Wednesday, March 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజీతాలియ్యకుంటే బతికేదెట్టా?

జీతాలియ్యకుంటే బతికేదెట్టా?

- Advertisement -

– గొడ్డుచాకిరి చేస్తున్నాం..కనికరం చూపండి
– హామీలు అమలు చేయాలంటే అరెస్టులా?

– హామీలు అమలు చేయాలంటే అరెస్టులా?
– పంచాయతీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తం

”పల్లెల పరిశుభ్రత కోసం గొడ్డుచాకిరి చేత్తన్నం. మా కస్టానికి జీతాలివ్వకుంటే మేం బతికేదెట్టా..? మా బాధలు సర్కార్‌కు కాక మరెవరికి చెప్పాలె.. ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి సారు పెద్దపెద్ద మాటలు జెప్పిండు కదా..! ఆ మాటలన్ని మర్చిపోయిండా? మేమేమన్న అసెంబ్లీలో కూసునేందుకు పోతున్నమా? మా బాధలు ఆ పెద్ద సారుకు చెప్పుకునేందుకు వచ్చినం. హామీలడిగితే అరెస్టు చేసుడేంది? మేము దొంగలమా? ఊర్లను శుభ్రం చేసెటోళ్లం. గ్రామాల బాగు కోరుకునేటోళ్లం. మా పట్ల కనికరం ఉండదా.? మమ్ముల్ని అరెస్టులు చేసి మా గోడు వినకపోతే చూస్తూ ఊరుకోంం. పోరాటాన్ని పెద్దగ జేత్తం” ఇదీ..! యాదమ్మ అనే గ్రామ పంచాయతీ కార్మికురాలి ఆవేదన.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చలో హైదరాబాద్‌-ధర్నాచౌక్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. శాంతి యుతంగా ధర్నా నిర్వహించేందుకు పది రోజుల ముందే ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అనుమతిస్తామంటూ సోమవారం అర్థరాత్రి వరకు నాన్చి..రాత్రి 12.30 తర్వాత అనుమతి నిరాకరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బందిని ఎక్కడి వారిని అక్కడ అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యూనియన్‌ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్‌ను మంగళవారం పొద్దున్నే అరెస్టు చేసి అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో నిర్భందించారు.

ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా నిరసనలు
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులను అక్రమంగా అరెస్టులు చేసిందనీ, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 17.18 తేదీల్లో రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) పిలుపునిచ్చింది. ఇప్పటికైనా పంచాయతీ కార్మికుల వేతనాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేసింది. ఈనెల రెండున ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరింది. సీఎం హామీ ప్రకారం గ్రీన్‌ ఛానల్‌ ద్వారా వేతనాలు చెల్లించాలనీ, పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి మల్టీపర్పస్‌ వర్కర్‌ పని విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రేండేండ్లుగా వేతనాలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో టీఎస్‌ బి పాస్‌ ద్వారా కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నదని తెలిపారు. ఈ కాలంలో రూ.876 కోట్ల నిధులను కేటాయించి వేతనాలు చెల్లిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని కాలరాస్తూ పంచాయతీ కార్మికులు ప్రతినెలా పొందే వేతన హక్కును రద్దు చేస్తూ మార్చి 2న పంచాయతీ కార్మికుల వేతనాలకు ఇకనుండి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించదనీ, పంచాయతీలకు 15వ ఫైనాన్స్‌ గ్రాంట్‌ నుంచి లేదా స్టేట్‌ ఫైనాన్స్‌ నిధుల నుంచి గాని ఇతర ఆదాయాలోంచి మాత్రమే కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయటం ఆందోళనకరమన్నారు. దీంతో ప్రతినెలా వేతనం పొందే హక్కును కార్మికులు కోల్పోతున్నారని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మరింత ఉధృత పోరాటాలు తప్పవని హెచ్చరించారు. అరెస్టయిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

శాంతియుతంగా ప్రదర్శన.. పోలీసుల ఓవరాక్షన్‌
హైదరాబాద్‌లోని అశోక్‌ నగర్‌ చౌరస్తా నుంచి శాంతియుతంగా ర్యాలీ కొనసాగిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను పోలీసులు అడుగడు గునా అడ్డుకున్నారు. అనుమతివ్వండీ.. వినతిపత్రం అందజేస్తం అంటూ సంఘం నేతలు పోలీసు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. దీంతో పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్భంధం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ, పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలనీ, కనీస వేతనాలు ఇవ్వాలనీ, బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించా లని నినదించారు. ఇందిరాపార్కు చౌరస్తాలో కార్మికులంతా బైటాయించారు. పోలీసులు రోఫ్‌తో చుట్టిముట్టారు. కార్మికులను బలవంతంగా అరెస్టు చేశారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పైళ్ల గణపతిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చాగంటి వెంకటయ్య, రాష్ట్ర మహిళా నాయకు రాలు పొట్టా యాదమ్మ, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, పి శ్రీకాంత్‌తో పాటు వివిధ జిల్లాల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -