సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశనాయక్
నవతెలంగాణ – అచ్చంపేట
పెంచిన వంటగ్యాస్ ధరలు తగ్గించాలని ఆదివారం అచ్చంపేట పట్టణంలో సీపీఐ(ఎం) నాయకులు నిరసన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ ధరలు పెంచి మహిళలకు ఇబ్బందులను గురి చేయడమే కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చే గొప్ప కానుక అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశ నాయక్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరాయంగా పెంచుతున్నారని విమర్శించారు.
యుద్ధం నెపంతో వంట గ్యాస్ పై రూ.60, వాణిజ్య సిలిండర్ పై రూ.115 పెంచారని, మరి యుద్ధాలు లేనప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఒకవైపు వంట చెరుకు వాడకాన్ని తగ్గించాలని, వాయు కాలుష్యాన్ని నివారించాలని నీతులు చెబుతూ మరోవైపు ఇష్టా రీతిగా ధరలు పెంచుతూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఉపాధి లేకుండా చేసి వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం మాత్రం నిరంతరం వస్తు సేవల ధరలను పెంచుతూ అర కోర ఆదాయాలకు సైతం కోతలు పెడుతున్నదని విమర్శించారు.
సామ్రాజ్య వాద దేశాలకు భయపడి దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టుపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. సామ్రాజ్య వాద దురహంకారంతో అమెరికా ఇజ్రాయిల్ దేశాలు కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడుల వల్లే ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే ఇరాన్ పై దాడులను ఆపి శాంతి చర్చలు జరపాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దీర్ఘ కాల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) అచ్చంపేట మండల ప్రధాన కార్యదర్శి వర్ధం సైదులు, సహాయ కార్యదర్శి రాములు, నాయకులు బిచ్చ, లక్ష్మణ్ , దేవులీ, లక్ష్మి, రెడ్యా, వెంకటయ్య, శ్రీనయ్య తదితరులుపాల్గొన్నారు.



