– ‘ఉపాధి’ నిర్వీర్యానికి బీజేపీ కుట్ర
– కుంటిసాకులు చెప్తూ నిధుల్లో కోతలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-చౌటకూర్
ఉపాధి కూలీల పొట్టగొట్టే ‘వీబీజీఆర్‌ఏఎం జీ’ని రద్దు చేయాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చౌటకూర్ మండలం లింగంపల్లి గ్రామంలో పర్యటించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దాన్ని రక్షించుకునేందుకు ఊరూరా ఉద్యమం చేపడతామని అన్నారు. ఇప్పటికే కుంటిసాకులు చెప్తూ ఉపాధి హామీ నిధుల్లో కోతలు విధిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేయడంలో భాగంగానే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి రాముని పేరుతో మరో చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ కాలంలో అనేక మంది జాబ్‌కార్డులను తొలగిస్తున్నారన్నారు. ఉపాధి పనులకు కూలీలకు చెల్లించే నిధులను ఎవరు చెల్లించాలనే దానిపై స్పష్టత లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం ద్వారా గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని, అలాంటి చట్టానికి తూట్లు పొడిచి, కోట్లాదిమంది పేద ప్రజల ఉపాధిని దెబ్బ తీయడమే బీజేపీ చెబుతున్న దేశభక్తా అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఇస్తామనడం చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో భాగమేనని విమర్శించారు. కొత్త చట్టంలో పనికి హామీ లేకపోవడంతోపాటు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా ఉందని అన్నారు. బ్యాంకులను లూటీ చేస్తున్న దొంగలకు లక్షల కోట్ల రూపాయలు తాయిలాల రూపంలో చెల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం కూలీలు చేసిన పనికి వెంట వెంటనే ఎందుకు చెల్లింపులు చేయడం లేదని ప్రశ్నించారు.
ఫొటో క్యాప్చర్ చేయాలనే ఆదేశాలతో కూలీలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. హాజరు, చెల్లింపుల పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్న సాంకేతిక ఆంక్షలను తక్షణమే తొలగించాలన్నారు. ‘వీబీ జీఆర్‌ఏఎం జీ’ని రద్దు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్, జిల్లా కమిటీ సభ్యులు విద్య సాగర్, కృష్ణ, గ్రామ సర్పంచ్ బేగరి రాజు, నాయకులు కృష్ణ, శ్రీశైలం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
‘వీబీజీఆర్‌ఏఎం జీ’ ని రద్దు చేయాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



