Saturday, March 14, 2026
E-PAPER
Homeఆటలుఎదురులేని అల్కరాస్‌, సినర్‌

ఎదురులేని అల్కరాస్‌, సినర్‌

- Advertisement -

సెమీఫైనల్‌కు చేరుకున్న స్టార్‌ ఆటగాళ్లు
ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ 2026

ఇండియన్‌వెల్స్‌ (యుఎస్‌ఏ) : ప్రపంచ టెన్నిస్‌ అగ్రశ్రేణి క్రీడాకారులు కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌), జానిక్‌ సినర్‌ (ఇటలీ) ఇండియన్‌వెల్స్‌ ఓపెన్‌లో దూసుకెళ్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్న టాప్‌ సీడ్‌ ఆటగాళ్లు.. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో అలవోక విజయాలు సాధించారు. వరల్డ్‌ నం.1 అల్కరాస్‌ 6-3, 6-4తో కామెరూన్‌ నోరె (బ్రిటన్‌)పై వరుస సెట్లలో గెలుపొందాడు. 2 ఏసలు, 4 బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన అల్కరాస్‌..పాయింట్ల పరంగా 73-57తో పైచేయి సాధించాడు. వరల్డ్‌ నం.2 జానిక్‌ సినర్‌ 6-1, 6-2తో లెర్నర్‌ టైన్‌ (అమెరికా)పై ఏకపక్ష విజయం నమోదు చేశాడు. 10 ఏస్‌లు, 4 బ్రేక్‌ పాయింట్లు సాధించిన సినర్‌.. పాయింట్ల పరంగా 60-37తో తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో బ్రిటన్‌ స్టార్‌ ఆటగాడు జాక్‌ డ్రేపర్‌పై 6-1, 7-5తో డానిల్‌ మెద్వదేవ్‌ (రష్యా) మెరుపు విజయం సాధించాడు.

10 ఏస్‌లు, 3 బ్రేక్‌ పాయింట్లతో వరుస సెట్లలోనే మెద్వదేవ్‌ గెలుపొందాడు. మెన్స్‌ సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో జానిక్‌ సినర్‌ తలపడనుండగా.. డానిల్‌ మెద్వదేవ్‌తో కార్లోస్‌ అల్కరాస్‌ ఢీకొట్టనున్నాడు. స్వైటెక్‌కు స్విటోలినా షాక్‌ : అగ్రశ్రేణి క్రీడాకారిణి, వరల్డ్‌ నం.2 ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌) ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో తొమ్మిదో సీడ్‌, ఉక్రెయిన్‌ అమ్మాయి ఎలినా స్విటోలినా 6-2, 4-6, 6-4తో మూడు సెట్ల మ్యాచ్‌లో స్వైటెక్‌ను చిత్తు చేసింది. స్విటోలినా 4 ఏస్‌లు, 5 బ్రేక్‌ పాయింట్లు సాధించగా.. స్వైటెక్‌ 3 ఏస్‌లు, 3 బ్రేక్‌ పాయింట్లతో సరిపెట్టింది. మరో క్వార్టర్‌ఫైనల్లో జెస్సికా పెగులా (అమెరికా)పై ఎలెనా రిబకినా 6-1, 7-6(7-4)తో గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ అరినా సబలెంకా (బెలారస్‌)తో లిందా నొస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) తలపడనుండగా.. ఎలెనా రిబకినాతో ఎలినా స్విటోలినా పోటీపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -