పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసం మలివిడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరుగుతోంది. సంఖ్యా బలంగా తీర్మానం నెగ్గే అవకాశం లేకున్నా విపక్షాలు మాత్రం చర్చలో నైతిక విజయం సాధించాయి. స్పీకర్ ఏకపక్ష వైఖరిపై సంధించిన ప్రశ్నలు ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టాయి. అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. అంతేకాదు, సభాపతి వ్యవస్థలో ఉండాల్సిన పారదర్శకతను సైతం గుర్తుచేశాయి. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పదవి ‘నిష్పక్షపాత న్యాయమూర్తి’ వంటిది. ఒకసారి ఆ పీఠం అధిష్టించాక సభాపతికి పార్టీ రంగు ఉండకూడదు. సభ్యులందరినీ సమానంగా చూడాలి, గౌరవించాలి. అధికారపక్షమే కాదు, మైనార్టీలో ఉన్నవారి హక్కులకూ రక్షణగా నిలబడాలి. కానీ, ఆ పదవి ఒక వ్యక్తికో లేదంటే పార్టీకో కొమ్ముకాసే వేదికగా మారితే అది రాజ్యాంగస్ఫూర్తికి తీవ్ర విఘాతం. స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు అచ్చం బీజేపీకి ఏజెంట్‌లాగే ఉందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. భిన్నాభిప్రాయాలకు అవకాశ మివ్వక పోవడం, ప్రశ్నలను అణగదొక్క డటం, మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం, సభనుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే చర్యలే తప్ప వేరేకాదు.
స్పీకర్ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ నూట పద్దెనిమిది మంది విపక్షాల ఎంపీలు తొలివిడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయనపై అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేశారు. మంగళవారం జరిగిన చర్చలో ఓం బిర్లా తీరుపై ప్రతిపక్షాలు చర్చను తీవ్రతరం చేయగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌రిజిజు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇది అసహేతుకం. బాధ్యతల్లో ఉన్నవారు సభ్యులు వేసే ప్రశ్నలను ఓపిగ్గా వినాలి. వాటికి జవాబు చెప్పాలి. అది ప్రజాస్వామ్యం. కానీ, ఇక్కడ మాత్రం స్పీకర్ నిష్పక్షపాతంగానే ఉన్నారని, ప్రతిపక్షాలే సభను అడ్డుకుంటున్నాయని ఆయన వాదించారు. స్పీకర్ నిజంగా చర్చ సవ్యంగా జరిగేలా చూస్తే సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి.కానీ, ఎన్డీయే సభ్యులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నా వారించలేదు. పైగా ప్రశ్నించేవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. గత సమావేశాల్లో రికార్డు స్థాయిలో నూట నలభై ఆరు మంది ఎంపీలను ఒకేసారి సస్పెండ్ చేశారు. భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇదొక మాయని మచ్చ. ఇదంతా సభలో విపక్షం లేని ఏకపక్షపాలనకు దారితీ యడమే.
చర్చ సందర్భంగా విపక్షాలు లేవనెత్తిన మూడు అంశాలు అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రజా సమస్యలు, అధికార పార్టీ వ్యహరిస్తున్న తీరుపై లీడర్ ఆఫ్ అపోజిషన్ (రాహుల్‌గాంధీ)కి మాట్లాడే అవకాశం ఎందుకివ్వలేదని విపక్షాలు నిలదీశాయి. మైక్ కట్‌చేయడం పట్ల అభ్యంతరం చెప్పాయి. అయితే దీనిపై ప్రభుత్వం చెప్పిన సమాధానం వింటే ఎవరికైనా నవ్వురాక మానదు.’సాంకేతిక’ కారణాల వల్ల మైక్ ఆగిపోయిందట! తప్ప స్పీకర్ కట్ చేయలేదట. ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదేమో! మరి గత ఐదేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవిని ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించగా ట్రెజరీ బెంచీలు జవాబు చెప్పలేక నీళ్లు నమిలాయి. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్ ఎంపిక జరుగుతుంది. సంప్రదాయంగా డిప్యూటీ స్పీకర్ కూడా ఎంపికవ్వాలి. కానీ, ఇక్కడ ఓం బిర్లా ఏకఛత్రాధిపత్యానికి ఇది అవకాశంగా మారింది. ఇది రాజ్యాంగ వ్యవస్థను అసంపూర్ణంగా ఉంచడమే కాదు, ఉల్లంఘించడం కూడా! మరో అంశం. ప్రశ్నించే గొంతులను సభ బయటకు పంపడం క్రమశిక్షణగా అనుకుంటే, అది పార్లమెంటా లేదంటే బీజేపీ కార్యాలయం అనుకోవాలా? దీనికి కూడా సమాధానం కరువైంది.
ఏ చట్టమైనా చేసేటప్పుడు చర్చ జరిగేలా చూడటం, సభ్యులకు ఉన్న అనుమానాలు తొలగించడం సభాపతి బాధ్యత. ఈ ఐదేళ్లుగా చూస్తే ఎక్కువ బిల్లులు ఎటువంటి ముందస్తు చర్చలు లేకుండా నిమిషాల్లోనే ఆమోదం పొందాయి. ఇది పార్లమెంటరీ కమిటీల వ్యవస్థను నిర్వీర్యం చేయడమే. మాట మాట్లాడితే సభను సజావుగా జరగనివ్వాలనే అంశమే ఎక్కువగా అధికారపక్షం నుంచి వినిపించింది. స్పీకర్ స్థానంలో ఉన్నవారు అందరి స్వరాలను వినిపించేలా చూడాలి. ఎప్పుడైతే సభలో ఒకే రకమైన మాట వినపడాలని కోరుకుంటారో అక్కడ చర్చకు తావుండదు, నియంతృత్వమే రాజ్యమేలుతుంది. పార్లమెంట్ అనేది కేవలం బిల్లులు పాస్ చేసే యంత్రం కాదు, ప్రజా ఆకాంక్షల ప్రతిబింబం. ఓటింగ్ ఫలితం ఓం బిర్లాకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ సభలో విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నల ముందు సర్కార్ తలవంచక తప్పలేదు. మెజార్టీ ఉందన్న అహంకారం రాజ్యాంగం ముందు చెల్లదని అవిశ్వాసం స్పష్టం చేసింది. సంఖ్యాబలం గెలిచినా, రాజ్యాంగ స్ఫూర్తిని గెలిపించడమే నిజమైన ప్రజాస్వామ్యం. ఇప్పటికైనా స్పీకర్ వ్యవస్థ కోల్పోయిన తన వైభవాన్ని, నిష్పక్షపాతాన్ని తిరిగిపొందాలి. అదే భారత పార్లమెంటుకు గౌరవం.
నీళ్లు నమిలారు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



