Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅవయవ దానంపై అవగాహన పెంచండి

అవయవ దానంపై అవగాహన పెంచండి

- Advertisement -

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణ రూపొందించండి : వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజలకు అవయవ దానంపై విస్తృతంగా అవగాహన కల్పించాలనీ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో గల తన కార్యాలయంలో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్స్‌, టిష్యూస్‌ యాక్టు(టీహెచ్‌ఓటీఏ) పాలసీ రూపకల్పనపైనా, క్లినికల్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ యాక్ట్‌ అమలుపైనా ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అవయవ దానాలను ప్రోత్సహించేందుకు విధివిధానాలను సరళీకృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణను రూపొందించాలని సూచించారు.

అవయవ మార్పిడి చికిత్సలకు ప్రయివేటు ఆస్పత్రుల్లో పెద్ద మొత్తంలో ధరలు నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు సైతం అవయవ మార్పిళ్లు చేసుకునేలా ధరల నియంత్రణ ఉండాలని ప్రయివేటు యాజమాన్యాలకు సూచించారు. అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని హామీనిచ్చారు. దాతలు ఇచ్చిన అవయవాలు వృథా కాకుండా ఆస్పత్రులు ప్రత్యేక చర్యలను చేపట్టాలన్నారు. ఇతర దేశాల నుండి ఆర్గాన్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ కోసం వచ్చే రోగుల కోసం నూతన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌, జీవన్‌ దాన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజ్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్ కుమార్‌, ప్రయివేటు ఆస్పత్రుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -