– మొల్ల మాంబ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
– టీఆర్‌కేఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ – కామారెడ్డి
తెలుగు సాహిత్యంలో అపూర్వమైన స్థానం సంపాదించిన మహా తొలి తెలుగు కవయిత్రి ఆత్మకూరి కుమ్మర మొల్ల మాంబ 586 వ జయంతిని కామారెడ్డి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం (టీఆర్‌కేఎస్) కామారెడ్డి జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌కేఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుమార్ రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాకూరి మోహన్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సాధారణ కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్ల తన ప్రతిభతో తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సేవలందించారని తెలిపారు.
ఆమె రచించిన మొల్ల రామాయణం తెలుగు భాషకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహాకవయిత్రి మొల్ల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. మొల్ల జయంతి సందర్భంగా శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను స్మరించుకుంటూ కుమ్మరి సంఘం నాయకులు మొల్ల జీవితం, సాహిత్య సేవలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సత్తయ్య, సంతోష్ కుమార్, భూమయ్య, విట్టల్, సత్యనారాయణ, బిక్షపతి, రమేష్, సత్యం, అంజయ్య, కిషన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



