Tuesday, March 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతుని తలెత్తుకునేలా చేస్తాం

రైతుని తలెత్తుకునేలా చేస్తాం

- Advertisement -

– వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకు పెద్దపీట : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో మెగా మహిళా రైతు మేళా
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

ప్రపంచంలోనే తెలంగాణ రైతుని తలెత్తుకుని నిలబడేలా చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, రైతాంగం సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఆదివారం మెగా మహిళా రైతు మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్కతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వ్యవసాయం, రైతాంగ సంక్షేమమే ఊపిరిగా పని చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన రాయితీ విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల్ని పునరుద్ధరించినట్టు చెప్పారు. రూ.500 కోట్లతో పునరుద్దరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకే పెద్దపీట వేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో మహిళలకే డ్రోన్‌లు అందిస్తామని తెలిపారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. పంటమార్పిడి, సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అధునాతన నైపుణ్యాలు, టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజల అవసరాలకు సరిపడా ఆహారధాన్యాలను రైతులు పండించాలని సూచించారు. భూసార పరిరక్షణ, పంటల వైవిధ్యంపై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మనపై ప్రభావం పడుతున్న విషయాన్ని గమనించి, ఆహారధాన్యాల విషయంలో స్వావలంబన సాధించాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కొత్త వంగడాలు, టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు అందిస్తోందని తెలిపారు.పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మెగా రైతుమేళా నిర్వహిస్తున్నందుకు జయశంకర్‌ యూనివర్సిటీని అభినందించారు. రైతులకు ఉపయోగపడే స్టాళ్లను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరాన్ని మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిందన్నారు. అందరికీ అత్యంత అవసరమైనది ఆహారమని, అది అందరికీ అందుబాటులో ఉండాలంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలన్నారు. ఈ కార్య క్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్‌ గోపి, ఉద్యాన శాఖ సంచాలకులు యాస్మీన్‌ బాషా, శాసనమండలి విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌, కోరమాండల్‌ ఎండీ శంకర సుబ్రహ్మణ్యం, ఐకార్‌ సంస్థల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -