Saturday, March 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమల్టీప్లెక్సులకు మించి అనుభూతినిస్తుంది

మల్టీప్లెక్సులకు మించి అనుభూతినిస్తుంది

- Advertisement -

ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్‌ స్క్రీన్‌ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్‌’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌లోని కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్‌ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్‌ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌లలో ఒకటిగా ‘అల్లు సినిమాస్‌’ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ‘అల్లు సినిమాస్‌’ ఇచ్చే ఎక్స్‌పీరియెన్స్‌ గురించి అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘రెండేళ్లు కష్టపడి ‘అల్లు సినిమాస్‌’ను నిర్మించాం. దీన్ని నిర్మించడానికి మూడు కారణాలున్నాయి. యూవీ వంశీ సూళ్లూరుపేటలో లగ్జరీ థియేటర్‌ను కట్టారు. ఆ థియేటర్లో సినిమాని చూడటానికి పక్క ఊర్ల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అది చూసి నాకు కూడా ఓ లగ్జరీ థియేటర్‌ కట్టాలని అనిపించింది.

‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 6’ కోసం ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఐమ్యాక్స్‌ లార్జ్‌ స్క్రీన్‌లో టికెట్లు కావాలని, పిల్లలు గోల చేస్తున్నారని, కచ్చితంగా టికెట్లు కావాలని అడిగారు. ఆ టికెట్లు నేను ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషించారు. అంటే పిల్లలు కేవలం సినిమాని చూడకుండా, దాన్ని ఎక్స్‌పీరియెన్స్‌ చేయాలని అనుకుంటున్నారు. ఆ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. అప్పుడు నాకు కొన్ని ఐడియాలు వచ్చాయి. లార్జ్‌ ఫార్మాట్‌, కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ కోసం ఆడియెన్స్‌ ఎదురుచూస్తున్నారు. అలా మా ‘అల్లు సినిమాస్‌’ మొదలైంది. సింగిల్‌ స్క్రీన్లలో వస్తున్న ఎక్స్‌పీరియెన్స్‌ ఇప్పుడు జనాలకు సరిపోవడం లేదు. అందుకే ఎక్కువగా మల్టీప్లెక్స్‌లకు వస్తున్నారు. సినిమా కంటే.. సినిమాని ఎక్స్‌పీరియెన్స్‌ చేసేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్‌ ఇవ్వాలని దీన్ని నిర్మించాం. డాల్బీలో సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. డాల్బీలోకి మారిన సినిమా విజువల్‌ పరంగా, సౌండ్‌ పరంగా అద్భుతంగా ఉంటుంది.

2024లో మేం డాల్బీని సంప్రాదించాం. డాల్బీ సినిమాస్‌ ఇండియా ప్రతినిథి రాజ్‌ మాకు ఎంతో సహకరించారు. అమెరికా, జర్మనీ, ఇండియన్‌ టీం ఇలా అందరం కలిసి ఓ డెబ్బై సార్లు జూమ్‌ కాల్స్‌లో కలిసి ఉంటాం. ఈ స్క్రీన్‌లో 78 స్పీకర్లు, 165 సౌండ్‌ ఔట్‌ లెట్లను బయటకు కనిపించకుండా అమర్చారు. జర్మనీ టీం ఈ స్క్రీన్‌ను చూసి ఆశ్చర్యపోయారు’ అని తెలిపారు. 648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్‌షిప్‌ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌ సైజులలో ఒకటి. 75 అడుగుల వెడల్పు ఫ్లాట్‌ యాస్పెక్ట్‌ రేషియోలో, భారతదేశంలో అతిపెద్ద డాల్బీ సినిమాగా నిలిచింది. ఆడిటోరియం డాల్బీ సినిమా డిజైన్‌ ప్రమాణాల ప్రకారం అమలు చేయబడిన డ్యూయల్‌ డాల్బీ విజన్‌ లేజర్‌ ప్రొజెక్షన్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రీమియం డాల్బీ 3డీ ద్వారా శక్తిని పొందుతుంది. పిచ్‌-బ్లాక్‌ ఆడిటోరియంలు పర్‌ఫెక్ట్‌ కాంట్రాస్ట్‌ కోసం రూపొందించబడ్డాయి అని అల్లుఅరవింద్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -