Tuesday, March 10, 2026
E-PAPER
Homeఖమ్మంనాడు వార్డు మెంబర్.. నేడు మున్సిపల్ కౌన్సిలర్

నాడు వార్డు మెంబర్.. నేడు మున్సిపల్ కౌన్సిలర్

- Advertisement -

– స్వతంత్రంగా ఘన విజయం సాధించిన రాడ్ బెండింగ్ రవి
నవతెలంగాణ – అశ్వారావుపేట

రాజకీయ వారసత్వం, ఆర్థిక బలం లేకుండా నేటి సామాజిక – ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి గెలవడం కత్తిమీద సామే. అయితే ప్రజాసేవ పై ఉన్న నిబద్ధత, ప్రజల విశ్వాసం ఉంటే విజయాన్ని సాధించవచ్చని అశ్వారావుపేట కు చెందిన రాడ్ బెండింగ్ రవి అలియాస్ జినుగు రవీంద్ర కుమార్ నిరూపించారు.

గ్రామస్థాయి నుంచి మున్సిపల్ స్థాయికి ఎదుగుదల:

గతంలో 2019 నుండి 2024 వరకు కాంగ్రెస్ మద్దతుతో మేజర్ పంచాయతీ 12 వ వార్డు మెంబర్ గా పనిచేసిన రవి, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించి మంచి పేరు సంపాదించుకున్నారు. తాగునీటి సరఫరా, గ్రామ రహదారుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల విశ్వాసాన్ని పొందారు.అదే విశ్వాసంతో ఇటీవల జరిగిన అశ్వారావుపేట మున్సిపాలిటీ తొలి పాలకవర్గ ఎన్నికల్లో 19 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులతో పాటు మరో అభ్యర్థిని కూడా ఓడించి విజయం సాధించడం ఆయన ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది.

ప్రజలతో ఆనందోత్సాహాలు:

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన అనుచరులు, స్థానిక ప్రజలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు రవిని అభినందించారు.

“ఈ విజయం ప్రజలదే”:

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ జినుగు రవి మాట్లాడుతూ ఈ విజయం తనది కాదని, ప్రజలదేనని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, కాలువలు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు.

అభివృద్ధే లక్ష్యం:

మున్సిపాలిటీ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ ఛైర్పర్సన్ రమేష్ బాబు ల సహకారంతో తన వార్డును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.

గ్రామస్థాయి నుంచి మున్సిపల్ స్థాయికి ఎదిగి స్వతంత్రంగా విజయం సాధించడం రాడ్ బెండింగ్ రవి ప్రజాదరణకు నిదర్శనమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -