కొనుగోలుకు అనుమతించిన అమెరికా
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షుభిత పరిస్థితుల నేపథ్యంలో రష్యా చమురుపై గల ఆంక్షలను అమెరికా సడలించింది. ఇప్పటికే సముద్రంలోని నౌకల్లో లోడ్ చేసి, నిలిచిపోయిన రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు దేశాలను అనుమతించింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెచ్చరిల్లుతున్న తరుణంలో అమెరికా ఈ చర్య తీసుకుంది. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంథి గుండా నౌకల రవాణా దాదాపు నిలిచిపోయిన పరిస్థితి ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ జరిగే చమురు సరఫరాల్లో దాదాపు ఐదోవంతు ఈ జలసంథి గుండానే జరుగుతోంది.
దాడుల కారణంగా ఇరాన్ ఆ జలసంథిపై తన పట్టును నియంత్రించడంతో చమురు ధరలు ఒక్కసారిగా 50శాతం పెరిగాయి. బ్యారెల్ ధర దాదాపు 120డాలర్లకు చేరింది. ప్రస్తుత సరఫరాలను పెంచేందుకు తాత్కాలికంగా ఈ చర్య తీసుకున్నట్లు బెసెంట్ తెలిపారు. ఈ చర్య ఇంధన మార్కెట్లను స్థిరీకరించి, ధరలు తగ్గేందుకు అవకాశం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మార్చి 12వ తేదీకి ముందు నౌకల్లోకి ఎక్కించిన రష్యన్ చమురు ఎగుమతులకు సంబంధించిన ఈ మినహాయింపు 30రోజుల పాటు అమల్లో వుంటుంది. అంతకుముందు అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ మాట్లాడుతూ రష్యా పట్ల తమ ఆంక్షల విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రష్యాచమురుపై గల విస్తృత ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు.
రష్యాకు ఊహించని లాభాలు..
అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడం రష్యాకు అనుకూలిస్తోందని, యుద్ధంలో రష్యానే విజేత అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మాటే నిజమవుతోంది. భగ్గుమంటోన్న ధరల కారణంగా పుతిన్ ప్రభుత్వానికి బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. గురువారం సెనెట్ సాయుధ సేవల కమిటీ విచారణ సందర్భంగా యూఎస్ సెనెటర్ ఆంగస్ కింగ్ మాట్లాడుతూ.. ”ఈ యుద్ధంలో స్పష్టమైన విజయం పుతిన్, రష్యాదే. ఈ యుద్ధం మాస్కోకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతోంది” అని అన్నారు. యుద్ధం ప్రారంభమైన దగ్గరినుంచి 6 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని పొందిందన్న అంచనాలను ప్రస్తావించారు. అదేరోజు లెక్కన చూసుకుంటే దాదాపు 400 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,700 కోట్లు) అదనపు ఆదాయాన్ని ఆర్జించిందన్నారు.



