పశ్చిమాసియా యుద్ధంతో ధరలకు ఆజ్యం
మూడీస్ హెచ్చరిక
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగే యుద్ధం వల్ల భారత్కు విస్తృత నష్టం జరగనుందని అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ తెలిపింది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఒక్క శాతం మేర తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం 1.5 నుంచి 2 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది. డిమాండ్ దెబ్బతీయడంతో.. ఆర్థిక వ్యవస్థ మందగించొచ్చని తెలిపింది. దేశంలో రుణాల వృద్ధి రేటు మాత్రం 13.5 శాతం నుండి 14 శాతం వరకు ఉంటుందనే తమ ప్రాథమిక అంచనాను మూడీస్ ప్రస్తుతానికి మార్చలేదు. అయితే.. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే బ్యాంకింగ్ రంగంతో సహా స్థూల ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం ఉంటుందని తెలిపింది. పన్ను సంస్కరణలు, స్థిరమైన ద్రవ్య విధానం, అనుకూలమైన ఆర్థిక పరిస్థితుల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.4 శాతంగా నమోదు కావచ్చని మూడీస్ అంచనా వేస్తోంది.
”యుద్ధం సుదీర్ఘంగా సాగితేనే భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఇది కొన్ని వారాల పాటు జరిగితే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 89 డాలర్ల వద్ద స్థిరపడితే ప్రభావం ఎక్కువగా ఉండదు. కానీ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల పైన ఉంటే అది కేవలం ఇంధన ధరలపైనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై భారీ స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఇది బ్యాంకులపై కూడా ప్రభావం చూపుతుంది” అని మూడీస్లోని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్ సీనియర్ అనలిస్ట్ అమిత్ పాండే పేర్కొన్నారు.ఖరీదైన ఇంధన దిగుమతుల వల్ల రూపాయి విలువ బలహీనపడటం, ద్రవ్యోల్బణం పెరగడం, కరెంట్ ఖాతా బ్యాలెన్స్ క్షీణించడం వంటి సమస్యలు ఎదురవుతాయని మూడీస్ నివేదిక తెలిపింది. చమురు ధరల పెరుగుదల వల్ల తీవ్రమైన ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న జపాన్, కొరియాతో పాటు భారత్ కూడా అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని విశ్లేషించింది. ఎందుకంటే భారతదేశ ముడి చమురు దిగుమతులు జీడీపీలో 3.6 శాతంగా ఉన్నాయని మూడీస్ పేర్కొంది.



