Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూసీ పక్కనున్న ప్రజల నివాసాలకు రక్షణ కల్పించాలి

మూసీ పక్కనున్న ప్రజల నివాసాలకు రక్షణ కల్పించాలి

- Advertisement -

తొలగించడం అనివార్యమైతే న్యాయమైన నష్టపరిహారమివ్వాలి
ప్రాజెక్టు డీపీఆర్‌, ఎమ్‌ఎఫ్‌ఎల్‌ వివరాలను బహిర్గతం చేయాలి
సుందరీకరణను స్వాగతిస్తున్నాం : సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) వినతిపత్రం అందజేత

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు నేపథ్యంలో సాధారణ ప్రజల నివాసాలకు రక్షణ కల్పించాలనీ, తొలగించడం అనివార్యమైన చోట న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కోరింది. మూసీ సుందరీకరణను స్వాగతిస్తున్నామని తెలిపింది. ప్రాజెక్టు డీపీఆర్‌, ఎమ్‌ఎఫ్‌ఎల్‌ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేసింది. మూసీ సుందరీకరణకు తమ మద్దతు ఉంటుందని హామీనిచ్చింది. అయితే, పేదలకు నష్టం కలుగకుండా ముందుకెళ్లాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డీ అబ్బాస్‌, ఎమ్‌డీ జహంగీర్‌ లేఖ రాశారు.

ఆ లేఖ ప్రతిని సీఎం రేవంత్‌రెడ్డికి వారు అందజేశారు. మూసీ మురుగు కాలువగా మారడానికి కారణం బస్తీల్లోని పేదలు కాదని స్పష్టం చేశారు. నగరంలోని సీనరేజి నీరు, పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నదిలో కలువటమేనని కారణమని పేర్కొన్నారు. బఫర్‌ జోన్‌ పేరుతో పది వేల కుటుంబాలను నిరాశ్రయులుగా మార్చడం మానవత్వం అనిపించుకోదని తెలిపారు. సామాన్యుల ఇండ్లను కూల్చకుండా నదికి ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించి నదిని సుందరీకరించవచ్చునని సూచించారు. సుందరీకరణ, టూరిజం ప్రాజెక్టుల పేరుతో సామాన్యుల పొట్టగొట్టే చర్యలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. నగరంలోని నీరు మూసీ నదిలోకి నేరుగా కలువకుండా అన్ని ప్రాంతాల్లోనూ సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు(ఎస్‌టీపీ)లు నిర్మించి శుద్ధి చేసిన నీటిని మాత్రమే మూసీ నదిలోకి విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు తమ వ్యర్థ జలాలను తప్పనిసరిగా ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఈటీపీ) ద్వారా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే నదిలోకి నీళ్లు వదిలేలా కఠిన నిబంధనలు అమలు చేయాలనీ, నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మూసీ ప్రవాహానికి ఆటంకంగా ఉన్న కట్టడాలను మాత్రమే గుర్తించి తొలగించాలని సూచించారు. ఇండ్లు కోల్పోయిన వారికి మార్కెట్‌ ధరకు 5 రెట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేవలం బాండ్లు ఇవ్వడం వల్ల పేదలకు ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. భూమి/ఇల్లు విలువతో పాటు వ్యాపార నష్టం, అక్కడ నుంచి వెళ్లేందుకు అయ్యే ఖర్చులు, జీవనోపాధి నష్టంతో కలిపి పరిహారం ఇవ్వాలని కోరారు.

నివాసమున్న ప్రాంతానికి సమీపంలోనే బాధిత కుటుంబాలకు ఇండ్లు కట్టించాలని డిమాండ్‌ చేశారు. బఫర్‌ జోన్‌ నివాసితులకు రక్షణ కల్పించాలని విన్నవించారు. అదే సమయంలో పేదల నుంచి భూములను సేకరించి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ఆలోచనను రాష్ట్ర సర్కారు ఉపసంహరిం చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు అమలుకు ముందు సంబంధిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కోరారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌, ఎమ్‌ఎఫ్‌ఎల్‌ వివరాలను బహిర్గం చేయాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి అంటే కేవలం గాంధీ విగ్రహాలు, విదేశీ నమూనా రివర్‌ ఫ్రంట్లు కాదనీ, ఆ ప్రాంతంలో నివసించే ప్రజల ఆకలి, నివాసం, ఆత్మగౌరవాన్ని కాపాడటం కూడా అని తెలిపారు. పేదలను బలిపీఠం ఎక్కించి చేసే అభివృద్ధి నిజమైన అభివృద్ధి అనిపించుకోదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -