– పాలకుల నిర్లక్ష్యంపై కలెక్టరేట్లను ముట్టడించిన మత్స్యకారులు
– ప్రాణాలకు గ్యారంటీ లేదు.. పరిహారానికి దిక్కులేదు
– ఇద్దరు కేంద్ర మంత్రులున్నా పరిష్కారం సున్నా..
– 986 కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఇన్సూరెన్స్ బకాయిల కోసం
– 17న టీఎమ్‌కేఎమ్‌కేఎస్ ‘చలో హైదరాబాద్’
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
బతుకుదెరువు కోసం ‘నీలాల’ వేటపై ఆశలు పెట్టుకుని, అలల మీద బతుకు బండిని ఈడుస్తున్న మత్స్యకారుల జీవితాలు నేడు అగమ్యగోచరంగా మారాయి. దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని, ప్రజలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న చేతులు నేడు ఆకలితో అలమటి స్తున్నాయి. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం, బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు.. వెరసి మత్స్యకార కుటుంబాలను వీధులపాలు చేస్తున్నాయి. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా మత్స్యకారుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. వారి డిమాండ్లు ఢిల్లీలో చర్చకు రావడం లేదు. ఈ నేపథ్యంలో తమ హక్కుల సాధన కోసం తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం (టీఎమ్‌కేఎమ్‌కేఎస్) దశలవారీ పోరాటానికి పిలుపునిచ్చింది. సోమవారం రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. ఈ నెల 17న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ సాక్షిగా తమ గోడును వినిపించేందుకు ‘చలో హైదరాబాద్’కు సిద్ధమైంది.
మత్స్యకారుల బతుకులు నేడు ‘దిన దిన గండం.. నూరేండ్ల ఆయుష్షు’లా మారాయి. నీటిపై వేటాడుతూ ప్రాణాలకు తెగిస్తున్నా, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునే నాథుడే కరువయ్యారు. ప్రభుత్వాలు మారినా, జీవోలు విడుదల చేసినా.. మత్స్యకారులకు అందాల్సిన ఎక్స్‌గ్రేషియా, ఇన్సూరెన్స్ ఫలాలు కాగితాలకే పరిమితమ య్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మత్స్యకార కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా 6119 సొసైటీల్లో 4,27,121 మంది సభ్యులుగా ఉండగా, మరో 5 లక్షల మంది సభ్యత్వం లేకుండానే వేట సాగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 850 సొసైటీల్లో 60వేలా 45 మంది సభ్యులుగా ఉన్నారు. మరో 5వేల మంది వరకు అనధికారికంగా పని చేస్తున్నారు.
కరోనా కాలపు పాపం.. అధికారుల నిర్లక్ష్యం
మత్స్యకారుల పట్ల అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఉన్న చిన్నచూపునకు కరోనా కాలంలో జరిగిన ఘటనే నిదర్శనం. 2020లో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాల్సిన ప్రీమియం సకాలంలో చెల్లించలేదు. దాంతో ఆ కాలంలో ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ‘గ్రూప్ యాక్సిడెంట్ స్కీమ్’ కింద రావాల్సిన నష్టపరిహారం దక్కలేదు. ఇలా సుమారు 210 మంది వరకు ఉన్నట్టు టీఎమ్‌కేఎమ్‌కేఎస్ చెబుతోంది. దీనికితోడు 2017 ఏప్రిల్ 21న నాటి ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా మరో రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జీవో 6 ద్వారా చట్టం సైతం చేసింది. ఈ జీవో వచ్చిన తొమ్మిదేండ్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 986 మంది కుటుంబాలకు నేటికీ పైసా ఎక్స్‌గ్రేషియా అందలేదు. సుమారు రూ.50కోట్ల ఎక్స్‌గ్రేషియా నిధులు ఫైళ్లకే పరిమితం అయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరకు పరిశీలిస్తే జీవో వచ్చిన కాలం నాటి నుంచి 210 మంది మత్స్యకారులు మృతిచెందగా, వీరిలో కరోనా సమయంలో ఇన్సూరెన్స్ కూడా దక్కని 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ప్రభుత్వాలకు అంత లోకువ ఎందుకు?
మత్స్యకారులంటే ప్రభుత్వాలకు అంత లోకువ ఎందుకు? జీవోలు ఉన్నా అమలు చేయకపోవడం దుర్మార్గం. తెలంగాణలో మత్స్య సంపద పెరగడానికి పుష్కలమైన జలవనరులు ఉన్నప్పటికీ, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో మత్స్యశాఖకు నామమాత్రపు నిధులే దక్కుతున్నాయి. హక్కుల సాధన కోసం మత్స్యకారులంతా ఏకమై మార్చి 17న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలి.
– లెల్లెల బాలకృష్ణ, టీఎంకేఎమ్‌కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కన్నీరు పెట్టిస్తున్న లోయర్ మానేరు విషాదాలు
కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎమ్‌డీ) వద్ద ఈ నెలలోనే జరిగిన రెండు ప్రమాదాలు మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. మార్చి 2న చేపల వేటకు వెళ్లిన కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన మేకల అజరు(33) కాళ్లకు వల చుట్టుకుని నీట మునిగి మరణించాడు. వివాహమైన నాలుగు నెలలకే అతను మృతిచెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇదే నెల 5న ఎల్‌ఎమ్‌డీలో చేపల వేటకు వెళ్లిన పెసరు జంపయ్య(35) తెప్ప ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చే క్రమంలో ఆయన సత్తువ చాలక నీట మునిగి ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటనలు జరిగినప్పుడు కనీసం పరామర్శించేందుకు మత్స్యశాఖ అధికారులు రాకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.


