నవతెలంగాణ-హైదరాబాద్: కొండా సుస్మిత వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అగ్రహం వ్యక్తం చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖను వివరణ కోరాలని నిర్ణయించింది. మరోవైపు కొండ సుస్మితపై క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆమెపై కఠిన చర్యలకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయని ఆ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా ఖండించారు.
కాగా, వరంగల్ జిల్లా గీసుకొండలో బుధవారం మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలను ఆమె అభిమానులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పరకాల నుంచి తాను బరిలో దిగుతానని ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం తనకు టికెట్ ఇవ్వకున్నా.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వెల్లడించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుస్మిత వ్యాఖ్యలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై పార్టీ సీరియస్ అయింది.



