‘ఆడపిల్లల బట్టల్లోనే అశ్లీలత ఉందా… లేక మీ చూపులోనా?’ ఈ ప్రశ్న చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ఇది సమాజాన్ని అద్దంలో నిలబెట్టే ప్రశ్న. ఎందుకంటే మనం తరచుగా ఓ అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు, ముందుగా ఆమె వ్యక్తిత్వం గురించి కాదు ఆమె వేసుకున్న బట్టల గురించి మాట్లాడతాం. ఆమె ఆలోచనలు, ఆమె ప్రతిభ, ఆమె స్వభావం, ఆమె కష్టాలు.. ఇవన్నీ పక్కకు తప్పుతాయి. బట్టలే కేంద్ర బిందువవుతాయి. ఇది ఒక్కరోజులో ఏర్పడిన అలవాటు కాదు. ఏండ్లుగా మనలో నాటుకుపోయిన ఒక సామాజిక రుగ్మత. అది ఇప్పుడు సహజంగా అనిపిస్తోంది. అయితే సహజంగా అనిపించడం వల్ల అది సరైనదని అర్థం కాదు.
అశ్లీలత అనే పదాన్ని మనం ఎంత సులభంగా వాడేస్తామో గమనించాలి. ఒక అమ్మాయి స్లీవ్‌లెస్ వేసుకుంటే ‘అశ్లీలం’ అంటాం. జీన్స్ వేసుకుంటే ‘అధిక స్వేచ్ఛ’ అంటాం. సంప్రదాయ దుస్తులు వేసుకుంటే ‘సంస్కారం’ అంటాం. అంటే అశ్లీలతకు మనం సౌకర్యానుసారం నిర్వచనం ఇస్తున్నాం. ఒకే రకమైన దుస్తులు ఒకరి విషయంలో సాధారణంగా కనిపిస్తే, మరొకరి విషయంలో ఎందుకు అశ్లీలంగా కనిపిస్తాయి? కారణం బట్టలు కాదు. కారణం మనం చూసే దృష్టి. మన ఆలోచనల్లో దాగి ఉన్న పాత నమ్మకాలు, మనం చిన్నప్పటి నుంచి విన్న నియంత్రణ మాటలు.
ఇది ద్వంద్వ వైఖరి కాదా?
ఆడపిల్లల బట్టల చుట్టూ ఎంత వివక్ష ఉందో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అబ్బాయిలు ఏదైనా వేసుకుంటే అది వారి సౌకర్యం. కానీ అమ్మాయి అదే స్వేచ్ఛతో డ్రెస్ ఎంచుకుంటే అది ‘అతి’గా మారుతుంది. ఒక అబ్బాయి దుస్తుల ఆధారంగా అతని స్వభావాన్ని ఎవరూ కొలవరు. కానీ ఒక అమ్మాయి విషయంలో మాత్రం తీర్పు వెంటనే వస్తుంది. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇది లింగ వివక్ష. ఇది ఆమె శరీరంపై సమాజం కలిగి ఉన్న నియంత్రణ భావన. మన ఇంట్లో ఉన్న అమ్మ, అక్క, చెల్లి అదే మోడ్రన్ డ్రెస్ వేసుకున్నా మనకు అశ్లీలంగా అనిపించదు. ఎందుకంటే అక్కడ మనం ముందుగా బంధాన్ని చూస్తాం. గౌరవాన్ని చూస్తాం. ప్రేమను చూస్తాం. కానీ అదే బట్టలు ఒక అపరిచితురాలు ధరిస్తే తీర్పు మొదలవుతుంది. అంటే సమస్య బట్టల్లో లేదని స్పష్టంగా తెలుస్తోంది. మనం ఎవరిని ఎలా చూడాలనుకుంటామో మనమే నిర్ణయిస్తున్నాం. పరిచయం ఉన్న మహిళలకు ఒక ప్రమాణం. తెలియని మహిళలకు మరో ప్రమాణం.
మీ విలువల్లోనే ఉంది
అమ్మాయి బయట నడుస్తుంటే ఆమె అడుగుల కంటే ముందుగా ఆమెను గమనించే చూపులు పరుగెత్తుతాయి. ఆ చూపుల్లో ఆసక్తి కంటే ఎక్కువగా ఒక హక్కు భావన ఉంటుంది. ‘అలా వేసుకుంది కాబట్టి’ అనే వాక్యం వినిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే.. ప్రతి వ్యక్తి తన చూపుకు తానే బాధ్యుడు. ఒకరి ఆలోచనలను నియంత్రించలేకపోవడం వల్ల బాధ్యతను ఆమె దుస్తులపై మోపడం అన్యాయం. ఆమె ఏ బట్టలు వేసుకున్నా ముందుగా గౌరవమే ఇవ్వాలి. ఎలా బట్టలు వేసుకున్నా గౌరవం ఇవ్వడం మన బాధ్యత. అది ఆమెకు మీరు చేస్తున్న ఉపకారం కాదు, అది మీ వ్యక్తిత్వానికి మీరు పెట్టుకునే ప్రమాణం. ఒకరి దుస్తులు చూసి మీ ప్రవర్తన మారితే, సమస్య వారి బట్టల్లో లేదు మీ విలువల్లో ఉంది.
సంస్కారమంటే ఏమిటి?
‘క్యారెక్టర్’ అనే పదం కూడా ఇక్కడ తరచుగా వినిపిస్తుంది. చిన్న డ్రెస్ అయితే ‘చెడు అమ్మాయి’. సంప్రదాయ డ్రెస్ అయితే ‘మంచి అమ్మాయి’. కానీ వ్యక్తిత్వం అనేది బట్టలతో నిర్ణయించబడదు. అది మన ప్రవర్తనలో ఉంటుంది. ఇతరులను ఎలా గౌరవిస్తామో అందులో ఉంటుంది. సమానత్వాన్ని ఎంతవరకు పాటిస్తామో అందులో ఉంటుంది. ఒక అమ్మాయి దుస్తులు చూసి ఆమె విలువను నిర్ణయించడం అంటే ఒక పుస్తక కవర్ చూసి కథ తీర్పు చెప్పడమే. మహిళల భద్రత గురించి మనం తరచుగా మాట్లాడుతాం. కానీ పరిష్కారం మాత్రం వారి దుస్తులను నియంత్రించడం. ‘ఇలా వేసుకోకు’, ‘రాత్రి బయటకు వెళ్లకు’, ‘ఇది సంస్కారం కాదు’ ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ‘ఎవరినైనా గౌరవంగా చూడాలి’ అనే పాఠం ఎంత గట్టిగా వినిపిస్తోంది? సంస్కారం అంటే నియంత్రణ కాదు. సంస్కారం అంటే పరస్పర గౌరవం. ఒకరి స్వేచ్ఛను తగ్గించడం కాదు.
ఆలోచనల్లో మార్పు రావాలి?
దుస్తులు అనేవి వ్యక్తిగత ఎంపిక. ఆ ఎంపిక వెనుక సౌకర్యం ఉండొచ్చు, వ్యక్తిత్వం ఉండొచ్చు, అభిరుచి ఉండొచ్చు. కానీ సమాజం దాన్ని ఒక నైతిక ప్రమాణంగా మార్చేసింది. ఒక అమ్మాయి తన శరీరంపై తనకే హక్కు ఉందని చూపించినప్పుడు, అది కొందరికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆ అసౌకర్యానికే ‘అశ్లీలత’ అనే పేరు పెడతాం. కానీ అసలు సమస్య దుస్తుల్లో లేదు. మన ఆలోచనల్లో ఉంది. సమానత్వం గురించి మనం చాలా మాట్లాడుతాం. కానీ సమానత్వం మాటల్లో కాదు ప్రవర్తనలో కనిపించాలి. ఒక అమ్మాయి ఎలా వేసుకున్నా ఆమెను ముందుగా మనిషిగా చూడగలిగితేనే మనం నిజంగా సమానత్వాన్ని నమ్ముతున్నామని చెప్పగలం. లేకపోతే అది కేవలం ఒక నినాదం. మారాల్సింది వారి దుస్తులు కాదు. మారాల్సింది మన దృష్టి. ఆమె బట్టల్ని కొలవడం మానేసి ఒకసారి మీ చూపుని కొలవండి. అశ్లీలతను బయట వెతకడం ఆపి, మన ఆలోచనల్లో వెతికే ధైర్యం చేసుకున్నప్పుడే సమాజం నిజంగా మారుతుంది.
– అనూష గుర్రాల



