– మున్సి’పోల్’ వ్యయాల్లో మాయ!
– లోపాల సరి పేరుతో సిబ్బంది చేతివాటం
– ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10వేల వరకూ వసూళ్లు!
– కొనసాగుతున్న ఆడిటింగ్ ప్రక్రియ
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపల్ ఎన్నికల వ్యయాల్లో అభ్యర్థులు చూపించే లెక్కలు, క్షేత్రస్థాయిలో వెచ్చించే వాస్తవిక ఖర్చులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితి కంటే అభ్యర్థులు చాలా ఎక్కువగా ఖర్చు చేస్తు న్నట్టు అనేక నివేదికలు చెబుతున్నాయి. అభ్యర్థులు తమ ప్రచార రథాలు, సభలు, ప్రచార సామగ్రి, ప్రకటనల కోసం చేసే ఖర్చులను ఎన్నికల పరిశీలకులు నిశితంగా గమని స్తారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించేలా చూడటంతో పాటు వారి వ్యయ నియంత్రణపై నిఘా ఉం టుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 30 రోజుల్లోపు అభ్యర్థు లు తమ ఖర్చు వివరాలను సమర్పించాలి.
ఒకవేళ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేసినా లేదా తప్పుడు సమా చారం ఇచ్చినా, అభ్యర్థిని 5 ఏండ్ల వరకు అనర్హులుగా ప్రక టించే అవకాశం ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకొని అనేక చోట్ల మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు, సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. లోపాలు లేకుండా ఎన్నికల ఖర్చులు సరి చేసి, ఎన్నికల సంఘానికి సమర్పిస్తాం అనే పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.3వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
నియమావళిని అడ్డుపెట్టుకొని దోపిడీ
2026 తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న నిర్వహించారు. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 12,944 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్లలో 414 వార్డుల కోసం 2,225 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మున్సిపాలిటీల్లో 2,582 వార్డుల కోసం 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇవి మినహా మిగిలిన అన్ని స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. మున్సిపాలిటీల్లో వ్యయ పరిమితి రూ.5 లక్షలుగా నిర్ణయించబడింది. ఖర్చుల నిర్వహణలో ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది. ఎన్నికల ఖర్చుల కోసం ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఒక ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలి. ఎన్నికల ఖర్చులన్నీ ఈ ఖాతా ద్వారానే జరగాలి. ప్రచారం కోసం ఉపయోగించే వాహనాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కార్యాలయ నిర్వహణ, ఇతర ప్రచార ఖర్చులను అభ్యర్థులు ప్రతిరోజూ ఒక రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన 30 రోజుల్లోపు అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలి. నిర్ణీత గడువులోగా వ్యయ వివరాలను సమర్పించని అభ్యర్థులను భవిష్యత్తులో మూడేండ్ల్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. కఠినమైన ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చులు చేయటం దాదాపు ఏ ఒక్క అభ్యర్థికి సాధ్యం కాదు.. అధికారులు కచ్చితమైన దృష్టి సారిస్తే చాలామంది అభ్యర్థులపై అనర్హత వేటుపడే అవ కాశం ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకున్న మున్సిపల్ అధికా రులు నిబంధనలకు అనుగుణంగా లెక్కలను తయారు చేస్తామనే పేరుతో దోపిడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రతి మున్సిపాలిటీలోనూ ఇదే తంతు
రాష్ట్రంలో దాదాపు ప్రతి మున్సిపాలిటీలోనూ ఇదే తంతు కొనసాగుతున్నట్టుగా సమాచారం. వాస్తవానికి లక్షల్లో ఖర్చు చేసినప్పటికీ, ఖర్చుల రిజిస్టర్‌లో మాత్రం తక్కువ మొత్తాలు నమోదు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. కొందరు అభ్యర్థులు ఖర్చుల వివరాలు సమర్పించే సమ యంలో రశీదులు సేకరించక పోవడంతో పాటు తక్కువ మొత్తాలకు బిల్లులు చూపిస్తు న్నారని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అభ్యర్థుల నుంచి ఖర్చు లెక్కలు సరిచేసే పేరుతో అక్రమ వసూళ్లు జరుగతున్నాయి.
చిన్న వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ఖర్చులతో ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు ఖర్చుల సమర్పణ పేరుతో మరోసారి వసూళ్లు చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదులాపురం మున్సి పాలిటీలో లెక్కలు సరి చేసేందుకు ఓ అధికారి రూ.10 వేల వరకు డిమాండ్ చేయడంతో గత్యంతరం లేక కొందరు అభ్యర్థులు చివరికి రూ.3 వేలు ఇచ్చిన తర్వాత లెక్కలు సరి చేసినట్టు తెలుస్తున్నది. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఇదే తంతు కొనసాగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
అధికారులు దీనిపై సమగ్ర విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఆడిటింగ్ విష యంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని మున్సి పల్ ఎన్నికల అధికారులు సూచిస్తున్నా.. సిబ్బంది చేతి వాటంతో గణాంకాలను తారుమారు చేస్తున్న తీరు ఉంది.



