Saturday, March 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపంటలకు ఎండల దెబ్బ

పంటలకు ఎండల దెబ్బ

- Advertisement -

– అడుగంటుతున్న భూగర్భ జలాలు
– ప్రాజెక్టులు లేని ప్రాంతాల్లో ఎండుతున్న వరి చేలు
– రైతన్న ఆశలు ఆవిరి

వేసవి ఆరంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువైంది.. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు బావుల్లో నీరు లభ్యం కావడం లేదు. రైతన్న ఆశలు ఆవిరైపోతున్నాయి. సాగు నీరు సరిపడా అందక వరి పైర్లు పొట్ట దశలో నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. వేల రూపాయల పెట్టుబడి ఎండలపాలవ్వకుండా పైర్లను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బోరు బావులను తవ్విస్తున్నారు. నీళ్లు రాకపోవడంతో కన్నీరు పెడుతున్నారు.

నవతెలంగాణ- సంస్థాన్‌ నారాయణపురం/ చండూరు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టుల పరిధిలో లేని ప్రాంతాలు, కాలువలు లేని మండలాల్లో పైర్లకు ఎండల దెబ్బ తగులుతోంది. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. గత సంవత్సరం కూడా ఇదే సమయంలో వారం రోజుల్లో పంట చేతికందుతుందనగా బోరుబావులు వట్టిపోయాయి. పైర్లు ఎండిపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మూడేండ్లతో పోలిస్తే ఈ ఏడు విస్తారంగా వర్షాలు కురిశాయి. చెరువు కుంటలు నిండి వాగూ వంకలు పారాయి. దీంతో అత్యధిక మంది రైతులు యాసంగిలో వరి సాగుపై ఆసక్తి చూపారు. నాటు దశలో అత్యధికంగా నీళ్లు అందించిన బోరు బావుల నుంచి రెండు నెలల్లోపే భూగర్భ జలాలు అడుగంటి పోవడం, విద్యుత్‌ కష్టాలు మొదలవడంతో నీరు రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలంలో వరి చేలు ఇప్పటికే సగం వరకు ఎండిపోయాయి. ఈ నెలాఖరు నాటికి 75 శాతం పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. వాచ్య తండాలో ఎండిపోగా మిగిలిన వరి చేలను రక్షించుకునేందుకు పీవీసి, తిత్తి పైపులను కొనుగోలు చేసి కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లను తీసుకొచ్చి పారిస్తున్నారు. అదే తండాలో ఓ రైతు మురికి కాలువ నీటినీ వృథా పోనీయకుండా పైపు అమర్చి తన పొలానికి పారిస్తున్న దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. కడపగండి తండాలో ఎండిన వరి చేలను పశువులకు, గొర్రెలకు మేతకు అమ్ముతున్నారు. ఈ ప్రాంతానికి ఎలాంటి సాగునీటి వనరులు లేకపోవడంతోనే ఆర్థిక నష్టాలకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. సుమారు ఎకరాకు రూ.40-50 వేల ఖర్చు అయినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయిన వరి చేలకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. చండూరు మండలంలోనూ బోర్లు ఎండిపోవడంతో చేతికొచ్చిన పంటను కాపాడు కునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి
గతేడాదితో పోలిస్తే ఈ యేడు సాగు ఖర్చులు పెరిగాయి. భూగర్భ జలాలు అడుగంటి పోవడం, విద్యుత్‌ సరఫరా లోపం వల్ల వరి చేలు ఎండిపోతున్నాయి. ఎండిన వరిపైర్లకు ప్రభుత్వం పరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు ఎండిన పంట పొలాలను పరిశీలించాలి. బాధిత రైతుల జాబితా తయారు చేసి నష్టపరిహారం అందజేయాలి.
– దోనూరు నర్సిరెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు

చేతికి వచ్చే సమయంలో ఎండింది
మూడెకరాలలో వరి సాగు చేశా. చేను పొట్ట దశలో ఉంది. మరో వారం రోజులు నీరందిస్తే పంట చేతికి వచ్చేది. బోరు నీళ్లు రాకపోవడంతో పొలం ఎండింది. రెండు బోర్లు వట్టిపోయాయి. పది ఎకరాల్లో అప్పులు తెచ్చి కౌలు చేస్తున్నా. పెట్టుబడి ఎక్కువైంది.
– కట్ట యాదయ్య, రైతు, కస్తాల గ్రామం, చండూరు మండలం

ఐదెకరాలు ఎండిపోయింది
నేను సాగు చేసిన ఐదెకరాలు ఎండిపోయింది. ఎకరానికి రూ.50వేలు ఖర్చయ్యింది. ఎండిన వరి చేనును గొర్రెల మేతకు అమ్మితే ఎకరానికి రూ.10వేలు వచ్చాయి. మొత్తం అమ్మినా ఎకరం పెట్టుబడి రాలేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదు. సాగు ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. తెచ్చిన అప్పు ఎట్టా తీర్చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కరంటోతు బిచ్చ, రైతు, కడపగండి తండా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -