Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవార్‌ రివర్స్‌

వార్‌ రివర్స్‌

- Advertisement -

– ఇజ్రాయిల్‌-అమెరికాకు చుక్కలు చూపిస్తున్న ఇరాన్‌
– ధాటికి తట్టుకోలేక టెహ్రాన్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ అనుకూల మీడియా ప్రచారం
– ఇరాన్‌ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వార్తల ప్రసారం
– వందలాదిమంది చనిపోయారంటూ కథనాల్ని వండివారుస్తున్న వైనం
– ఇజ్రాయిల్‌-అమెరికా మృతుల సంఖ్యపై గోప్యత
– వివరాలు వెల్లడించవద్దని ఆంక్షలు
– ఆధిపత్య దేశాల్లో ప్రజావ్యతిరేకత పెరుగుతుందని భయం
-గల్ఫ్‌ దేశాల కన్నెర్ర సంకటస్థితిలో ఇజ్రాయిల్‌, యూఎస్‌


వార్‌ వన్‌సైడ్‌ అవుతుంది అనుకుంటే సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఇరాన్‌ను ఆక్రమించేందుకు ఇజ్రాయిల్‌, అమెరికా చేసిన కుట్రలు బెడిసికొడుతున్నాయి. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెడితే ఆ దేశం తమ చేతుల్లోకి వస్తుందని ట్రంప్‌, నెతన్యాహు భావించారు. కానీ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఇరాన్‌ చేస్తున్న ఉధృత దాడులు అమెరికా, ఇజ్రాయిల్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గల్ఫ్‌ దేశాలు అమెరికా చర్యల్ని అభిశంసించాయి. పశ్చిమాసియా దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఆ దేశాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.

నవతెలంగాణ-సెంట్రల్‌ డెస్క్‌
యుద్ధం చేస్తే ఇరాన్‌ సరెండర్‌ అవుతుందనుకుని రెచ్చిపోయిన ఇజ్రాయిల్‌, అమెరికా దేశాలకు చుక్కెదురవుతోంది. ఇరాన్‌ సైనిక సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి, దూకుడు ప్రదర్శించిన ఆ రెండు దేశాలు ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. ఇజ్రాయిల్‌, అమెరికా దాష్టీకంపై ఇరాన్‌ చేస్తున్న యుద్ధం వారికి ముచ్చెమటలు పట్టిస్తుంది. గల్ఫ్‌ దేశాలతో పాటు, ఇజ్రాయిల్‌, అమెరికాలోనూ అక్కడ ప్రభుత్వాలపై వ్యతిరేకతను పెంచుతోంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఇవి క్రమంగా అమెరికాతో పాటు ఇజ్రాయిల్‌, గల్ఫ్‌ దేశాల్లోకి విస్తరిస్తున్నాయి. వీటినుంచి తప్పించుకొనేందుకు ట్రంప్‌ చేస్తున్న ప్రచార ఎత్తుగడలు బెడిసికొడుతున్నాయి. తన అనుకూల మీడియా ద్వారా ఇరాన్‌లో వందలాదిమంది మరణించారనీ, భారీ ఎత్తున ఆ దేశ సైనికసంపత్తిని ధ్వంసం చేసామని వార్తలు రాయిస్తున్నారు. అదే సమయంలో ఇరాన్‌ ప్రతిదాడుల వల్ల ఇజ్రాయిల్‌, అమెరికా, గల్ఫ్‌దేశాల్లో జరుగుతున్న ప్రాణ, ఆస్తినష్టాల లెక్కల్ని మాత్రం చెప్పట్లేదు. దీనిపై అక్కడి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్‌ సమాధానాలు దాటవేస్తున్నారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెడితే ఆ దేశం తమ చేతుల్లోకి వస్తుందని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భావించారు. కానీ ఈదాడి వల్ల ఇరాన్‌ ప్రజల్లో జాతీయవాదం పెరిగింది. అప్పటివరకు వివిధ రాజకీయ కారణాలతో గ్రూపులుగా ఉన్న ప్రజలు, అన్యాయంగా తమదేశ సుప్రీం లీడర్‌ను హత్య చేయడంపై భగ్గుమన్నారు. తమమధ్య ఉన్న అన్ని విభేదాలను పక్కనపెట్టి ‘దేశం కోసం’ అని నినదిస్తూ ఇజ్రాయిల్‌, అమెరికాపై ప్రతీకార దాడులకు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాన్ని ఊహించని ట్రంప్‌ ఇప్పుడు సంకటస్థితిలో పడ్డారు. ఖమేనీని చంపేస్తే ఇరాన్‌లో అంతర్యుద్ధం వస్తుందని భావిస్తే, అందుకు భిన్నంగా అమెరికాలో నిరసనలు పెచ్చరిల్లాయి. రష్యా, చైనా, బ్రిటన్‌, జర్మనీ వంటి దేశాలు ట్రంప్‌ దూకుడుకు కళ్ళెం వేసే ప్రయత్నం చేస్తుండటం కూడా ఆయనకు నచ్చట్లేదు. దీనితో ఆయా దేశాధినేతలపై కూడా ఇష్టంవచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. అదే సమయంలో అతి తక్కువ వ్యయంతో వ్యూహాత్మకంగా ఇరాన్‌ చేస్తున్న దాడులపై యుద్ధనిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన చుట్టుపక్కల ఉన్న గల్ఫ్‌దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ల ద్వారా క్షిపణులు ప్రయోగిస్తూ ఇరాన్‌ సైన్యం భీకరదాడులు చేస్తున్నది. దీంతో ఇప్పటికే గల్ఫ్‌ దేశాల్లో అమెరికా, ఇజ్రాయిల్‌పై వ్యతిరేకత పెరిగింది. స్వయంగా గల్ఫ్‌దేశాల అధినేతలు తమ అభిశంసనను ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్లారు. దూకుడు తగ్గించాలని సూచించారు. ఈ నిరసనలు క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తున్నాయి. ఈ తీవ్రతను తగ్గించుకోవడం కోసం ట్రంప్‌ ప్రత్యామ్నాయ రాజకీయ ఎత్తుగడలు వెతుక్కుంటున్నట్టు తెలుస్తున్నది. దానిలో భాగంగా క్యూబాపైకి దృష్టిని మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కార్పొరేటు మీడియాను నియంత్రిస్తున్న అమెరికా-ఇజ్రాయిల్‌
యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించింది. ఇరాన్‌ క్షిపణి దాడుల్లో స్పీడు పెంచింది. ఇజ్రాయిల్‌, అమెరికా వద్ద ఆయుధాల నిల్వలు క్రమంగా తగ్గిపోతుంటే.. ఇరాన్‌ మాత్రం ధీటుగా స్పందిస్తోంది. దీంతో అందరికంటే ముఖ్యంగా ఇజ్రాయిల్‌ పరిస్థితి దారుణంగా మారింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ట్రంప్‌ లక్షలకోట్ల విలువైన ఆయుధాలను ఇజ్రాయిల్‌కు అమ్ముతున్నట్టు ప్రకటించారు. దానితో పాటు కార్పొరేట్‌ మీడియా, ఐటీ రంగాన్ని బెదిరించి తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఇరాన్‌ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రపంచవ్యాప్తంగా వార్తల్ని ప్రసారం చేయాలని ఆదేశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే యుద్ధంలో ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతిందనీ, వేల సంఖ్యలో మరణాలు సంభవించాయనే ప్రచారాన్ని నెత్తికెత్తుకున్నారు. అదే సమయంలో ఇరాన్‌ ప్రతిదాడుల్లో జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలను మాత్రం ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేసిన యుద్ధంలో కూడా ఇలాంటి ప్రచారమే చేసిన విషయం తెలిసిందే.

ఇజ్రాయిల్‌లో నెతన్యాహుపై వ్యతిరేకత
ఇజ్రాయిల్‌లో నెతన్యాహుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజానీకం రగిలిపోతున్నారు. గాజా యుద్ధంతో లేనిపోని తలనొప్పులు కొనితెచ్చుకుని, ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం చేయటానికి అంత తొందర ఎందుకొచ్చిందని ఆదేశ నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్‌లకు ఇరాన్‌ గట్టిగా బదులిస్తున్నా, ఇరాన్‌ దాడులతో అనేక మరణాలు నమోదవుతున్నా, వాటి వివరాలు పూర్తిగా బయటికి రావట్లేదని భావిస్తున్నారు. దీనితో నెతన్యాహుపై తీవ్రమైన వ్యతిరేకత ఆ దేశంలో పెరుగుతున్నది.

అమెరికా-ఇజ్రాయిల్‌కు కలిగిన నష్టాన్ని నివేదించని మీడియా
అమెరికా సైనిక స్థావరాలతో పాటు, ఇజ్రాయిల్‌కూ భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించిందన్నది పరిశీలకుల అభిప్రాయం. కానీ దీని వివరాలు ఏ పత్రికలోనూ, ఛానల్స్‌లోనూ కనిపించటం లేదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌ను మానసికంగా దెబ్బతీసేలా.. వార్‌కు సంబంధించి ఒకవైపు సమాచారాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇరాన్‌ వేస్తున్న క్షిపణులుతో ఇజ్రాయిల్‌ మాత్రమే కాదు యూఎస్‌కు అనుకూలంగా ఉన్న గల్ఫ్‌దేశాలు సైతం భీతిల్లుతున్నాయి. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవటం వాటికి పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ట్రంప్‌ వ్యవహారశైలి ఏకపక్షంగా ఉండటం, దానికి సెనెట్‌ మద్దతు పలకటం, ఇజ్రాయిల్‌తో కలిసి ముస్లిం దేశాలను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేలా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయని పరిశీలకులు చెప్తున్నారు.

గల్ఫ్‌ దేశాల్లో ప్రజల ఆగ్రహం
ట్రంప్‌ను కాదంటే ఎక్కడ బాంబులు పడతాయోనన్న భయం గల్ఫ్‌ దేశాల రాజులు, అధ్యక్షులను వెంటాడుతూ ఉండొచ్చు. కానీ ఆ దేశాల్లోని ప్రజల్లో మాత్రం అసంతృప్తి కట్టలు తెంచుకుంటోంది. ఇన్నాళ్లు ఇరాన్‌లోని ఖమేనీ సర్కార్‌ను దించాలనే వరకు యుద్ధం సాగి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. ఖమేనీ వ్యతిరేక ఆందోళనలను తమవైపు తిప్పుకోవాలని అమెరికా చేసిన ఎత్తుగడలు విఫలమయ్యాయి. చర్చలు సాగుతుండగానే సైనిక చర్యకు పూనుకోవడం, ఖమేనీ హత్యతో ఇరాన్‌ ప్రజల్లో ఐక్యత మరింత పెరిగింది. దీనికి తోడు అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఖమేనీతో పాటు అమాయక ప్రజలను చంపేశారన్న ఆగ్రహం టెహ్రాన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే.

ఆర్థిక కష్టాల్లో పశ్చిమాసియా దేశాలు
తమకు ఏమాత్రం సంబంధలేని యుద్ధం వల్ల పశ్చిమాసియాలోని పలు దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆయా దేశాలకు పర్యాటకం చాలా కీలకం. ఈ రంగం ద్వారానే ఆ దేశాల ఖజానా కాసులతో గలగలలాడేది. అయితే తాజా యుద్ధ ప్రభావంతో ఇక్కడి పర్యాటకం పూర్తిగా దెబ్బతిన్నది. దానికి తోడు ఇరాన్‌ చేస్తున్న దాడులతో తీవ్రమైన ఆస్తి, ప్రాణనష్టాలనూ భరించాల్సివస్తుంది. అత్యంత భద్రత కలిగిన దేశంగా భావించే దుబారుపైనా ఇరాన్‌ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ దేశంలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇదే పరిస్థితి సౌదీ అరేబియా, దుబారు, యూఏఈ, కువైట్‌ దేశాల్లోనూ ఉంది. అన్ని దేశాల్లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రపంచంతో ఆయా దేశాలకు ఉన్న కనెక్టివిటీ పోయింది. దానికి తోడు యుద్ధం కారణంగా ఆ దేశాల్లో ఆహారం మరింత ఖరీదైపోయింది. క్రమంగా ఆ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని ఆర్థికరంగ నిపుణలు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -