తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు నోటీసులు
రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ : దేశంలో మిస్సింగ్ కేసులు పెరగటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆందోళన వ్యక్తం చేసింది. అనేక రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయనీ, తప్పిపోతున్న వారి ఆచూకీ కనిపెట్టటంలోనూ పేలవ ప్రదర్శనను కనబరుస్తున్నాయంటూ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఐదు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తెలంగాణతో పాటు బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు ఈ నోటీసులు పంపింది.
బీహార్‌లో అత్యధికంగా మిస్సింగ్ కేసులు
వార్తా కథనాల ప్రకారం.. బీహార్‌లో 2013 నుంచి ప్రతి సంవత్సరం 12వేల నుంచి 14వేల వరకు మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో అనేకం పిల్లలకు సంబంధించిన కేసులే కావడం ఆందోళన కలిగించే విషయం. అయితే అదృశ్యమైన చిన్నారుల్లో సుమారు కొంత మంది ఆచూకీ మాత్రమే కనుగొంటున్నారు. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం మానవ అక్రమ రవాణా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలుగా ఒడిశా, బీహార్, తెలంగాణ, మహారాష్ట్రలు ఉన్నాయి. కాగా అదృశ్య మైన చిన్నారులను బిక్షాటన, బలవంతంగా పనుల్లో పెట్టడం, వ్యభిచారం వంటి అక్రమ కార్యకలాపాల్లోకి నెట్టివేయబడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి నిజమైతే ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్య అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. అందుకే సంబంధిత రాష్ట్రాలు మిస్సింగ్ కేసులను తగ్గించడానికి తీసుకున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
మిస్సింగ్ కేసులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన
- Advertisement -
- Advertisement -



