ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడి విషయంలో అరుంధతి రాయ్
న్యూఢిల్లీ : అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్‌పై జరిపిన దాడులను కేంద్రం ఖండించకపోవడంపై ప్రముఖ రచయిత అరుంధతి రాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ‘ధైర్యం లేకుండా, వెన్నెముక లేకుండా ప్రవర్తిస్తోంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఒక పుస్తక కార్యక్రమంలో మాట్లాడిన అరుంధతి రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పేద దేశమైనప్పటికీ.. భారత్‌కు గౌరవం, ఆత్మగౌరవం ఉండేదని అన్నారు. అయితే ఇప్పుడు ఆ గౌరవం, ధైర్యం తగ్గిపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికా ఇతర దేశాల నాయకులను హత్య చేయడం, అపహరించడం వంటి చర్యలను భారత ప్రభుత్వం ఎందుకు ఖండించలేదని ఆమె ప్రశ్నించారు. అలాగే ప్రధాని ఇజ్రాయిల్ వెళ్లి ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఆలింగనం చేసుకోవడం గురించి కూడా ఆమె విమర్శలు గుప్పించారు.
అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంతో భారత రైతులు, టెక్స్‌టైల్ రంగానికి నష్టం జరుగుతుందని అన్నారు. గాజాలో జరిగిన సంఘర్షణ సమయంలో భారత ప్రభుత్వం వేలాది మంది భారతీయ కార్మికులను ఇజ్రాయిల్‌కు పంపిందనీ, అయితే ఇప్పుడు ఇజ్రాయిల్‌లో బంకర్లలో ఆశ్రయం పొందే సమయంలో ఆ కార్మికులకు ఆ సదుపాయం ఇవ్వడం లేదని వార్తలు వస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా-ఇజ్రాయిల్ ఇరాన్‌పై జరిపిన దాడి అకారణమనీ, అది గాజాలో జరుగుతున్న ఘర్షణల కొనసాగింపే అని ఆమె అన్నారు. ఈ యుద్ధం మరింత విస్తరించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంక్షోభానికి దారి తీయొచ్చని కూడా హెచ్చరించారు. ఇరాన్‌పై దాడులు ప్రపంచాన్ని అణు యుద్ధం అంచుకు తీసుకెళ్లే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశాల్లో మార్పులు అవసరమైతే అవి ప్రజల ద్వారానే రావాలని, బలవంతపు దాడుల ద్వారా కాకూడదని ఆమె తెలిపారు.
భారత్ గౌరవం, ధైర్యం కోల్పోయింది
- Advertisement -
- Advertisement -



