Saturday, March 14, 2026
E-PAPER
Homeజాతీయంగురి తప్పింది

గురి తప్పింది

- Advertisement -

అమెరికాకు ఆశాభంగం
త్వరిత విజయాన్ని కాంక్షించి ఎదురుదెబ్బ
యుద్ధాన్ని దీర్ఘకాలంగా కొనసాగించేందుకు ఇరాన్‌ సిద్ధం : టెహ్రాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ మరాండి


న్యూఢిల్లీ : ఇరాన్‌పై త్వరగా విజయాన్ని సాధిస్తామని భావించిన అమెరికా, ఇజ్రాయిల్‌లకు ఎదురుదెబ్బ తగిలిందని టెహ్రాన్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ మరాండి వ్యాఖ్యానించారు. యుద్ధం ప్రారంభమైన రెండు వారాల తర్వాత కూడా ఇరాన్‌ సైనిక సామర్థ్యాలను పూర్తిగా ధ్వంసం చేయడంలో వారు విఫలమయ్యారనీ, ఈ పోరాటం మరింత కాలం కొనసాగితే పరిస్థితి అమెరికా-ఇజ్రాయిల్‌కు మరింత ప్రతికూలంగా మారుతుందని చెప్పారు. ‘ది హిందూ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇరాన్‌పై త్వరిత దాడితో విజయాన్ని సాధిస్తామని భావించాయనీ, కానీ ఇరాన్‌ దానికి తగిన ప్రతిస్పందన ఇచ్చిందని ఆయన చెప్పారు.

పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయిల్‌ లక్ష్యాలపై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోందని తెలిపారు. ఇరాన్‌ క్షిపణి సామర్థ్యాన్ని ధ్వంసం చేయడం, క్షిపణి తయారీ కేంద్రాలను నాశనం చేయడం, నౌకాదళాన్ని బలహీనపర్చడం అనే మూడు లక్ష్యాలను అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటించారనీ, అయితే అది ఇప్పటి వరకూ సాధ్యపడలేదని ఆయన గుర్తు చేశారు. ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణుల తయారీ కేంద్రాలు భూగర్భంలో ఉండటంతో అవి ఇంకా పని చేస్తూనే ఉన్నాయని చెప్పారు. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఇంధన ధరలు పెరుగుతాయని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మరాండి హెచ్చరించారు.

ముఖ్యంగా హార్ముజ్‌ జలసంధి మూసివేయడంతో అంతర్జాతీయ చమురు సరఫరాపై పెద్ద దెబ్బ పడిందని తెలిపారు. అరబ్‌ గల్ఫ్‌ దేశాలు తమ భూభాగాల్లో అమెరికా సైనిక స్థావరాలను అనుమతించడం వల్ల అవి తాము తటస్థ దేశాలని చెప్పలేమని ఆయన అన్నారు. ఇరాన్‌పై దాడులకు తమ భూమిని వినియోగించేందుకు అనుమతించిన దేశాలు భవిష్యత్తులో దాని ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇరాన్‌ ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదనీ, కానీ అవసరమైతే దీర్ఘకాల యుద్ధానికి ఆ దేశం సిద్ధంగా ఉందని మరాండి తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌ అణు ఆయుధాల తయారీకి వ్యతిరేకంగా ఉన్న ఫత్వా అమల్లోనే ఉందని చెప్పారు. అయితే దేశానికి ప్రాణ హాని ఏర్పడితే మాత్రం అణు విధానంలో మార్పులు రావచ్చని ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -