Saturday, March 14, 2026
E-PAPER
Homeజాతీయంతక్షణమే జోక్యం చేసుకోండి

తక్షణమే జోక్యం చేసుకోండి

- Advertisement -

వంటగ్యాస్‌ సంక్షోభంపై చర్యలు చేపట్టండి
బ్లాక్‌ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయండి
ఇరాన్‌పై యుద్ధాన్ని ఖండిస్తూ పార్లమెంట్‌ తీర్మానం చేయాలి : ప్రధాని మోడీకి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి బేబీ లేఖ

న్యూఢిల్లీ : వంట గ్యాస్‌ కొరత కారణంగా దేశంలో మెజారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోడీకి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ లేఖ రాశారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. వంట గ్యాస్‌ కొరత కారణంగా మెజారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, సంక్షోభంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నానని, దాని గురించి ప్రధాని దృష్టికి తీసుకువచ్చేందుకే లేఖ రాస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా తలెత్తిన అస్థిర పరిస్థితులు, ఫలితంగా చమురు, గ్యాస్‌ సరఫరాలకు ఆటంకాలు కలిగిన నేపథ్యంలో దేశ ప్రయోజనాలను పరిరక్షించగలిగేలా దేశంలో తగినన్ని గ్యాస్‌ నిల్వలు వుండేలా చూసుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లుగా కనిపిస్తోందని బేబీ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దురాక్రమణతో ఇంధన సరఫరా గొలుసులు అస్థిరమయ్యాయి. ప్రభుత్వం ఎంతగా నిల్వలు వున్నాయని ప్రకటనలు చేస్తున్నప్పటికీ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తూనే వున్నాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర వంట గ్యాస్‌ సిలిండర్లు రెండింటి ధరలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఈ చర్య మరింత భారాన్ని మోపింది. ఇప్పుడు, వీటన్నింటికన్నా, వంట గ్యాస్‌ కొరతను ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఒక పక్క ప్రజలు రీఫిల్స్‌ కోసం నమోదు చేసుకుని, పొడవైన క్యూల్లో వేచి వుండాల్సిన పరిస్థితి నెలకొనగా, మరోపక్క బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారులు మాత్రం ఇష్టారాజ్యంగా చెలరేగి పోతున్నారు. దేశీయ వినియోగానికి ఉద్దేశించిన గ్యాస్‌ సిలిండర్లను రూ.1500 నుండి రూ.4 వేల మధ్య బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా అవసరమున్న ప్రతి ఒక్కరికీ గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో వుండేలా చూడాలి. వంటగ్యాస్‌ కొరత కారణంగా, అనేక స్టూడెంట్‌ హోటళ్లు తమ ఆహార మెనూలను తగ్గించేశాయి. పూర్తిస్థాయి భోజనం అందించడానికి బదులుగా విద్యార్థులకు కేవలం పప్పు లేదా కూరతో వడ్డిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే, హాస్టళ్ళను మూసివేశారు, విద్యార్ధులను వారి ఇండ్లకు వెళ్లాల్సిందిగా కోరారు. ఈ పరిణామాలన్నీ కలిసి విద్యార్థులు ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల విద్యా కార్యకలాపాలు దెబ్బతినకుండా చూసేందుకు విద్యార్థి హాస్టళ్లకు గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూడాలని, అందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని బేబీ ఆ లేఖలో ప్రధానిని కోరారు.

వంట గ్యాస్‌ కొరత వల్ల గిగ్‌ వర్కర్లు తమ ఉపాధిని కోల్పోతున్నారు. వంట చేసుకునేందుకు ప్రత్యామ్నాయంగా వాడే ఇండక్షన్‌ స్టవ్‌లు, ఎలక్ట్రిక్‌ కుక్కర్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చివరకు కట్టెల ధరలు కూడా మూడు నాలుగు రెట్లు పెరిగిపోయాయి. వంటనూనెల ధరలు కూడా పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎంఎ బేబీ పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ మన సమాజంలోని నిరు పేద వర్గాలను ఆకలితో అలమటించే వైపునకు నెడుతున్నాయి. మధ్య తరగతి ప్రజలు ఇప్పటికే పెరుగుతున్న ధరల అదనపు భారాన్ని మోస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మొత్తమ్మీద, అమెరికా, ఇజ్రాయిల్‌ చేపట్టిన యుద్ధం మన దేశంలో ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తోంది. కొన్ని చోట్ల గ్యాస్‌ ఆధారిత దహన వాటికల్లో శవాల అంతిమ సంస్కారాలు కూడా కష్టసాధ్యం కావడంతో వాటి కార్యకలాపాలను మూసి వేసుకోవాల్సి వచ్చింది. ఇటీవలి విదేశాంగ విధాన వైఖరులను కూడా పున: పరిశీలించుకోవాల్సిందిగా ప్రధాని మోడీని బేబీ కోరారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సాగించే యుద్ధాన్ని ధృఢంగా ఖండించాలని కోరారు. 2003లో ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేసినపుడు భారత పార్లమెంట్‌ ఆ యుద్ధాన్ని ఖండిస్తూ, ఒక సార్వభౌమ దేశంపై దాడి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వం వహించారని గుర్తు చేయడం ఇక్కడ మరింత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నందున పార్లమెంట్‌… అప్పటిలాగే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దురాక్రమణ చర్యలను, యుద్ధాన్ని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు. తక్షణమే యుద్ధాన్ని ముగించాలంటూ అమెరికా, ఇజ్రాయిల్‌లను భారత ప్రభుత్వం కోరాలని బేబీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరంగా ఇంధన వనరుల సరఫరా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పై విషయాలన్నింటిపై తక్షణమే దృష్టి పెట్టి తగు కార్యాచరణ చేపట్టాలని ఆయన ప్రధాని మోడీని కోరారు.

ఈ చర్యలు తీసుకోండి
1.గ్యాస్‌ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి, పెంచిన రేట్లకు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించే బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
2.రోజువారీ పెట్టే పదార్థాలతో పాటు తగిన మొత్తంలో పప్పు, కూరలు వండి పెడుతూ విద్యార్ధులకు పోషకాహారం, సమతుల్య ఆహారం అందేలా విద్యార్థి హాస్టళ్ల కు నిరంతరాయంగా గ్యాస్‌ సరఫరా చేయాలి.
3.వంటనూనెల ధరలపై నియంత్రణ, పర్యవేక్షణ వుండాలి.
4.ఫుడ్‌ డెలివరీలపై ఆధారపడి, ఉపాధి కోల్పోయిన గిగ్‌ వర్కర్లకు తగిన నష్టపరిహారం ఇవ్వాలి. చిన్న రెస్టారెంట్ల యజమానుల ప్రయోజనాలు కాపాడాలి. ఇందుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలి.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -