బాట్లింగ్ ప్లాంట్లలో కొరతలేదు
బ్లాక్‌చేస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియా ప్రచారంతోనే ఈ దుస్థితి
సీఎస్ నేతృత్వంలో హైలెవల్ కమిటీతో పర్యవేక్షణ : కలెక్టర్లు, ఎస్సీలు, పోలీస్ కమిషనర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ పౌరసరఫరాల శాఖమంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. గ్యాస్ కొరత ఉందనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని సిలిండర్లు బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాట్లింగ్ ప్లాంట్లలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ కొరతపై సోషల్ మీడియా ప్రచారం చేయడం వల్లే దుస్థితి వచ్చిందన్నారు. దీని పర్యవేక్షణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ నుంచి కలెక్టర్లు, ఎస్సీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు సమావేశమై… ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో లేని పోనీ అపోహలు సృష్టించి వారిని గందరగోళం చేస్తున్న పరిస్థితులపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం పడొద్దని కోరారు. సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతోనే కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించేందుకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు.
ఇటువంటి గందరగోళం ఏర్పడినందున్నే రోజు వారిగా 72శాతం బుకింగ్స్ జరుగుతున్నాయన్నారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు, వృద్దాశ్రమాలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని చెప్పారు. తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డంపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడినందుకు గానూ ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు.
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఇదే విధంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమించాలని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఎల్పీజీ బుక్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకొవద్దనీ, గృహా వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామన్నారు.
ప్రశ్నలకు సమాధానాలు సమర్పించండి
వివిధ విభాగాలకు సీఎస్ ఆదేశం
ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున ఇప్పటివరకు వచ్చిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు వెంటనే సమర్పించాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పెండింగులో ఉన్న ప్రశ్నలకు రావాల్సిన సమాధానాలు, సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ శాసనమండలి, శాసనసభ సమావేశాల నేపథ్యంలో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ రేపటిలోగా సమాధానాలు పంపించాలన్నారు.
ప్రధానంగా, నీటిపారుదల, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ పరిపాలన, ఇంధనశాఖ, రెవిన్యూ తదితర శాఖలకు సంబంధించి అధికంగా ప్రశ్నలున్నాయన్నారు. వీటన్నింటికీ వెంటనే సమాధానాలు పంపాలని అన్నారు. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయన్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉపముఖ్యమంత్రి ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



