సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ లిస్టు విడుదల చేసిన ఎమ్‌హెచ్‌ఎస్‌ఆర్‌బీ
రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ నెలాఖరు కల్లా 692 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్లు విధుల్లో చేరనున్నారు. అనస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది. 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. వెబ్‌సైట్‌లో షార్ట్ లిస్టులను పొందుపర్చింది. ఈ నెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లోని వెంగళ్‌రావు నగర్‌లో గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ కార్యాలయంలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగనున్నది. అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు.
ఆ రెండు రోజుల్లో హాజరుకాలేకపోయినా, డాక్యుమెంట్లు పెండింగ్‌లో ఉన్నా మార్చి 16న (రిజర్వ్ డే) అందజేసేందుకు అవకాశం ఇచ్చింది. అప్పటికీ డాక్యుమెంట్లు చూపెట్టకపోతే వేరేవారికి అవకాశం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 19న నియామాలకు సంబంధించి అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలని ఎమ్‌హెచ్‌ఎస్‌ఆర్‌బీ సూచించిన విషయం విదితమే. అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత అనస్తీషియా, గైనకాలజీ, పీడీయాట్రిక్స్ విభాగాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టుల పోస్టులకు సంబంధించి మెరిట్ జాబితాను బోర్డు విడుదల చేసింది. ఈ జాబితాల ఆధారంగా నోటిఫైడ్ ఖాళీలలో 1: 1.5 నిష్పత్తిలో దరఖాస్తుదారుల సర్టిఫికెట్లను బోర్డు పరిశీలించనున్నది. షార్ట్-లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారుల జాబితా బోర్డు సైట్‌లో పొందుపర్చింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత తుది మెరిట్ జాబితాను బోర్డు విడుదల చేయనున్నది.



