Friday, March 6, 2026
E-PAPER
Homeజాతీయంపోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీకి మంగళం

పోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీకి మంగళం

- Advertisement -

పేదల పోషకాలకు కేంద్రం మోకాలడ్డు
న్యూఢిల్లీ : అనేక ఏండ్లుగా కేంద్రం పేదలకు పోషకాలతో కూడిన బలవర్ధక పోర్టిఫైడ్‌ బియ్యాన్ని అందజేస్తున్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా ఆ పథకాన్ని నిలిపివేసింది. సాధారణ బియ్యంలో ఇనుము, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ12 వంటి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలను కృత్రిమంగా కలపడం ద్వారా పోర్టిఫైడ్‌ బియ్యాన్ని తయారు చేస్తారు. రక్తహీనతను, పోషక లోపాలను నివారించి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇది దోహపడుతుంది. పేదలకు ఎంతగానో ఉపయోగ పడుతున్న ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కేంద్రం గత నెల 27న ప్రకటించింది. పోర్టిఫైడ్‌ బియ్యంలో పోషక ఫలితాలు స్థిరంగా ఉండడం లేదని, లక్షల టన్నుల పోర్టిఫైడ్‌ బియ్యం కేంద్ర గోదాముల్లో పేరుకు పోయిందని, అందుకే ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది.

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ చేసిన అధ్యయనాన్ని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో ఉటంకించింది. దేశంలోని వివిధ వ్యవసాయ, వాతావరణ మండలాలలో ఉష్ణోగ్రతలు, తేమ భిన్నంగా ఉంటాయని, ఈ కారణంగా పోర్టిఫైడ్‌ బియ్యం సమర్ధవంతంగా ఉపయోగపడడం లేదని తెలిపింది. ప్యాకేజీ, నిర్వహణ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయని చెప్పింది. పోర్టిఫైడ్‌ బియ్యంలో సూక్ష్మ పోషకాల పరిమాణం తగ్గిపోతోందని, నిల్వ సామర్ధ్యం కూడా పడిపోతోందని వివరించింది. గత సంవత్సరం అవసరానికి మించి పోర్టిఫైడ్‌ బియ్యం 674 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర నిల్వ ఉన్నదని అంచనా. ఇప్పటికే రెండు సంవత్సరాలకు పైగా నిల్వలు పేరుకుపోయి ఉన్నాయని, ప్రజా పంపిణీ వ్యవస్థ మినహా ఎవరూ దీనిని కోరడం లేదని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తర్సెమ్‌ సింగ్‌ సైనీ చెప్పారు.

ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని, వివిధ ప్రాంతాలలో లభ్యమవుతున్న విభిన్న ఆహార ధాన్యాల లభ్యతను పరిగణనలోకి తీసుకోవడం లేదని ‘రైట్‌ టూ ఫుడ్‌ క్యాంపెయిన్‌’కు చెందిన జేమ్స్‌ హెరెంజ్‌ విమర్శించారు. ‘ఇది మన ఆహార సార్వభౌమత్వంపై ప్రత్యక్షంగా దాడి చేయడమే అవుతుంది’ అని చెప్పారు. మన దేశంలోని కొన్ని సంప్రదాయ బియ్యం రకాలలో పోషకాలు అధికంగా ఉన్నాయి. వాటిలో ఇనుము సమృద్ధిగా ఉంది. అయినప్పటికీ పథకం అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి శాస్త్రీయంగా ఏకాభిప్రాయం లేదు. రాష్ట్రాలు కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా ఉంది. అయినా ప్రభుత్వం పోర్టిఫైడ్‌ బియ్యాన్ని రాష్ట్రాల నెత్తిన రుద్దింది.

పైలట్‌ ప్రాజెక్టు కింద పదిహేను రాష్ట్రాలను ఎంపిక చేయగా వాటిలో దాదాపు సగం రాష్ట్రాలు దాని అమలుకు ఇష్టపడలేదు. అయినప్పటికీ 2022 మార్చిలో కేంద్రం చిన్నారుల భోజన పథకంలో దీని వినియోగాన్ని తప్పనిసరి చేసింది. 2023 నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేస్తోంది. 2024 నాటికి బలహీనంగా ఉన్న మహిళలు, చిన్నారులు, పేదల కోసం దీనిని విస్తరించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2019-20, 2024 మార్చి 31 మధ్యకాలంలో వివిధ పథకాల ద్వారా 406 లక్షల మెట్రిక్‌ టన్నుల పోర్టిఫైడ్‌ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఏడాదికి రూ.2,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. కనీసం 2028 వరకైనా పథకాన్ని కొనసాగించాలని భావించారు. ఇంతలోనే దాని అమలును నిలిపివేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -