- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్: మూడు నెలలు నీటిపారుదల మంత్రిగా అవకాశం ఇస్తే నీటి సమస్యను పరిష్కరించి చూపిస్తానంటూ బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పదేండ్లు ఏం చేయని వారు మూడు నెలల సమయంలో ఏం చేస్తారని అన్నారని,గత ప్రభుత్వ అప్పులు, తప్పులను సరి చేస్తున్నామని శుక్రవారం మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. హరీశ్ రావు నిజంగా కాంగ్రెస్‌లోకి వస్తానంటే పార్టీలో చర్చిస్తామన్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి హరీశ్‌ను చేర్చుకోవాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలపై మహేశ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమన్నారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తుంగతుర్తి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు వింటామన్నారు. పార్టీలో అందరూ సమానమే అని తేల్చిచెప్పారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిజీగా ఉండడం వల్ల ఇద్దరు సీనియర్ నాయకులను సమస్య పరిష్కారం కోసం నియమించామని అన్నారు. సస్పెండ్ చేయడమే పరిష్కారం కాదన్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతామని అన్నప్పుడు.. పది మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని చెప్పారు. నీళ్ల దోపిడీ జరిగినప్పుడు ఈటల మంత్రిగా ఉన్నారని మహేశ్ గుర్తుచేశారు.


