బరిలో ఐదుగురు ఆశావహులు
నవతెలంగాణ – తుంగతుర్తి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. రేసులో ఐదుగురు ముఖ్య నాయకులు పోటీ పడుతున్నారు. ఆశావాహులు ఎవరికి వారే అధిష్టానం తనకు అనుకూలంగా ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన ప్రస్తుత మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, బండరామారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రేగటి రవి, గొట్టిపర్తి గ్రామానికి చెందిన తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సంగెం గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్, తూర్పుగూడెం గ్రామానికి చెందిన దాసరి శ్రీను బరిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
చాలాకాలం తర్వాత కాంగ్రెస్ లో పార్టీ పదవుల నియామకం జరగబోతుంది. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో నేతల మధ్య రేస్ కూడా మొదలైంది. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేస్తున్నారు. వీరిలో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందో అని ఉత్కంఠ నెలకొంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మళ్ళీ తనకే వస్తుందని దొంగరి గోవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలను యువతను ఏకతాటిన నడిపి ఎన్నికల్లో పార్టీ విజయానికి నిర్విరామంగా కృషి చేయడం జరిగిందన్నారు. పార్టీ ద్వారా అనేక పనులను నాణ్యతతో చేయడంతో పాటు పార్టీకి విశేషమైన గుర్తింపు తేవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, రైతు సమన్వయ కమిటీ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ల సహకారాలతో పార్టీ ఆదేశించిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేశానని అన్నారు.
2001 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నానని, వివాద రహితుడిగా, పార్టీకి విధేయుడిగా ఉన్న తనకు మరొకసారి మండల అధ్యక్ష పదవికి అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పీఠం కోసం బండరామారం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ రేగటి రవి పోటీపడుతున్నారు. గతంలో ఎంపీటీసీగా చేసిన అనుభవంతో పాటు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ తో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు కలిసి వచ్చేలా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. జన్మతః కాంగ్రెస్ పార్టీ కుటుంబమని, గతంలో తన తల్లి రేగటి పూలమ్మ సింగిల్ విండో డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. యువతలో ఉన్న ఫాలోయింగ్, మండలంలో అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తుండడం, మండలంలో తనకు ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల అధ్యక్ష పదవి తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎస్సీ వర్గానికి చెందిన తనకే వస్తుందని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, కష్టకాలాల్లో కూడా పార్టీని నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేశానని అన్నారు. గత 28 సంవత్సరాల నుండి పార్టీలో కొనసాగుతున్నానని, 1999 లో గ్రామ శాఖ ఉపాధ్యక్షుడిగా.. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మండల ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాలలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని అన్నారు. పార్టీ అభివృద్ధి,కార్యకర్తల ఐక్యత, ప్రజల నమ్మకం కాపాడాలంటే నిజంగా పార్టీ కోసం పని చేసిన తనలాంటి వారికే పదవి ఇవ్వాలని అన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి నేటి వరకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి ఇవ్వలేదని అన్నారు. ఎస్సీల అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండే కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని వెంకన్న కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు కేటాయించాలని మండల పరిధిలోని సంగెం గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. తనకు ఓటు వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని 2006లో వార్డు మెంబర్గా ,2013 లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా సేవలందించానని అన్నారు. తనకు అవకాశం కల్పిస్తే అందరి సహకారంతో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని మండల పరిధిలోని తూర్పుగూడెం గ్రామానికి చెందిన దాసరి శ్రీను అన్నారు. మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీలలో తన భార్య రేణుకను గ్రామ ప్రజల సహకారంతో సర్పంచ్ గా ఏకగ్రీవం చేయడం జరిగిందని గుర్తు చేశారు. తనకు అవకాశం కల్పిస్తే మండలంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఏది ఏమైనప్పటికీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి పదవి ఇవ్వాలని పలువురి అభిప్రాయం. పైరవీల జోరు కొనసాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఉత్కంఠకు ముగింపు ఎన్నడో.? వేచి చూద్దాం.!



