Saturday, March 14, 2026
E-PAPER
Homeమానవిబంధాన్ని బ‌ల‌ప‌రచుకోండి

బంధాన్ని బ‌ల‌ప‌రచుకోండి

- Advertisement -

దాంపత్య బంధంలో కోపతాపాలు, అలకలు సహజం. అయితే చాలా సందర్భాల్లో ఇవి కొంత సమయం వరకే పరిమితమవు తాయి. ఈ క్రమంలో భాగస్వామి కోపంతో ఉన్నప్పుడు వాళ్ల దగ్గర కొన్ని విషయాలను అస్సలు ప్రస్తావించకూడదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఒకవేళ ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం వారి కోపం మరింతగా పెరిగి అనుబంధానికే ముప్పుు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. మరి, ఇంతకీ భాగస్వామి కోపంతో ఉన్నప్పుడు వారి దగ్గర ప్రస్తావించకూడదని ఆ విషయాలేంటో

తెలుసుకుందాం…
గొడవ జరిగినప్పుడు దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు పీకల్లోతు కోపంతో ఉంటారు. ఈ సమయంలోనే ఎదుటివారిలో ఉండే ప్రతికూలతలు, లోపాలన్నీ గుర్తుకొస్తుంటాయి. ఒక రకమైన అసహనానికి లోనవుతుంటాం. ‘నీ వల్ల ఏదీ కాదు!’, ‘నువ్వెప్పుడూ నన్ను సంతోషంగా ఉంచలేదు..’, ‘నీకు స్వార్థం ఎక్కువ!’ మన ప్రమేయం లేకుండానే ఇలాంటి మాటలు దొర్లుతుంటాయి. అయితే ఇలాంటి మాటలు అవతలి వారి కోపాన్ని మరింత పెంచే ప్రమాదముంటుంది. తద్వారా గొడవ పెద్దదవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. దీనివల్ల ఇద్దరి మధ్య ఒక్క రోజులో ముగిసిపోయే కోపతాపాలు… రోజుల పాటు కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే కోపంతో ఉన్న భాగస్వామి దగ్గర ఎంత సమయమనం పాటిస్తే అంత మంచిది. అలాగే తప్పైనా, ఒప్పైనా అవతలి వారి కోపం తగ్గే దాకా ఎవరో ఒకరు కామ్‌గా ఉండడం మంచిది. ఇక కూల్‌ అయ్యాక అన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయి.

మరొకరి ప్రస్తావన వద్దు
భార్యభర్తల మధ్య జరిగే గొడవల్లో ఎక్కువ శాతం మూడో వ్యక్తి ప్రస్తావన వల్లే జరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఆలుమగలు తమ గొడవల మధ్యలో అత్తింటి వారి ప్రస్తావన తీసుకురావడం, వారిని విమర్శించడం మొదలైన వాటివల్ల భాగస్వామి కోపం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉంటుంది. ఇది మీ మధ్య భేదాభిప్రాయాల్ని మరింతగా పెంచవచ్చు. కాబట్టి మీ మధ్య గొడవలుంటే మీరే పరిష్కరించుకోవాలి. అంతేకానీ.. అన్నింటికీ కారణం మూడో వ్యక్తే అని నిందిస్తే.. నష్టపోయేది మీ అనుబంధమే అని గుర్తుపెట్టుకోవాలి.

రెచ్చగొట్టొద్దు
అసలే గొడవై ఇద్దరి మధ్య దూరం పెరిగినప్పుడు దాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నించాలే కానీ కొంతమంది అవతలి వారిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. మాటలు, చేతలతో వాళ్ల సహనాన్ని పరీక్షిస్తుంటారు. అంటే వాళ్లకు నచ్చని పనులు చేయడం, నచ్చని వ్యక్తులతో మాట్లాడడం, వంటివన్నమాట! నిజానికి ఇది గొడవకు పరిష్కారం చూపడమేమోగానీ ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగేలా చేస్తుంది. కాబట్టి కోపంలో ఉన్న భాగస్వామిని శాంతపరిచేందుకు ప్రయత్నించండి. ఈ క్రమంలో మీరు ఓ మెట్టు దిగినా తప్పు లేదు. మొత్తానికి ఇద్దరి మధ్య గొడవ తీరితే చాలు.

అధ్యయనం ఏం చెబుతోంది
‘అమ్మా నేను ఇతనితో వేగలేకున్నా… ఏం చేసినా తప్పంటాడు’ అంటూ తల్లితో తమ బాధను పంచుకొని అమ్మాయిలు ఉండరేమో. అయితే దానికి సమాధానంగా భార్యాభర్తలన్నాక గొడవలు సహజం అంటూ పెద్దవాళ్లూ సర్దిచెప్పే ప్రయత్నమే చేస్తారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా.. అసలు వాదనలు ఎందుకు వస్తున్నాయి. అవి గొడవలుగా ఎందుకు మారుతున్నాయి. వీటికి కారణాలేంటి అని? ఎందుకంటే.. యా’గన్‌’ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం దంపతుల మధ్య వారానికి ఒక్కసారైనా తగాదాలు చోటుచేసుకుం టున్నాయంట. కొత్తగా పెళ్లయిన జంటలైతే మరీ మూడురోజుకోసారి గొడవ పడుతున్నారట. అయితే వీటిల్లో దాదాపు 69శాతం పరిష్కరించలేనివేనట. ఎందుకంటే ఇవన్నీ జీవనశైలి, వ్యక్తిత్వ విభేదాలకు సంబంధించినవి. ఉదాహరణకు దంపతుల్లో ఒకరిది ఖర్చు చేసే స్వభావం అయితే, మరొకరు పొదుపు చేయాలనుకోవడం, ఒకరు సామాజికంగా అందరితో కలిసి పోవాలని కోరుకుంటే మరొకరు ఇంట్రావర్ట్‌లవ్వడం వంటివి. వీటిల్లో తక్షణ మార్పులు కోరుకోవడం వల్లే తగాదాలు జరుగుతున్నాయి అంటున్నాయి అధ్యయనాలు. ఇవి ఒక్కరోజులో వచ్చినవి కాదు. పెరిగే వాతావరణం, ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఒడుదొడుకులు, చుట్టూ ఉన్న వ్యక్తులు ఇవన్నీ వాళ్లని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలోనే వీటికి పరిష్కారం దొరుకుతుంది. అలాంటి వాటిని మార్చాలని తగాదాలు పడుతూ ప్రస్తుతాన్ని పాడుచేసుకుం టున్నారు ఇప్పటి జంటలు. బదులుగా సఖ్యత, సర్దుకుపోవడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంపై సమయాన్ని కేటాయిస్తే.. గొడవల్లో సగానికిపైగా సద్దుమణుగుతాయి అంటున్నారు నిపుణులు.

ఇవి గుర్తుపెట్టుకోండి…
దంపతులిద్దరి మనసులు కలిసినా.. వారి ఆలోచనలు, అభిరుచులు ఒకేలా ఉండాలని లేదు. అలాగని భాగస్వామి అభిప్రాయం నచ్చకపోతే వ్యతిరేకించ డమూ సరికాదు. కాదు, కూడదని పట్టుబడితే లేనిపోని గొడవలు తప్ప మరే ప్రయోజనం ఉండదు. అందుకే భాగస్వామి మనసు తెలుసుకొని మసలుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. వారి నిర్ణయాలను గౌరవించడం, పొరపాట్లుంటే సరిదిద్దడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. తద్వారా వారితో ఉంటే సురక్షితమైన భావన కూడా కలుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -