నవతెలంగాణ గురుగ్రామ్: ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో గురువారం రాత్రి పోలీసులు, నేరస్థుల మధ్య ఫైరింగ్ జరిగింది. సుమారు 60 రౌండ్ల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో నలుగురు నేరస్థులు మృతిచెందగా, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక ఫేజ్‌లో ఆ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం రాత్రి 9.30 నిమిషాలకు క్రైం బ్రాంచ్ పోలీసులు సమాచారం అందుకున్నారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో సాయుధ వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది. ఆ ఇంటెలిజెన్స్ ఆధారంగా క్రైం బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సువాంత్ లోక్ ఫేజ్‌లో ఉన్న ఓ వ్యాపారి ఇంటి వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. విదేశాల్లో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్.. వ్యాపారి నుంచి బెదిరింపుకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అనుమానిత నిందుతలను పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని ఆదేశించారు. కానీ నిందిత వ్యక్తులు విచక్షణారహితంగా ఫైరింగ్ చేశారు. ఆ కాల్పులకు కౌంటర్‌గా పోలీసులు ఫైరింగ్‌కు దిగారు.
దీపక్ నందల్ గ్యాంగ్‌కు చెందిన షూటర్లు ఈ కాల్పుల్లో పాల్గొన్నారు. అందరికీ గాయాలు అయినట్టు తెలిసింది. వారందరిని ఓ ప్రయివేటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. కానీ, వారిలో నలుగురు మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. అయిదో వ్యక్తి మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గురుగ్రామ్ పోలీసులు కూడా గాయపడ్డారు. వాళ్లను కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



