– కేవీపీఎస్ ఆధ్వర్యంలో సావిత్రి భాయి ఫూలే వర్ధంతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అనేవి సావిత్రిభాయి ఫూలే ఆశయాలకు విరోధులని పలువురు వక్తలు విమర్శించారు. అవి ఉన్నత విద్యను పేద ప్రజలకు దూరం చేస్తున్నాయని తెలిపారు. కాసులు లేని కామన్ విద్యను అందరికీ అందించాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయంలో సావిత్రి భాయి ఫూలే వర్థంతిని ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కెేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్ ఆనగంటి వెంకటేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ మాట్లాడుతూ భారత సమాజంలో వేల సంవత్సరాల నుంచి మనువాద భావాలు ప్రజల మెదళ్లను కలుషితం చేశాయని చెప్పారు. అసమానతలు సృష్టించాయని ఆందోళన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలకు అక్షరాన్ని నిషేధించాయని విమర్శించారు. ఆ కాలంలో అట్టడుగు వర్గాల మొట్టమొదటి అక్షరం సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. సత్యశోధక్ సమాజ్ నిర్మించిన జ్యోతిబాఫూలే అడుగుజాడల్లో సావిత్రిభాయి పూలే ఫాతిమా షేక్‌తో కలిసి అనేక పాఠశాలలు నడిపించిందని గుర్తు చేశారు. శూద్రులు, అస్పశ్యులకు మొట్టమొదటి చదువుల తల్లిగా నిలిచిందని తెలిపారు. కుల వివక్షత లేని సమాజాన్ని నిర్మించేందుకు జీవితాంతం పరితపించిందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడు శోభన్, టీపీటీఎల్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజరు కుమార్, కేవిపిఎస్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు నాగేందర్, ప్రజా కళాకారుడు పాటల గోపి తదితరులు పాల్గొన్నారు.
కాసులు లేని కామన్ విద్యను అందరికీ అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



