Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్పీకర్‌ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాం

స్పీకర్‌ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాం

- Advertisement -

– బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌ తీర్పు కాపీలు ఇవ్వడం లేదంటూ తమ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. 48 గంటల్లో తీర్పు కాపీలను ఇవ్వాలంటూ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పారు. వాటి కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనేది 53వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్‌ గాంధీ హయాంలో 1985లో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పెట్టారని అన్నారు. ఫిరాయింపుల చట్టానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకుని రాహుల్‌ గాంధీ తిరుగుతున్నారనీ, తెలంగాణలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తీర్పు చెప్పినా ఆయన స్పందించడం లేదన్నారు. ఆ పది మంది ఎమ్మెల్యేలకు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ జెండా కప్పితే అది జాతీయ జెండా అని అంటున్నారని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ ఇద్దరిపై అనర్హత వేటు పడుతుందని అందరూ భావించారని అన్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలవలేరనే దానం నాగేందర్‌ పార్టీ మారినట్టు ఆధారాల్లేవని స్పీకర్‌ తీర్పు ఇచ్చారని చెప్పారు. దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ బీఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేశారని అన్నారు. ఒక వ్యక్తి ఒకే సారి రెండు, మూడు పార్టీల నుంచి పోటీ చేయొచ్చా? అనేది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాలన్నారు. స్పీకర్‌ తీర్పును కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ కుమార్‌, పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతినిధి లలితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -