సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- మిర్యాలగూడ టౌన్
ఈనెల 16వ తేదీ నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధుల కేటాయింపులు ఉండాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలుపరిచే విధంగా నిధుల కేటాయింపు జరగాలన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పినా వాటిలో ప్రస్తుతానికి మూడు మాత్రమే అమల్లో ఉన్నాయని, మిగిలినవి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదన్నారు. పింఛన్లు సైతం రూ.2వేల నుంచి 4 వేలకు పెంచుతామన్న వాగ్దానం నీటి మూటయ్యిందన్నారు. రాజీవ్ ఆరోగ్య పథకం కింద ఇస్తారన్న రూ.10 లక్షల బీమా పథకం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు జరగాలని, అదేవిధంగా అవి ఖర్చయ్యే ఆలోచన చేయాలని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేటాయించిన సంక్షేమ నిధులను ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. రాష్ట్రంలో నానాటికీ నిరుద్యోగం పెరుగుతుందని, దీనివల్ల యువత చెడు మార్గం పట్టే అవకాశం ఉన్నందున ప్రత్యేక ప్రణాళికను రూపొందించి వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి, మంగారెడ్డి, రవి నాయక్, పరుశురాములు, వినోద్ నాయక్ పాల్గొన్నారు.
రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



