ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించే గొంతు కీలకం. అది మౌనంగా మారితే ప్రమాదకరం. అక్షరంతో, మాటతో, వ్యంగ్యంతో ప్రభుత్వాన్ని అద్దంలో చూపించే హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం. కానీ, నేడు ఆ హక్కుపై కత్తి వేలాడుతున్న దృశ్యం చర్చనీయాంశం. ప్రముఖ రాజకీయ కార్టూనిస్టు సతీష్ ఆచార్యకు కేంద్రం మొన్న నోటీసులు జారీచేసింది. మూడురోజుల్లో వాటికి సమాధానమివ్వాలంటూ ఆదేశించింది. ఆయన చేసిన నేరం- ప్రధాని మోడీపై కార్లూన్లు వేయడమే! ఇది మీడియా స్వతంత్రతను హరించడమే కాదు, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను భంగపరచడమే అవుతుంది. ప్రజాస్వామ్యానికి శాసన, కార్యనిర్వహక, న్యాయవ్యవస్థలు మూడు స్తంభాలైతే, నాలుగో స్తంభంగా మీడియాను చెప్పుకుంటాం. కానీ, ఆ స్తంభాన్నే పడగొట్టే చర్యలకు పాల్పడటం ఆందోళనకరం. పత్రికలకు ఎంత స్వేచ్ఛ ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. అధికారాన్ని ప్రశ్నించే స్వరం లేకపోతే అది కేవలం ఎన్నికల ప్రక్రియగానో, లేదంటే రాచరిక వ్యవస్థగానో మిగిలిపోతుంది. గతంలో న్యూస్‌క్లిక్ విషయంలో, ఆనంద్ వికటన్ అంశంలో, తాజాగా సతీష్ ఆచార్య విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒక్కటే- తమనెవరూ ప్రశ్నించకూడదు, అడ్డు చెప్పకూడదన్న ధోరణి.
సతీష్ ఆచార్య వేసిన కార్టూన్లలో ప్రధానికి పరువుకు నష్టం కలిగించే భావం ఏదైనా ఉందా అంటే లేనేలేదు. కానీ, అది రాజకీయంగా ఇరకాటంలో పెట్టింది. అమెరికా-ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న క్రమంలో మన విదేశాంగ విధానాన్ని ప్రశ్నిస్తూ, మోడీనుద్దేశించి ఆచార్య కార్టూన్లు వేశాడు. ‘ఒకప్పుడు ఇరాన్ మన మిత్రుడంటూ పేర్కొన్న భారత ప్రభుత్వం, ఇప్పుడు ఖమేనీ హత్యపై మౌనం దాలుస్తోంది. హిందూ మహాసముద్ర తీరంలో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాను అమెరికా జలాంతర్గామి ముంచివేసిన ఘటనపై ప్రధాని మోడీ మౌనంగా వహిస్తున్నారు…’ అనేది ఆయన కార్టూన్లలోని సారాంశం. ఇదే మోడీ సర్కార్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. వీటిని వెంటనే ఎక్స్ ఖాతా, సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలంటూ ఆచార్యను ఆదేశించింది. రెండు వారాలుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధ తంత్రం తెలిసిందే. అక్కడి మృత్యుకేకలు ఇక్కడ మానవ హృదయాలను కూడా కదిలిస్తున్నాయి. అక్కడ ఎగుస్తున్న చమురు సెగలు మన వంటిల్లును కూడా తాకుతున్నాయి. పెట్రోల్ తిప్పలు, గ్యాస్ సిలిండర్ల కొరత, సామాన్యుల అగచాట్లు కనిపిస్తూనే ఉన్నాయి.
ఈ పరిణామాలపై నోరు విప్పాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పార్లమెంట్ నుంచి పలాయనం చిత్తగించాడు మన ప్రధాని! మరి ఈ కల్లోలానికి కారణాల్లో, మన వైఖరి కూడా ఒకటికదా! అడగాల్సిన బాధ్యత మీడియాదే కదా! కార్టూన్ కూడా మీడియా వ్యక్తీకరణలో ఒక ముఖ్యమైన రూపం. చిన్న చిత్రం అయినా దానివెనుక పెద్ద అర్థం ఉంటుంది. వ్యంగ్యంతో రాజకీయ వైరుధ్యాలను బయటపెట్టడం కార్టూనిస్టుల పాత్ర. అందుకే ఆచార్య కూడా ‘కార్టూన్లు గీయడానికి, ప్రచురించడానికి నాకు హక్కు ఉంది. నోటీసులు పంపడం భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమే’ అన్నారు. మనకు రాజ్యాంగంలోని అర్టికల్ 19(1)ఎ వ్యక్తిస్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ, ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛను ఇచ్చింది. ఇవన్నీ ఆ హక్కులో భాగమే. జర్నలిస్టులు, రచయితలు, కార్టూనిస్టులు ఈ హక్కును వినియోగిస్తూ సమాజంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తారు, వివరిస్తారు, అవసరమైతే ప్రశ్నిస్తారు కూడా. దాన్ని జీర్ణించుకోలేకపోవడం, కక్షసాధింపుతో వ్యవహరించడం కేంద్రానికి సరికాదు. కార్టూన్ అనేది కేవలం చిత్రం కాదు, అది ఒక రాజకీయ వ్యాఖ్య. ఒకే ఫ్రేమ్‌లో రాజకీయ వైఖరులను బయటపెడుతుంది.
అందుకే ప్రపంచ వ్యాప్తంగా కార్టూనిస్టులు ప్రజాస్వామ్య చర్చలో కీలకపాత్ర పోషించారు. కానీ, మోడీ అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండేళ్ల కాలంలో వీటిని సహించని స్థితి పెరిగిపోయింది. ఇదే కాదు, గతేడాది తమిళనాడుకు చెందిన ఆనంద్ వికటన్ అనే డిజిటల్ మీడియా ఒక రాజకీయ వ్యంగ్యాన్ని ప్రచురిస్తే ఆ రాష్ట్ర బీజేపీ కేసువేసి వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయించింది. పత్రికా యాజమాన్యం కోర్టుకెక్కగా మళ్లీ పునరుద్ధరణకు నోచుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్తను అరెస్టు చేసి జైళ్లో వేసింది. ఇలా చూస్తే పత్రికారంగం ఉంటే తమకు అనుకూలంగా ఉండాలి, లేదంటే మూసేసుకోవాలన్న పద్ధతిలో కేంద్రం కక్షతో వ్యవహరిస్తోంది. కానీ, వాస్తవం ఏమిటంటే ప్రశ్నలను ఆణచడం ద్వారా సత్యాన్ని దాచలేరు. కార్టూనిస్టులకు నోటీసులు పంపడం, వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయడం, జర్నలిస్టులపై కేసులు పెట్టడం, ఇవన్నీ తాత్కాలికంగా విమర్శలను తగ్గించొచ్చు. కానీ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి. అందుకే ప్రశ్న శత్రుత్వం కాదు, సవరణకు మార్గం. ఆ ప్రశ్నకు అండగా నిలబడటం ప్రభుత్వ బాధ్యత, కాపాడుకోవడం ప్రజల కర్తవ్యం.
స్వేచ్ఛకు అధికార ఆంక్ష!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



