హార్ముజ్‌కు రక్షణ నౌకలను పంపబోమన్న మిత్రదేశాలు
కాల్పుల విరమణను కోరలేదు
ఎన్నిరోజులైనా పోరాడుతాం: ఇరాన్
దుబాయి ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి
ఫుజైరా చమురు కేంద్రంపై కూడా…
ఇజ్రాయిల్ నగరాలు, గల్ఫ్‌పై టెహ్రాన్ దాడులు ముమ్మరం
జనావాసాలపై అమెరికా – ఇజ్రాయిల్ దళాల బాంబుల వర్షం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ క్షిపణి దాడులు మొదలై 17 రోజులైనా భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్‌ను అవలీలగా తమ వశం చేసుకోవాలని భావించిన ట్రంప్ వ్యూహాలు, ఎత్తుగడలు పటాపంచలవుతున్నాయి. చివరికి హార్ముజ్ వద్దకు మిత్రదేశాల రక్షణ నౌకలను పంపాలనే అమెరికా అధ్యక్షుడు ఆదేశాలను కాదంటున్నాయి. దీంతో తాను ఏకాకిగా మిగిలిపోతున్నాననే భయం ట్రంప్‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోపక్క ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ కూడా వెనక్కి తగ్గనంటుంది. ఎన్ని రోజులైనా పోరాడుతామని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇంకోవైపు ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ విమానాలు జనావాసాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.
నవ తెలంగాణ – సెంట్రల్ డెస్క్
దాడులు, ప్రతి దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడికిపోతోంది. యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించినా ఇజ్రాయిల్-అమెరికా సేనలు కానీ, ఇరాన్ దళాలు కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ డ్రోన్ దాడిలో దుబాయ్ విమానాశ్రయం సమీపంలో సోమవారం మంటలు చెలరేగాయి. విమానాశ్రయం సమీపంలో ఉన్న ఇంధన ట్యాంకుపై డ్రోన్ పడడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో అత్యవసర బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ముందు జాగ్రత్త చర్యగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని విమానాలను దుబాయి ఎయిర్‌పోర్టు నుంచి అల్ మక్టమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించారు. దుబాయి పౌర రక్షణ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. డ్రోన్ దాడి నేపథ్యంలో విమానాశ్రయ రోడ్డును, ఎయిర్‌పోర్ట్ టన్నెల్‌ను పోలీసులు మూసివేశారు. విమానాశ్రయ పరిసరాలపై డ్రోన్ దాడి జరగడం ఇది మొదటిసారి కాదని అధికారులు తెలిపారు.
యూఏఈ చమురు వాణిజ్య హబ్‌పై…
దుబాయి విమానాశ్రయం ప్రాంతంలో దాడి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫుజైరా చమురు వాణిజ్య హబ్‌పై కూడా డ్రోన్ దాడి జరిగింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు సహాయ సిబ్బంది ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. ఘటన తర్వాత చమురు లోడింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు. ప్రపంచంలో ముడి చమురును, ఇంధనాలను నిల్వ చేసే అతి పెద్ద కేంద్రాలలో ఫుజైరా ఒకటి. ఇది యూఏఈకి చెందిన అబూధాబీ ముడి చమురు పైప్‌లైన్‌కు చివరన ఉంది.
హార్ముజ్ జలసంధి ద్వారా కాకుండా ఇక్కడి నుంచి యూఏఈ ముడి చమురు సరఫరా అవుతుంటుంది. ఈ పైప్‌లైన్ ద్వారా రోజుకు ఒకటిన్నర మిలియన్ బ్యారల్స్ చమురును పంపవచ్చు. ఫుజైరా టెర్మినల్‌పై శనివారం కూడా దాడి జరిగింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి యూఏఈపై ఇరాన్ 1,800కు పైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. గల్ఫ్ వ్యాప్తంగా ఉన్న అమెరికా ఆస్తులతో పాటు విమానాశ్రయాలు, ఓడరేవులు, చమురు కేంద్రాలు సహా పలు పౌర ప్రదేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇరాన్‌పై బాంబుల వర్షం
మరోవైపు అమెరికా, ఇజ్రాయిల్ దళాలు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. టెహ్రాన్, హమద్, ఇస్ఫహాన్, షిరాజ్, తబ్రిజ్ సహా పలు నగరాలు, పట్టణాలపై దాడులు జరుగుతున్నాయి. సెంట్రల్ టెహ్రాన్‌లో బాంబు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలకం చేశారు. ఇరాన్‌లో వరుసగా 17వ రోజు కూడా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కాగా హెజ్బొల్లా దళాలను లక్ష్యంగా చేసుకొని దక్షిణ లెబనాన్‌లోని జబల్ అల్-బటమ్‌పై వైమానిక దాడులు జరిగాయి.
హెజ్బొల్లాపై పరిమిత స్థాయిలో భూతల దాడులు కూడా ప్రారంభించామని ఇజ్రాయిల్ తెలిపింది. రాజధాని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపై ఆదివారం రాత్రి విమాన దాడులు జరిగాయి. లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులలో ఇప్పటి వరకూ వంద మంది చిన్నారులు సహా 850 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లోని డ్రోన్ తయారీ కర్మాగారాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నామని, దీంతో ఆ దేశం యొక్క తయారీ సామర్ధ్యం దెబ్బతిన్నదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. యుద్ధం మొదటి రోజు మరణించిన ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ ఉపయోగించిన విమానాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది.
ఛాబహార్ స్వేచ్ఛా వాణిజ్య మండలి సమీపంలో అమెరికా దాడులు
ఇరాన్‌లో ప్రధాన పారిశ్రామిక, రవాణా కేంద్రంగా కొనసాగుతున్న ఛాబహార్ స్వేచ్ఛా వాణిజ్య మండలి సమీపంలోని సైనిక కేంద్రాలపై అమెరికా దళాలు వైమానిక దాడులు చేశాయి.
హార్ముజ్ రక్షణకు ట్రంప్ పిలుపు.. వస్తామంటూ చైనా షరతు
ఇరాన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న హార్ముజ్‌ను సురక్షితంగా ఉంచేందుకు, ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు ముందుకురావాలని ట్రంప్ పలు దేశాలను కోరారు. ఈ విషయంపై చైనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. హార్ముజ్ రక్షణకు తాము ముందుకురావాలంటే.. పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఇరువర్గాలకు సూచించారు. ఈ ఘర్షణల వల్ల అంతర్జాతీయ ఇంధన ప్రవాహం, ప్రాంతీయ శాంతి, ప్రపంచ స్థిరత్వం దెబ్బతిన్నాయన్నారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని లిన్ జియాన్ అమెరికాకు సూచించారు.
ప్రస్తుత ఘర్షణలు ఆగితేనే ప్రాంతీయ స్థిరత్వం సాధించగలమని పేర్కొన్నారు. ఈనెల చివర్లో ట్రంప్ బీజింగ్ పర్యటన గురించి అమెరికాతో చర్చలు జరుగుతున్నా యన్నారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచు కోవడంలో ఈ పర్యటన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆదివారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. హార్ముజ్ ప్రాంతంలో చైనా ప్రయోజనాలే ఎక్కువని వ్యాఖ్యానిం చారు. ఆ జలసంధిని రక్షించేందుకు ముందుకురావాలని బీజింగ్‌కు పిలు పునిచ్చారు. ఆ దేశం ఇచ్చే సమాధానాన్ని బట్టి బీజింగ్ పర్యటనకు వెళ్లాలా, వాయిదా వేయాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటానన్నారు.
ఇజ్రాయిల్ నగరాలపై దాడులు ఉధృతం
ఇజ్రాయిల్‌లోని పలు నగరాలు కూడా ఇరాన్ దాడితో బెంబేలెత్తిపోతున్నాయి. ఇరాన్ దాడులలో ఇప్పటి వరకూ సుమారు మూడున్నర వేల మంది గాయపడ్డారని ఇజ్రాయిల్ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇరాన్ దాడులతో తమకు జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు బయటికి పొక్కకుండా ఇజ్రాయిల్ ‘సైనిక సెన్సార్‌షిప్’ విధించింది. సెంట్రల్ ఇజ్రాయిల్‌లోని షోహమ్, రిషన్ లెజియన్, లాడ్‌తో పాటు టెల్ అవీవ్ సమీపంలోని నెస్ జియోనాపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపింది. ఇరాన్ వైపు నుంచి జరుగుతున్న క్షిపణి దాడుల నేపథ్యంలో సెంట్రల్ ఇజ్రాయిల్‌లో సైరన్లు మోగించారు. ఎర్ర సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ తమకు ముప్పుగా పరిణమిస్తున్నందున దానికి సాయపడుతున్న లాజిస్టిక్, సపోర్ట్ కేంద్రాలను తమ సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది.
ట్రంప్‌నకు మిత్రదేశాల సహాయనిరాకరణ
హార్ముజ్ జలసంధిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కలలు కంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు ఎదురు దెబ్బ తగిలింది. జలసంధిని తన ఆధీనంలోకి తీసుకొని చమురు నౌకల ప్రయాణానికి లైన్ క్లియర్ చేయాలని ఆయన భావిస్తుండగా మిత్ర దేశాలైన జపాన్, ఆస్ట్రేలియాలు అందుకు సుముఖత చూపలేదు. జలసంధిలో ప్రయాణించే చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించడానికి మధ్యప్రాచ్యానికి నౌకలను పంపే ఆలోచనేమీ చేయడం లేదని ఆ దేశాలు సోమవారం స్పష్టం చేశాయి. గల్ఫ్ నుంచి వచ్చే చమురుపై ఎక్కువగా ఆధారపడుతున్న దేశాలకు జలసంధిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని ట్రంప్ ఆదివారం నాడు సూచించారు.
‘ఈ దేశాలన్నీ ముందుకు వచ్చి తమ భూభాగాన్ని పరిరక్షించుకోవాలి. ఎందుకంటే అది వారిదే. అక్కడి నుంచే వారు ఇంధనాన్ని పొందుతున్నారు’ అని ఆయన చెప్పారు. ఈ విషయంలో తన ప్రభుత్వం అనేక దేశాలను సంప్రదించిందని తెలిపారు. అయితే ఆ దేశాలేమిటో ఆయన చెప్పలేదు. అయితే చైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, బ్రిటన్ తదితర దేశాలు భాగస్వాములు అవుతాయని ఆశిస్తున్నానని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ఆయన తెలియజేశారు. కాగా హార్ముజ్‌లో ప్రయాణించే చమురు ట్యాంకర్లకు రక్షణగా తమ నౌకలను పంపే ఆలోచన లేదని జపాన్ ప్రధాని సనే తకైచీ చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చట్టపరంగా ఏం చేయగలమో పరిశీలిస్తామని తెలిపారు. రక్షణ నౌకలను పంపాలంటూ తమను ఎవరూ సంప్రదించలేదని ఆస్ట్రేలియా మంత్రి కాథరిన్ కింగ్ అన్నారు. జలసంధిని తిరిగి తెరవడానికి సాయపడేందుకు నౌకలను పంపబోమని చెప్పారు.
కాల్పుల విరమణను కోరలేదు ఎన్నిరోజులైనా పోరాడుతాం: ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ ఖండన
ఇరాన్ కాల్పుల విరమణ చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను టెహ్రాన్ ఖండించింది. ఇరాన్ ఎప్పుడూ కాల్పుల విరమణ లేదా చర్చలను కోరలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. అవసరమైతే ఎంతకాలమైనా తమ దేశాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. ‘అమెరికా చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ముగించే వరకు ఇరాన్ సైనిక చర్యను కొనసాగిస్తుంది. మేం ఎప్పుడూ కాల్పుల విరమణ కోరలేదు. చర్చలు కూడా కోరలేదు. అవసరమైతే ఎంతకాలమైనా మేము రక్షణ చర్యలు కొనసాగిస్తాం. మేం ఇప్పటికే వారితో చర్చలు జరుపుతున్న సమయంలోనే వారు మాపై దాడి చేశారు. అలాంటప్పుడు మళ్లీ ఎందుకు చర్చలు జరపాలి. వారితో మాట్లాడేందుకు మాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు’ అని అరాగ్చీ తెలిపారు.
‘అణు చర్చల్లో రాజీకి సిద్ధమయ్యాం’
అమెరికాతో జరిగిన అణు చర్చల సమయంలో తమ దేశం పెద్ద రాజీకి సిద్ధమైందని అరాగ్చీ తెలిపారు. ఇరాన్ వద్ద ఉన్న 60 శాతం శుద్ధి చేసిన యురేనియాన్ని తక్కువ స్థాయికి తగ్గించడానికి సిద్ధమని అప్పట్లో ప్రతిపాదించామని చెప్పారు. ఇరాన్‌కు అణ్వా యుధాలు తయారు చేయాలనే ఉద్దేశం లేదని నిరూపించడానికే ఆ ప్రతిపాదన చేశామని ఆయన తెలిపారు.
భారత ట్యాంకర్‌ను నింపుతుండగా…
ఫుజైరా టెర్మినల్‌పై శనివారం దాడి జరిగిన సమయంలో భారత పతాకంతో ఉన్న ఓ ముడి చమురు ట్యాంకర్ ‘జగ్ లడ్కీ’లో చమురును నింపుతున్నారు. ఈ నౌకలో యూఏఈ ఉత్పత్తి చేసిన 80,800 టన్నుల మర్బన్ ముడి చమురు ఉంది. అయితేదాడిలో ట్యాంకర్‌కు కానీ, అందులోని సిబ్బందికి కానీ ఎలాంటి నష్టం జరగలేదని, ఆ నౌక స్వదేశానికి చేరుకుంటోందని అధికారులు తెలిపారు.



