస్పత్రి బయట ఉన్న దుకాణాల చుట్టూ తిరుగుతున్నా, ఎక్కడా చిల్లర దొరకడం లేదని రోగులు వాపోతున్నారు.
అపరిశుభ్రంగా వాటర్ పంపు పరిసరాలు
తీరా రూపాయి వెతికి పట్టుకొచ్చినా, అక్కడ ఉన్న అపరిశుభ్రత మరో ఆందోళనకు దారితీస్తోంది. వాటర్ పంప్ పరిసరాలు అపరిశుభ్రంగా, పాచి పట్టి ఉండటంతో నీరు కలుషితమవుతోంది. శుభ్రమైన నీరు తాగాలని వైద్యులు చెబుతుంటే, ఎంజీఎంలో మాత్రం డబ్బులు ఇచ్చి మరీ కలుషిత నీరు తాగాల్సిన పరిస్థితి ఉందని రోగులు వాపోతున్నారు. దీనివల్ల కొత్త రోగాలు వస్తాయని భయపడుతున్నారు. చిల్లర కోసం గంటల తరబడి వెతకాల్సి వస్తోంది. డ్యూటీలో మనుషులు ఉండరు, గదులకు తాళాలు వేసి ఉంటాయి. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
అధికారులు స్పందించాలి
వేల సంఖ్యలో ఓపీ వచ్చే ఈ ఆస్పత్రిలో తాగునీటి సమస్యపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. చిల్లర మార్పిడి కేంద్రం వద్ద సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాలి. వాటర్ ప్లాంట్ వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టి, స్వచ్ఛమైన నీరు అందేలా చూడాలి. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా, ఉచిత తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
-సత్యరాజ్, రోగి బంధువు



