Wednesday, March 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు

గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు

- Advertisement -

తెలంగాణ టూరిజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి
అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కోర్సులు : ప్రీ బడ్జెట్‌ సమావేశాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో గ్రామపంచాయతీలన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలనీ, ఆ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం వివేక్‌లతో కలిసి శాఖల వారీగా ప్రీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ స్థలాలు అందుబాటులో ఉన్నచోట తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు.

పట్టణాల్లో రహదారులపై చంటి బిడ్డలను ఎత్తుకుని యాచక వృత్తి కొనసాగిస్తున్న వారిని గుర్తించి శిశువిహార్‌లో ఆశ్రయం కల్పించాలని ఆదేశించారు. అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లల్లో ఉపాధి కల్పించే కోర్సులు ప్రారంభించాలని సూచించారు. క్యూర్‌, ప్యూర్‌ రేర్‌ పాలసీకనుగుణంగా వచ్చే పరిశ్రమలకు అవసరమయ్యే నిపుణులను తయారు చేయాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు స్కిల్‌ యూనివర్సిటీతో అనుసంధానం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్‌ ట్రైబల్‌ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలన్నారు. ఐటీడీఏలు పూర్తిస్థాయిలో సహకారం అందించడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆ శాఖ అధికారులను భట్టి ఆదేశించారు.

కవ్వాల్‌, శ్రీశైలం వంటి టైగర్‌ జోన్లను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎకో, టెంపుల్‌ టూరిజం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌ మహమ్మారిని నిర్మూలించేందుకు యువతను చైతన్యం చేయాలన్నారు. డ్రగ్స్‌ వినియోగం ద్వారా జరిగే నష్టాన్ని గ్రామస్థాయిలో కళారూపాల ద్వారా ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా కళాకారులకు జీవనోపాధి కలగడంతో పాటు సమాజంలో మంచి మార్పు కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌. శ్రీధర్‌, సీసీఎల్‌ఏ సెక్రెటరీ లోకేష్‌ కుమార్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిత రామచంద్రన్‌, కమిషనర్‌ దివ్య దేవరాజ్‌, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక, గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ గౌతం, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రెటరీ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -